3 రోజులుగా వీవీఐపీల సెర్చ్ లో భారత్ లోని ఆ ఎయిర్ పోర్టు
దేశంలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఎక్కువ మంది ఓటేయటమే కాదు.. రాయల్ గా వివాహ వేడుకను నిర్వహించుకోవాలంటే ఉదయపూర్ కు మించిన ప్లేస్ మరొకటి ఉండదు.
By: Garuda Media | 24 Nov 2025 10:22 AM ISTదేశంలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఎక్కువ మంది ఓటేయటమే కాదు.. రాయల్ గా వివాహ వేడుకను నిర్వహించుకోవాలంటే ఉదయపూర్ కు మించిన ప్లేస్ మరొకటి ఉండదు. తాజాగా అమెరికాకు చెందిన బిలియనీర్ ఎన్ఆర్ఐ రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన పెళ్లి వేడుక పుణ్యమా అని ఈ లేక్ సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. 2025లోనే అత్యంత విలాసవంతమైన పెళ్లిగా గుర్తింపు పొందిన ఈ వివాహ వేడుక పుణ్యమా అని ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టు ప్రముఖులు.. సెలబ్రిటీలు.. వీవీఐపీలతో కిటకిటలాడింది.
అదెంత భారీగా అంటే.. మూడు రోజుల వ్యవధిలో 70ప్లస్ చార్టెడ్ ఫ్లైట్లు ఇక్కడ ల్యాండ్ అయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు చొప్పున వస్తున్న ప్రముఖులతో.. ఈ ఎయిర్ పోర్టు విపరీతమైన బిజీగా మారింది. భారతదేశంలో మొత్తం 159 ఎయిర్ పోర్టులు ఉంటే.. అందులో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాలు 147. అంతర్జాతీయ విమానాశ్రయాలు 34 ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది చివరి నాటికి దేశంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్యను 220కు పెంచాలని భావించినా.. అది సాధ్యం కాలేదు.
ఉదయపూర్ విమానాశ్రయ విషయానికి వస్తే.. మహారాణా ప్రతాప్ పేరుతో నిర్వహించే ఈ ఎయిర్ పోర్టు దేశంలోని ఇతర ఎయిర్ పోర్టులతో పోలిస్తే మధ్యస్థాయి ఎయిర్ పోర్టుగా చెప్పొచ్చు. చూసేందుకు చిన్నగా ఉండే ఈ ఎయిర్ పోర్టుకు ఒక ప్రత్యేకత ఉంది. పరయాణికుల సేవల్లో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ ఎయిర్ పోర్టు సుమారు 504 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ.. ఆర్థిక రాజధాని ముంబయిల్లో ఉన్న విమానాశ్రయాలతో పోలిస్తే ఇది చాలా చాలా చిన్నది.
అయితే.. చాలా ఎయిర్ పోర్టులకు సాధ్యం కాని మరో ప్రత్యేకత దీని సొంతం. ఎయిర్ పోర్టులో పీక్ అవర్స్ లో 600 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం దీని సొంతం. ఒకే రన్ వే ఉన్నప్పటికి.. ఒకేసారి ఐదు ఎయిర్ బస్ ఏ320 లేదంటే బోయింగ్ 737 రకం ఫ్లైట్లను పార్కింగ్ చేసే స్థలం ఈ ఎయిర్ పోర్టుకు ఉంది. ఉదయ్ పూర్ పర్యాటక ప్రాంతం కావటంతో ఈ ఎయిర పోర్టుకు తరచూ ప్రముఖులు.. సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు.
ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టుకు అంతకంతకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పెద్ద అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణంలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ లో అంతర్జాతీయ విమాన సేవల్ని అందించే వీలుంటుంది. ఇప్పటికైతే.. ఈ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే మహా అయితే చెకిన్ సమయానికి అరగంట ముందు వస్తే సరిపోతుంది. కొందరు చెకిన్ సమయానికి పావుగంట ముందు వచ్చేటోళ్లు ఎక్కువే. ఎందుకంటే.. చాలా తక్కువ సందర్భాల్లో తప్పిస్తే.. ఈ ఎయిర్ పోర్టులో రద్దీ పరిమితంగా ఉంటుంది.
దేశంలో ప్రముఖులు.. సెలబ్రిటీలతో తరచూ కళకళలాడే ఎయిర్ పోర్టుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఎయిర్ పోర్టుగా చెప్పాలి. ఈ ఎయిర్ పోర్టు నుంచి సినీతారలు తరచూ ప్రయాణిస్తూ ఉంటారు. ముంబయి ఎయిర్ పోర్టులో ప్రైవేట్ జెట్ విమానాల కోసం ప్రత్యేకమైన.. విలాసవంతమైన టెర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యంత సంపన్నులకు.. వ్యాపార.. రాజకీయ ప్రముఖుల ప్రైవసీకి అనువుగా ఉండటమే కాదు.. చాలా స్పీడ్ గా సర్వీసుల్ని ఇచ్చే సౌకర్యం ఉంది.
ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చెప్పాలి. ముంబయి.. ఢిల్లీ ఎయిర్ పోర్టు తరహాలో ఉండే పెద్ద విమానాశ్రయాల్ని పక్కన పెట్టి.. మధ్యతరహా విమానాశ్రయాల్లోవిదేశీ అతిధులు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు ఎక్కువగా ప్రయాణించే ఎయిర్ పోర్టుల్లో గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులు.. సెలబ్రిటీలు.. హై ప్రొఫైల్ వ్యక్తుల్ని ఆకర్షించేదిగా గోవా ఎయిర్ పోర్టును చెప్పాలి. ఇక్కడ జరిగే ఈవెంట్లకు అంతర్జాతీయ.. జాతీయ ప్రముఖులు.. హైప్రొఫైల్ వ్యక్తులు వస్తుంటారు.
మధ్యతరహా విమనాశ్రయాల్లో తరచూ సెలబ్రిటీలు.. వీవీఐపీలు ప్రయాణించే ఎయిర్ పోర్టుల్లో గోవా ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంటే.. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రెండోస్థానంలో.. అహ్మదాబాద్ లోని ఎయిర్ పోర్టు మూడో స్థానంలో నిలుస్తుంది. ఇక.. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టు విషయానికి వస్తే.. ప్రముఖ టూరిస్టు ప్లేస్ కావటం.. డెస్టినేషన్ వెడ్డింగ్ నకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటంతో వీవీఐపీలు.. సెలబ్రిటీలు.. ప్రముఖులు తరచూ ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణిస్తుంటారు. తాజాగా జరిగిన అమెరికన్ ఇండియన్ బిలియనీర్ కుమార్తె పెళ్లి వేడుక పుణ్యమా అని ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టు మరోసారి వార్తల్లోకి ఎక్కిందని చెప్పాలి.
