దేవినేని ఉమా...ఎక్కాల్సింది ఢిల్లీ ఫ్లైట్ సుమా !
తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన మాజీ మంత్రిగా పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు.
By: Satya P | 11 Nov 2025 9:00 AM ISTతెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన మాజీ మంత్రిగా పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. పాతికేళ్ళకు పైగా తెలుగుదేశంతో బంధం ఆయనది. తన అన్న దేవినేని రమణ విద్యా శాఖ మంత్రిగా ఉంటూ రైలు ప్రమాదంలో దుర్మరణం పాలు అయితే ఆ వెంటనే వారసత్వాన్ని అందుకుని టీడీపీలో ధీటైన నేతగా నిలించారు. ఉప ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఆ మీదట అనేక సార్లు గెలిచి వచ్చిన దేవినేని ఉమా అధినేత చంద్రబాబు మెప్పు పొందడంలోనూ ముందుండేవారు.
అంతా తానై :
నిజానికి చూస్తే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఎంతో మంది దిగ్గజ నేతలు ఉండే చోట ఉమా వారి మధ్యనే ఎదిగిన తీరు అగ్ర నేతగా వెలిగిన తీరు ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం అంటారు. ఆయన ఏపీ విభజన సమయంలో సమైక్య రాగం అందుకున్న తొలి నేతగా ఆనాడు ముందున్నారు. ఇక చంద్రబాబు 2012 ప్రాంతంలో చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఆయన వెంట ఉంటూ వచ్చారు. ఆయన కృషికి సరైన ఫలితం 2014లో దక్కింది. జల వనరుల శాఖను బాబు ఎంతో నమ్మకంగా అప్పగించారు. అంతే నమ్మకంగా ఉమా పనిచేసి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పరుగులు పెట్టించారు అని చెబుతారు.
పార్టీ మాటతోనే :
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభావంతో ఓటమి పాలు అయినా 2024 ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరుతామని మైలవరంలో ముందే ప్రచారం చేస్తూ వచ్చిన ఉమాకు అధినాయకత్వం నచ్చ చెప్పి పోటీ నుంచి పక్కన పెట్టింది. అలా వసంత క్రిష్ణ ప్రసాద్ కి సీటు వచ్చింది. అయితే ఏణ్ణర్ధం కాలంగా ఉమాకు ఎలాంటి పదవి దక్కడం లేదంటే ఆయనకు విస్మరించారు అని ప్రచారం కూడా సాగింది. అయితే అవన్నీ తప్పుడు వార్తలే అని అంటున్నారు. అధినాయకుడు చంద్రబాబు ఉమా విషయంలో ఇచ్చిన భరోసా అలాగే ఉందని ఆ మేరకు ఆయనకు సరైన సమయంలో న్యాయం జరుగుతుంది అని తాజాగా ప్రచారం ఊపందుకుంది.
నేరుగా రాజ్యసభకు :
ఉమాకు తొందరలోనే రాజ్యసభ యోగం దక్కబోతోంది అని అంటున్నారు. 2026లో ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక దానికి ఉమా కోసం రిజర్వ్ చేశారు అని అంటున్నారు మాజీ మంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా పార్టీలో సీనియర్ గా ఉమా చేసిన సేవాలకు ఆయన విధేయతకు ఇది పార్టీ అధినాయకత్వం ఇచ్చే ఒక భరోసా లాంటి బహుమానం అని అంటున్నారు. దాంతో ఉమా మరి కొద్ది నెలలలో ఎక్కేది ఢిల్లీ ఫ్లైట్ అని ఆయన అనుచరులు అయితే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఉమాకు మంచే జరుగుతుందని అంటున్నారు.
