వైసీపీ ఎందుకు ఓడిందో చెప్పిన ధర్మాన
ఏపీలో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ ఆ పార్టీలో ఒక కం ఫ్యూజన్ ఉందా అని అంటున్నారు. ఎందుకంటే వివిధ సందర్భాలలో ఆ పార్టీ నేతలు ఓటమి గురించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అదే అర్థం అవుతోంది.
By: Satya P | 27 Sept 2026 9:23 AM ISTఏపీలో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ ఆ పార్టీలో ఒక కంఫ్యూజన్ ఉందా అని అంటున్నారు. ఎందుకంటే వివిధ సందర్భాలలో ఆ పార్టీ నేతలు ఓటమి గురించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అదే అర్థం అవుతోంది. ఈవీఎంల వల్లనే వైసీపీ ఓటమి చెందింది అని కూడా అన్నారు. అలాగే వైసీపీ ఓటమికి తమ పధకాలను సరిగ్గా చెప్పుకోలేకపోయామని అన్నారు. వైసీపీ ఓటమికి కూటమి పార్టీలు చేసిన అవాస్తవాల ప్రచారం కారణం అన్నారు. ఇపుడు వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అయితే తాము పెద్ద ఎత్తున సంస్కరణలను ఏపీలో అమలు చేశామని వాటి ఫలితాలు రాకుండానే ఎన్నికలు వచ్చాయని అందుకే దెబ్బ తిన్నామని విశ్లేషించారు. ఒక ప్రముఖ తెలుగు చానల్ వీకెండ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతికూలత అక్కడే :
ఏపీలో వైసీపీ కేవలం అయిదేళ్ల కాలంలోనే ఎన్నో కార్యక్రమాలను చేసింది అన్నారు. పల్లెటూర్లలో కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే వందేళ్ల పాటు జరగని భూ సర్వేను తాము చేసి చూపించామని చెప్పారు. ఇంకా ప్రజల వద్దకే పాలన వంటి ఎన్నో అంశాలలో వైసీపీ సంస్కరణల దిశగా అడుగులు వేసింది అన్నారు. కానీ వాటి ఫలితాలు చవి చూడకముందే ఎన్నికలు రావడమే ఓటమికి కారణం అని ధర్మాన అన్నారు. మరో వైపు తాము చేసిన ప్రతీ కార్యక్రమం మీద టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా తాము ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నారు.
భూములు లాక్కుంటారు అనే :
ఇక భూ సర్వే పేరుతో జగన్ భూములు తీసుకుంటారు అన్నది టీడీపీ చేసిన ఒక దారుణమైన ఆరోపణ అన్నారు. నిజంగా ఒక సెంట్ భూమి కూడా ప్రజలది తీసుకునే హక్కు దేశంలో రాష్ట్రపతికి కూడా ఉండదని అన్నారు. అయినా సరే తమకు ఉన్న బలమైన మీడియా ఆధారంగా టీడీపీ జనాలను నమ్మించగలిగింది అని ధర్మాన విమర్శించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీ ఈ ఇష్యూని ఎత్తుకోవడం వల్ల సమయాభావం వల్ల తాము తిప్పుకొట్టలేకపోయామని అన్నారు. ఇది జనంలోకి అందుకే వెళ్ళిపోయింది అని అన్నారు. సర్వే రాళ్ళ మీద పట్టా దారు పాస్ బుక్కు మీద జగన్ బొమ్మ ఉన్నంత మాత్రాన సదరు భూమిని తీసుకుంటారు అని చెప్పడం తప్పు అని ధర్మాన స్పష్టం చేశారు.
అమరావతి మీద వ్యతిరేకత :
తాము అమరావతి రాజధానిని వ్యతిరేకించడం లేదని ధర్మాన క్లారిటీ ఇచ్చారు. అయితే అమరావతి పేరుతో జరుగుతున్న కేంద్రీకరణ అభివృద్ధిని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రజలు కట్టిన సొమ్ముని రాజ్యాంగం ప్రకారం అన్ని చోట్లా ఖర్చు చేయాల్సి ఉందని కానీ కేవలం అమరావతికే పెడుతున్నారని మరి వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల పరిస్థితి ఏమిటని ధర్మాన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం హయాంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధిని విస్తరించామని చెప్పారు. మావిగన్ పేరుతో జగన్ చేసిన ప్రతిపాదన కూడా వికేంద్రీకరణలో భాగమే అన్నారు. మూడు రాజధానుల విషయంలో న్యాయపరమైన అడ్డంకులను సృష్టించారు అని ఆయన విమర్శించారు.
క్రెడిట్ చోరీ అంటే :
ఇక ఏపీలో క్రెడిట్ చోరీ వార్ సాగుతోంది అన్న దాని మీద ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ చేసిన అభివృద్ధిని తనదిగా చంద్రబాబు చెప్పుకోవడం తగదని అన్నారు. ఉత్తరాంధ్రాలో ఎయిర్ పోర్టు కానీ శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కానీ గూగుల్ డేటా సెంటర్ కానీ ఇతర పరిశ్రమలు కానీ జగన్ హయాంలోనే చేసినవి అన్నారు. వాటి ఫలితాలు ఇపుడు కనిపిస్తూంటే అంతా తానే చేశాను అని చంద్రబాబు చెప్పుకోవడం మంచి విధానమేనా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కు చంద్రబాబు చేసిన నిఖార్సు అయిన పని కానీ తీసుకుని వచ్చిన ప్రాజెక్ట్ కానీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
