Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో ప్రాణాలకు సేఫ్టీ లేదా..? అమెరికాలో మళ్లీ షూటింగ్..

అగ్రరాజ్యం అమెరికా కొంత కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో మిత్రత్వం పరంగా ఇబ్బంది ఎదుర్కొంటోంది.

By:  Tupaki Political Desk   |   29 Sept 2025 1:16 PM IST
అగ్రరాజ్యంలో ప్రాణాలకు సేఫ్టీ లేదా..? అమెరికాలో మళ్లీ షూటింగ్..
X

అగ్రరాజ్యం అమెరికా కొంత కాలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో మిత్రత్వం పరంగా ఇబ్బంది ఎదుర్కొంటోంది. యూఎస్ కు ఎప్పటి నుంచో మిత్రుడిగా ఉన్న ఇండియాను టారీఫ్ ల పేరుతో దూరం చేసుకుంది. దీనిని పక్కన పెడితే హింస కూడా చెలరేగుతూనే ఉంది. డెట్రాయిట్ సమీపంలోని మోర్మన్ చర్చిలో ఆదివారం జరిగిన హత్యాకాండ అమెరికా సమాజానికి మరో హెచ్చరికను చేసినట్టుంది. ప్రార్థనలో మునిగిపోయిన భక్తులపై దాడి జరగడం, నలుగురు ప్రాణాలు కోల్పోవడం, ఎనిమిది మందికి గాయాలు కావడం కేవలం ఒక ఘటన కాదు. ఇది అమెరికా సమాజంలో సంవత్సరాలుగా పునరావృతమవుతున్న దురదృష్టకర ధోరణికి కొనసాగింపు.

మానసిక వ్యాధితో బాధపడుతూ..

వాహనంతో చర్చిలోకి దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తి ఒక మాజీ మెరైన్ అని పోలీసులు ధృవీకరించారు. కొంత కాలంగా ఆయన మానసికమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. పౌరుల చేతికి తుపాకులు, మతపరమైన ద్వేషం ఇలాంటివి అన్నీ కలిసే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయనే వాస్తవాన్ని మరిచిపోలేం.

గతంలో ఇలాంటి ఘటనలే..

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. 2015లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో టెక్సాస్‌లోని సతర్లాండ్ స్ప్రింగ్స్ బాప్టిస్ట్ చర్చిలో దాడి జరగగా, 26 మంది అసువులు బాసారు. 2018లో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ సినగాగ్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది బలయ్యారు. ఒక్కోసారి చర్చి, ఇంకోసారి సినగాగ్, మరొకసారి సిక్కు గురుద్వారా.. మతపరమైన ప్రార్థనా మందిరాలు రక్తసిక్తమవడం అమెరికా చరిత్రలో విషాదకర అధ్యాయాలుగా నిలిచిపోయాయి.

కంటి తుడుపుగా అమెరికా చర్యలు..

ప్రతి దాడి తర్వాత ప్రజలు తీవ్ర కోపోద్రేకులు అవుతుండగా.. పాలకులు మాత్రం సానుభూతి తెలుపుతూ కంటి తుడుపు చర్యగా సాగుతోంది. పౌరుల వద్ద గన్ ఉండడం మంచిదికాదని, ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని అనుకుంటున్నా.. ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం నాయకులు పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. తుపాకులు సులభంగా దొరకడం వల్ల కోపం, మానసిక బాధలు లాంటి వాటిని తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని సైకాలజిస్టులు చెప్తున్నారు. స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ప్రార్థనా మందిరాల గురించి తరుచుగా వింటూనే ఉన్నాం.

తోపులాట నేపథ్యంలో అగ్ని ప్రమాదం..

గన్ తో ఉన్న వ్యక్తి కాల్పులు చేస్తున్న సమయంలో ప్రార్థనకు వచ్చిన వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ తోపులాటలు.. తర్వాతి పరిస్థితుల్లో భవనంకు మంటలు అంటుకున్నాయి. ఇది ప్రార్థనా మందిరాల్లో భద్రతను ఎత్తి చూపుతోంది. ఈ మంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా పబ్లిక్ ప్లేస్‌లలో ఫైర్ సేఫ్టీ చర్యలు సరిగ్గా లేకపోవడం, లేదంటే నిర్వహించకపోవడం ఆశ్చర్యకరం.

భద్రతకు చర్యలు తప్పనిసరి..

మతపరమైన సహనం, పౌర భద్రత, తుపాకుల నియంత్రణ ఇవన్నీ అమెరికా సమాజం ముందున్న అతిపెద్ద సవాల్ గా కనిపిస్తోంది. ప్రతి ఘటన తర్వాత కేవలం కొవ్వొత్తులతో వారి ఆత్మశాంతికి నివాళులర్పించడం తప్ప పూర్తి స్థాయి నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ప్రార్థన అంటే శాంతి, ప్రార్థనా మందిరం అంటే ఆరాధకులకు ఆత్మ శాంతిని ఇచ్చే ప్రదేశం. అలాంటి ప్రదేశాల్లో రక్తపాతం అమెరికా సంస్కృతికి మచ్చతెచ్చే అంశం. డెట్రాయిట్ చర్చిలో జరిగిన ఈ దారుణం.. గతంలోని దాడులతో కలిపి చూస్తే, అమెరికా పాలకవర్గాలు ఆలస్యం లేకుండా సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అత్యవసరత స్పష్టం అవుతోంది.