Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన ఫ్యామిలీలో రాజ‌కీయ ర‌చ్చ‌.. ఏం జ‌రిగింది..!

ఇది ఇలా ఉంటే ధర్మాన కృష్ణ దాస్ వైసీపీలోనే కొనసాగుతుండగా ప్రసాదరావు మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు.

By:  Garuda Media   |   21 Aug 2025 1:00 PM IST
ధ‌ర్మాన ఫ్యామిలీలో రాజ‌కీయ ర‌చ్చ‌.. ఏం జ‌రిగింది..!
X

శ్రీకాకుళం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్‌ సోదరుల మధ్య రాజకీయ విభేదాలు చోటుచేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. ఇద్దరూ వైసీపీలోనే ఉన్నప్పటికీ రాజ కీయంగా విభేదించుకుంటున్నారన్న చర్చ సొంత పార్టీలోనే నెలకొంది. వాస్తవానికి ఇద్దరి నియోజకవ ర్గాలు వేరువేరు అయినప్పటికీ స్వభావాల రీత్యా ఇద్దరి మధ్య వైసీపీలో కొనసాగడంపై అంతర్గతంగా చర్చ నడుస్తోందని, ఈ విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు నెలకొన్నాయని శ్రీకాకుళంలో రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నరసన్నపేట నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన కృష్ణదాస్ అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గ నుంచి గెలుపొందిన ధర్మాన ప్రసాదరావు ఇద్దరు జగన్ మంత్రివర్గంలో ఒకరి తర్వాత ఒకరు పని చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ఇద్దరు తమ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్న‌ నేపథ్యంలో జగన్ వారసులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రత్యక్షంగా మరోసారి వీరే పోటీ చేశారు. కానీ, కూటమి ప్రభావం నేపథ్యంలో ఇద్దరు పరాజయం పాలయ్యారు.

ఇది ఇలా ఉంటే ధర్మాన కృష్ణ దాస్ వైసీపీలోనే కొనసాగుతుండగా ప్రసాదరావు మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను, పార్టీ అధినేత నిర్వహించే సమీక్షల్లో కూడా ప్రసాద్ రావు ఎక్కడ కనిపించడం లేదు. వ్యక్తిగతంగా కూడా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. గతంలో అనేక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి తన వాయిస్ వినిపించిన ధర్మాన ప్రసాదరావు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు రావడం మానేశారు. పైగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారి తన కుమారుడిని ఎమ్మెల్యే చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలోనే కృష్ణ దాస్ విభేదిస్తున్నారనేది ప్రధానంగా ప్రస్తుతం తెర‌ మీదకు వచ్చిన చర్చ. మంత్రివర్గంలో అవకాశం కల్పించి గౌరవించిన వైసీపీని వదిలేసుకోవడం సరికాదన్నది కృష్ణ దాస్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. కానీ, ప్రసాదరావు మాత్రం రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమైనవేన‌ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లడం తప్పు కాదని అంటున్నారట. కానీ, వైయస్ హయాం నుంచి తమ కుటుంబం వైయస్ వెంటే నడిచిందని ఆ తర్వాత ఆయన కుమారుడికి అనుకూలంగా మారిందని కృష్ణదాస్ చెప్తున్నారు.

ఇప్పుడు జగన్ ను వదిలి వెళ్ళటం వల్ల వచ్చే ప్రయోజనం కంటే వ్యక్తిగతంగా పోయే పరువు ప్రతిష్టలను ఆయన ప్రస్తావిస్తూ ధర్మాన ప్రసాదరావును పార్టీ మారొద్దని వైసీపీలోనే కొనసాగాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు సైలెంట్గా ఉంటున్నారని.. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వాస్తవానికి రాజకీయాల్లో ఎవరిష్టం వారిది అయినప్పటికీ కొందరు విలువలను పాటించి ఆయా పార్టీలోనే కొనసాగుతుండగా మరికొందరు మాత్రం అవకాశాన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో ధర్మాన ప్రసాదరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలను నిశితంగా గమనిస్తున్నారు. తనతో ఉండే వారెవరు వెళ్లే వారెవరు అనేది కూడా ఆయన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తను అడ్డు చెప్పేది లేదన్న సంకేతాలను ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.