ఎన్నికల రాజకీయాలకు వైసీపీ కీలక నేత గుడ్ బై!
అయితే పార్టీ అధిష్టానం ఒత్తిడితో తప్పనిసరిగా పోటీ చేయాల్సివచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 4 Oct 2025 2:00 AM ISTమాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ధర్మాన కృష్ణదాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణదాస్ ప్రకటించారు. వైసీపీతో రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూనే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. వయసుతోపాటు తన రాజకీయ వారసుడైన కుమారుడికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే కృష్ణదాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే కుమారుడు కృష్ణచైతన్యను ప్రజల్లోకి తిప్పి భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దాలని కృష్ణదాస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణదాస్ ప్రకటన చేయడం వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణదాస్ నిర్ణయం అనూహ్యమేమీ కాకపోయినప్పటికీ ఆకస్మికంగా ప్రకటన చేయడంతో కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణదాస్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన కృష్ణదాస్ 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మూడో సారి గెలిచారు. ఇక 2014లో ఓటమి తర్వాత 2019లో నాలుగోసారి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో తొలి రెండున్నరేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
నిజానికి గత ఎన్నికలకు ముందే ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని భావించారని వార్తలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం ఒత్తిడితో తప్పనిసరిగా పోటీ చేయాల్సివచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. 2004 ఎన్నికలకు ముందు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన కృష్ణదాస్.. తన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రోద్బలంతో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం 1989 నుంచి ధర్మాన కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. 1989 నుంచి 2024 వరకు జరిగిన వరుస ఎన్నికల్లో కేవలం మూడుసార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. మిగిలిన ఆరు ఎన్నికల్లోనూ ధర్మాన కుటుంబ సభ్యులే విజయం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో నరసన్నపేట నుంచి ధర్మాన కుటుంబ సభ్యులను ఢీకొట్టడం అంత తేలికైన విషయం కాదని చెబుతుంటారు. అయితే 2014, 2024ల్లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ సొంత గ్రామానికి చెందిన బగ్గు రమణమూర్తి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈ రెండు సార్లు రాష్ట్రంలో టీడీపీ గాలి బలంగా వీయడం వల్లే ఎమ్మెల్యేగా బగ్గు రమణమూర్తి గెలిచారని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ఇక గత ఎన్నికల్లో కూడా ధర్మాన కృష్ణదాస్ గెలుపు నల్లేరుపై నడకే అని ఆ పార్టీ భావించగా, రిజల్ట్ మాత్రం తలకిందులైంది. అయితే దీనికి కారణం కూడా ధర్మాన కృష్ణదాస్ పోటీ నుంచి విరమించుకుంటారని అంతకుముందు జరిగిన ప్రచారమే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో తండ్రి స్థానంలో నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిన డాక్టర్ కృష్ణ చైతన్య సీనియర్లను కలుపుకుని వెళ్లడంలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో చివరి నిమిషంలో ఆయనను కాదని వైసీపీ మళ్లీ కృష్ణదాస్ నే పోటీ చేయమని ఆదేశించింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న కృష్ణదాస్, గత కొంతకాలంగా చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. 2029 ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ పోటీ చేస్తారని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అయితే 70 ఏళ్ల వయసు పైబడటంతో తాను తప్పుకుని కుమారుడిని రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్న కృష్ణదాస్ దసరా సందర్భంగా తన మనోగతాన్ని బయటపెట్టారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉండటం, తాను వెనకుండి కుమారుడిని నడిపించాలని భావిస్తున్నారు కృష్ణదాస్. అయితే ఆయన నిర్ణయాన్ని పార్టీ స్వాగతిస్తుందా? లేక తిరస్కరించి ఆయననే సమన్వయకర్తగా కొనసాగమని ఆదేశిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
