వామ్మో.. ఇంత రేట్ ఉన్నా.. అన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందా?
ప్రజలలో కొన్ని కొన్ని విశ్వాసాలు ఏ విధంగా పాతుకుపోయాయి అంటే అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా దక్కించుకోవాలనే ఆలోచనకు వస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా బంగారం విషయంలో కూడా అదే జరుగుతోంది
By: Madhu Reddy | 19 Oct 2025 11:38 AM ISTప్రజలలో కొన్ని కొన్ని విశ్వాసాలు ఏ విధంగా పాతుకుపోయాయి అంటే అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా దక్కించుకోవాలనే ఆలోచనకు వస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా బంగారం విషయంలో కూడా అదే జరుగుతోంది. నిన్న ధన త్రయోదశి కావడంతో ఆరోజు బంగారం లేదా వెండి ఆభరణాలను ఇంటికి తీసుకొస్తే శుభం కలుగుతుందనే విశ్వాసం ఇప్పటికీ జనాలలో బాగా ముదిరిపోయింది. ఆ కారణంతోనే బంగారు ధరలు పెరిగినా సరే నిన్న జరిగిన బంగారం బిజినెస్ విలువ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రేటు ఉన్నా సరే అన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. నిన్న ధన త్రయోదశి కావడంతో బంగారం ధరలలో కాస్త తగ్గుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ.2,400 తగ్గి రూ.1,32,400 గా నమోదు అయ్యింది. ఇలా బంగారం ధర తగ్గినప్పటికీ ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా నిన్న జరిగిన వ్యాపారం విలువ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు.
ఇకపోతే బంగారం ధరలలో తేలికపాటి తగ్గుదల కనిపించినా.. వినియోగదారుల సెంటిమెంటు ఇక్కడ ఉత్సాహంగా కనిపిస్తోంది. ధన త్రయోదశి భాగంలో వెండి, బంగారం కొనుగోలు ఏకంగా రూ.60 వేల కోట్లు దాటిందని నిపుణులు స్పష్టం చేశారు.. అటు బులియన్ మార్కెట్లో 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా తీవ్ర తగ్గుదలకు గురైంది.. అలా 10 గ్రాముల బంగారం ధర 2,400 తగ్గి 1,31,800కు చేరుకుంది. గత సంవత్సరం అక్టోబర్ 29న జరుపుకున్న ధన త్రయోదశిలో నమోదైన 10 గ్రాముల బంగారం ధర 81,400 తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51 వేలు పెరిగింది.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ధన త్రయోదశి నాడు కస్టమర్లు అన్ని రంగాలలో సుమారుగా లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బంగారం, వెండి అమ్మకాలు మాత్రమే 60 కోట్లను అందించాయని గత సంవత్సరం కంటే ఈసారి 25% ఎక్కువ లాభాలు లభించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇకపోతే బంగారం పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికపరంగా అమ్మకాల విలువ సుమారుగా 18% పెరిగింది. ఏది ఏమైనా బంగారం ధరలు ఈ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రజలలోని విశ్వాసం వారిని కొనుగోలు చేసేలా అడుగులు వేయించింది. ప్రస్తుతం ఈ లాభాలు చూసి ఎవరి దగ్గర డబ్బు లేనిది.. బంగారం ధరలు ఎంత ఉన్నా బంగారం మాత్రం కొనడం ఆపడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
