Begin typing your search above and press return to search.

ధర్మాన బ్రదర్స్ మీదనే పూర్తి భారం !

ఇక జిల్లాలో వైసీపీకి ధర్మాన బ్రదర్స్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా వర్గ పోరు కూడా అదనపు సమస్యగా ఉంది.

By:  Satya P   |   23 July 2026 8:29 AM IST
ధర్మాన బ్రదర్స్ మీదనే పూర్తి భారం !
X

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయం ఇబ్బందులో పడుతోంది. 2019 నుంచి 2024 మధ్యలో తారు రోడ్డు మీద జోరుగా సాగిన వైసీపీ పాలిటిక్స్ కాస్తా 2024 నుంచి ఉల్టా పల్టా అయ్యాయి. రెండేళ్ళ కాలంలో వైసీపీ ఏ మాత్రం ఎత్తిగిల్లింది అయితే లేదు. పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. భారీ ఓటమి ఒక్క సీటు కూడా జిల్లాలో గెలుచుకోలేకపోవడంతో వైసీపీ చతికిలపడింది. ఈ సమయంలోనే వైసీపీలో ముఖ్య నాయకులుగా ఉన్న వారు అంతా కూడా సైడ్ అయిపోతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా అరెస్ట్ కావడం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక మరో సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్టు అవుతారని అంటున్నారు. హైకోర్టు లో ఆయన ఫ్యామిలీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసింది. ఆ తీర్పును బట్టి తమ్మినేని కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంది.

వారే పెద్ద దిక్కుగా :

ఈ కీలక సమయంలో జిల్లాలో వైసీపీని నడిపించే గురుతర బాధ్యతలు ధర్మాన కుటుంబం మీదనే పడింది అని అంటున్నారు. మాజీ మంత్రులు సీనియర్ నేతలుగా ధర్మాన ఫ్యామిలీ జిల్లా రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. చిత్రమేంటి అంటే జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ధర్మాన క్రిష్ణదాస్ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదని అంటున్నారు. జిల్లాలో పార్టీని ఏకత్రాటిపైన నడిపించాల్సిన సమయంలో మొక్కుబడి ప్రెస్ మీట్లతోనే ముగించేస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి. మరో కీలక నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వ్యూహకర్తగా పేరుంది. కానీ ఆయన కూడా అంతగా చురుకుగా లేరని అంటున్నారు. కారణాలు ఏమి అయినా ఈ బ్రదర్స్ ఇద్దరూ వైసీపీకి జిల్లాలో ఊపునిచ్చే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేకపోతున్నారు అని విమర్శలు ఉన్నాయంటున్నారు.

బ్రదర్స్ వర్సెస్ అదర్స్ :

ఇక జిల్లాలో వైసీపీకి ధర్మాన బ్రదర్స్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా వర్గ పోరు కూడా అదనపు సమస్యగా ఉంది. ఈ ఇద్దరి మీద తరచూ విమర్శలు చేసి ఆనక తన వ్యక్తిగత వివాదాలతో పార్టీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూరం అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇక తమ్మినేని సీతారాం కి బ్రదర్స్ కి మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటుకు వేరే వారు పోటీ చేస్తారు అని ఆ మధ్య జిల్లా అధ్యక్షుడి హోదాలో క్రిష్ణదాస్ చేసిన ప్రకటన ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇలా ధర్మాన బ్రదర్స్ వ్యతిరేక వర్గం గళం విప్పి పార్టీకి బ్రేకులు పడిన నేపథ్యంలో ఇపుడు ఆ వ్యతిరేక వర్గం అంతా కేసులు ఇతర ఇబ్బదులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గంలో నోరున్న పేరున్న తమ్మినేని దువ్వాడలు ఇపుడు చిక్కుల్లో పడడం వైసీపీకి కూడా క్షేమం కాదని అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు కూడా వైసీపీకి షాకింగ్ పరిణామం అంటున్నారు.

పటిష్టం చేస్తారా :

అయితే పార్టీలో వర్గ పోరు సంగతి పక్కన పెడితే ఇపుడు ధర్మాన బ్రదర్స్ అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తారా అన్న చర్చ సాగుతోంది. ధర్మాన బ్రదర్స్ కి జిల్లా అంతటా అనుచర గణం ఉంది. బలం ఉంది, మరి వారు పట్టు బిగిస్తే వైసీపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఫ్యాన్ రెక్కలు సరిగ్గా తిరగక ఉక్కబోతతో క్యాడర్ సతమతం అవుతోంది. మరి వైసీపీకి ఎదురవుతున్న సవాళ్ళకు ధీటైన జవాబు ధర్మాన బ్రదర్స్ రూపంలో ఇస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది. ఇక వైసీపీ అధినాయకత్వం కూడా కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే వైసీపీ జిల్లాలో రాజకీయంగా ఇబ్బందుల్లో పడిపోవడం ఖాయమని అంటున్నారు.