వైసీపీ పెద్దాయన ఉత్సాహం ఓకే కానీ ?
ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ నేతగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో అనేక సార్లు మంత్రి అయిన సుదీర్ఘ కాలం అమాత్య పదవిలో ఉన్న ఏకైక నేతగా రికార్డు సాధించారు.
By: Satya P | 7 Nov 2025 11:10 AM ISTఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ నేతగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో అనేక సార్లు మంత్రి అయిన సుదీర్ఘ కాలం అమాత్య పదవిలో ఉన్న ఏకైక నేతగా రికార్డు సాధించారు. ఆయన ఏకంగా పన్నెండేళ్ళకు పైగా మంత్రి పదవిలో ఉన్నారు. ఇక అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ అంశం మీద అయినా ఆయన స్టడీ పూర్తిగా చేస్తే కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు అని పేరు. అంతే కాదు అసెంబ్లీలో కూడా ఆయన స్పీచ్ ని అంతా ఆసక్తిగా ఉంటారు. దాని కోసం ఆయన బాగా కసరత్తు చేసి మరీ సభకు వస్తారు.
ఓటమి తరువాత షాక్ :
ఇక వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అయింది. ఆ వెంటనే శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్దాయనగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. దాదాపుగా ఏడాదికి పై దాటినా ఆయనలో ఉలుకూ పలుకూ లేదు, పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రసాదరావు అయితే వచ్చే వారు కాదు, దానికి తోడు ఆయన జనసేన టీడీపీ లోకి వెళ్తారు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒక దశలో ఆయన సొంత సీటు శ్రీకాకుళం అసెంబ్లీకి కొత్త ఇంచార్జిని నియమిస్తారు అని కూడా ప్రచారం సాగింది. ఇలాంటి ఎన్నో ప్రచారాల మధ్యన ధర్మాన ప్రసాదరావు అయితే జనంలోకి వస్తున్నారు లేట్ గా అయినా లేటెస్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. కూటమిని ఇరకాటంలో పెడుతున్నారు.
అంతా ఓకే కానీ :
అయితే ప్రసాదరావు జనంలోకి రావడం కూటమి మీద తన పదునైన మాటలతో దూకుడు చేయడం వరకూ ఓకేగా ఉన్నా అది ఎంత కాలం అన్నది కూడా వైసీపీలో మరో వైపు చర్చగా ఉందిట. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు సడెన్ గా సైలెంట్ అవుతారు అని కూడా చెబుతారు గతంలో చాలా సార్లు అలా జరిగింది అని అంటున్నారు. దాంతో ఆయన ఇపుడు చూపించిన ఊపూ ఉత్సాహం ఇదే దూకుడూ 2029 ఎన్నికల దాకా చూపిస్తారా అన్న డౌట్లు అయితే సొంత పార్టీలోనే చాలా మందికి వస్తున్నాయట.
హైకమాండ్ నుంచేనా :
అయితే హైకమాండ్ ఈ జిల్లా విషయంలో ప్రత్యేక దృష్టిని పెట్టిందని ప్రసాదరావుని యాక్టివ్ కావాలని కోరిందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా ప్రెసిడెంట్ గా అన్న క్రిష్ణ దాస్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చేశారు. అదే సమయంలో తన కుమారుడు జెడ్పీటీసీ క్రిష్ణ చైతన్యకు నరసన్నపేట నుంచి 2029 ఎన్నికల్లో టికెట్ కన్ ఫర్మ్ చేయించుకున్నారు అని అంటున్నారు. అదే తీరున ప్రసాదరావుకు కూడా హై కమాండ్ నుంచి ఒక హామీ అయితే దక్కింది అని అంటున్నారు. ప్రసాదరావు కుమారుడు రాం మనోహర్ నాయుడుకు 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా టికెట్ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు అంగీకరించారని అందుకే ఆయన కూడా దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా 2029 ఎన్నికల దాకా ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ స్పీడ్ పెంచి గేర్ మార్చి పార్టీని గెలిపించేలా చూడాలని క్యాడర్ కోరుతోంది. ఈ ఇద్దరు పెద్దలూ తలచుకుంటే జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం రావడం అన్నది పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. మొత్తానికి ఇదన్న మాట అసలు మ్యాటర్ అని అంటున్నారు.
