నాకు అన్న లేడు .. ఎందుకు అంటే అంతే .. !
ధర్మపురి అరవింద్ 2018లో తన సోదరుడు సంజయ్ మీద లైంగిక వేధింపుల కేసు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
By: Garuda Media | 5 Sept 2026 7:05 PM IST‘నాకు అన్న లేడు. అతను లేక 20 ఏళ్లు అవుతుంది. ఎందుకు అంటే అంతే. నాకు ఇద్దరు కొడుకులు, తనకు ఇద్దరు కొడుకులు. కానీ నాకు అన్న లేడు’ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మంత్రి దివంగత ధర్మపురి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే. ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాగా, మరొకరు మాజీ నిజామాబాద్ మేయర్, మున్నూరు కాపు సంఘం నేత ధర్మపురి సంజయ్.
ధర్మపురి అరవింద్ 2018లో తన సోదరుడు సంజయ్ మీద లైంగిక వేధింపుల కేసు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ‘సంజయ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు. 20 ఏళ్లుగా మా మధ్య సంభాషణలు కూడా లేవు అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత 2022 మరియు 2023లలో కూడా పలు సంధర్భాల్లో నాకు సోదరుడు లేడు అని అన్నాడు.
2000 సంవత్సరం నుండి వారి మధ్య కుటుంబంలో విభేధాలు ఉన్నట్లు తెలుస్తుంది. వారి మధ్య సంభాషణలు లేకపోవడంతో పాటు, ఎన్నడూ కలిసిన దాఖలాలు కూడా బయటకు తెలియదు. చివరకు వారి తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియల సంధర్భంలో కూడా ఎక్కడా వారిద్దరూ కలిసి వేదిక పంచుకున్నది కనిపించలేదు.
ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా, రాజ్యసభ సభ్యుడుగా, నిజామాబాద్ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తరువాత 2024 జూన్ లో మరణించారు. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో మొదలయిన విభేదాలు తండ్రి పార్టీ మార్పుతో ఎక్కువైనట్లు తెలుస్తుంది.
2006లో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మొదటి మేయర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన సంజయ్ ఆ తరువాత తండ్రి వెంట బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2025 నవంబరులో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయిన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అరవింద్ ను ఆహ్వానించినా ఆ కార్యక్రమానికి రాలేదు.
క్రికెటర్ అయిన ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీలో చేరి 2019, 2024లలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించాడు. అయితే తన సోదరుడితో విభేధాలు ఎందుకు అనే విషయం మాత్రం తాను ఎక్కడా బయటకు చెప్పలేదు.
