Begin typing your search above and press return to search.

గౌరవం ఉన్న చోటే ఉంటాం...ధర్మాన సంచలన వ్యాఖ్యలు !

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక తెలుగు టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తమకు గౌరవం ఉన్న చోటనే ఉంటామని చెప్పారు.

By:  Satya P   |   27 Sept 2026 9:24 AM IST
గౌరవం ఉన్న చోటే ఉంటాం...ధర్మాన సంచలన వ్యాఖ్యలు !
X

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక తెలుగు టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తమకు గౌరవం ఉన్న చోటనే ఉంటామని చెప్పారు. లేని చోట ఉండే ప్రసక్తి లేదని అన్నారు. ఆయన ఇంత స్పష్టంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే తనది నాలుగు దశాబ్దాల పై చిలుకు రాజకీయ జీవితం అన్నారు. ఎన్నో సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశాను అన్నారు. ఇక తన మొత్తం రాజకీయ జీవితం కాంగ్రెస్ అలాగే వైసీపీతో ముడిపడి ఉందని చెప్పారు.

తండ్రీ తనయుడు అంటూ :

తమకు వైఎస్సార్ ఎంతో గౌరవించారని అలాగే ఆయనతో కలసి కాంగ్రెస్ లో పనిచేశామని అన్నారు. ఇపుడు తనయుడు జగన్ తోనూ అలాగే ముందుకు సాగుతున్నామని చెప్పారు. జగన్ తో పాటే తన మీద కూడా సీబీఐ కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. తమకు కాంగ్రెస్ లో కానీ వైసీపీలో కానీ గౌరవం దక్కుతోందని చెప్పారు. అలాంటపుడు తాము వేరే విధంగా ఆలోచించేది ఉండదని అన్నారు. తమకు ఇదే రకమైన గౌరవం మరో చోట లభించదని కూడా ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. ఇక తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పనిచేయాలని జగన్ తనను కోరారని తాను వెళ్ళలేదని వస్తున్న వారతలు అన్నీ చూస్తున్నాను అన్నారు. వాటి సంగతి పక్కన పెడితే జగన్ ని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం కోసం తాను సీనియర్ నేతగా తన వంతుగా పనిచేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.

పోటీ చేయకపోవచ్చు :

అదే సమయంలో తాను పోటీ చేయవచ్చు లేదా లేకపోవచ్చు అది వేరే విషయం అని ఆయన అన్నారు. అంటే 2029 లో ధర్మాన పోటీ చేయరా అన్న కొత్త చర్చ మొదలైంది. తరచూ ఆయన ఇదే మాట అనడం వల్ల కూడా ఈ తరహా అనుమానాలు అయితే వస్తున్నాయని అంటున్నారు. అయినా సరే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకుని రావడం తమ బాధ్యత అని ధర్మాన చెప్పుకొచ్చారు.

విజయసాయి మీద :

ఇక విజయసాయిరెడ్డి మీద కూడా ధర్మాన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ మీద చేస్తున్న విమర్శలు కానీ జగన్ మీద చేస్తున్నవి కానీ పార్టీలో ఉన్నపుడు చేయలేదు కదా అని ధర్మాన అన్నారు. ఒక కొత్త పార్టీ పెడతాను అని ఆయన చెబుతూ చేస్తున్న వ్యాఖ్యలకు విలువ ఏమి ఉంటుందని అన్నారు. వైసీపీలో నంబర్ టూలు ఏవీ లేవని తమకు ఒకే ఒక్క లీడర్ అని చెప్పారు. ప్రాంతీయ పార్టీలో నాయకుడి ఆలోచనలే ఫైనల్ అని ఆయన అన్నారు. నాయకుడు నిర్ణయం తీసుకోకముందే తాము ఏదైనా చెబుతామని ఒకసారి తీసుకున్నాక కట్టుబడి తీరాల్సిందే అన్నారు.

కోటరీల గురించి :

ఇక జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుందని ఆయన కళ్ళకు గంతకు కట్టేసి అన్నీ ఆయనకు నచ్చిన విషయాలే చెబుతారు అని అంటారని యాంకర్ వేసిన ప్రశ్నకు ధర్మాన బదులిస్తూ అలాంటిది ఏమీ లేదని అన్నారు. జగన్ ఇక నిబద్ధత కలిగిన నాయకుడుగా చెప్పారు. ఆయన పేదల కోసం ఏమైనా చేయాలని ఆలోచించే నేత అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. జగన్ ని ఎవరూ ప్రభావితం చేయలేరని ధర్మాన చెప్పడం విశేషం.

మూడు రాజధానులు :

మూడు రాజధానుల విషయం భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంటూ ధర్మాన వ్యాఖ్యలు చేశారు. లీగల్ ఇష్యూస్ వల్లనే అది ముందుకు సాగలేదని అన్నారు. ఏది ఏమైనా వికేంద్రీకరణ తమ విధానం అన్నారు. జగన్ మావిగన్ అని చెప్పినా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారు అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వచ్చినా అలాగే చేస్తామని ధర్మాన స్పష్టం చేశారు.