రూ.కోటిన్నర ఖర్చుతో డెస్టినేషన్ వెడ్డింగ్!
పెళ్లిళ్లు ఘనంగా చేయటమంటే.. సదూరాన ఉండే ప్రాంతాల్లో గ్రాండ్ గా చేయటమే ఇప్పుడు ట్రెండ్ గా మారింది
By: Garuda Media | 15 Aug 2026 12:34 PM ISTపెళ్లిళ్లు ఘనంగా చేయటమంటే.. సదూరాన ఉండే ప్రాంతాల్లో గ్రాండ్ గా చేయటమే ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం డెస్టినేషన్ వెడ్డింగ్ కంటే దేశీయంగా పెళ్లిళ్లు చేసుకోవాలని చెప్పినా.. జనాలు తమ మైండ్ సెట్ ను మార్చుకోవటానికి సిద్ధంగా లేరు. దీనికి కారణం తమ జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లిని వీలైనంత వైభవంగా.. తాము కోరుకున్నట్లుగా ప్లాన్ చేసుకోవటానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో.. డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది.
గతంలో పెళ్లిళ్లను గ్రాండ్ గా చేయటమంటే భారీగా డెకరేషన్ చేయటం.. భారీ మెనూ సిద్ధం చేయటమే. కానీ.. ఇప్పుడు వీటన్నింటితో పాటు తమ సన్నిహితులకు వీలైనన్ని భారీ వసతులు కలిగించటమే కాదు.. తమ సన్నిహితులకు.. బంధువులకు తమ ఇంట్లో జరిగే వివాహ వేడుక ఒక థ్రిల్ కలిగించటంతో పాటు.. మర్చిపోలేని అనుభవాన్ని మిగల్చాలన్న తపన ఎక్కువ అవుతుంది. ఖర్చుకు వెనుకాడని తత్త్త్వం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీంతో.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ జోరు అంతకంతకూ పెరుగుతోంది.
ఆసక్తికర అంశం ఏమంటే.. ఇటీవల కాలంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం వేదికల్ని మార్చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఒకప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే దుబాయ్.. ఒమన్.. టర్కీలాంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారత కుటుంబాల పెళ్లిళ్లకు వేదికగా ఉంటే.. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక.. వియత్నాం.. థాయ్ లాండ్.. ఇండోనేషియాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి.
సంపన్నులు మాత్రమే కాదు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు సైతం డెస్టినేషన్ మ్యారేజ్ వైపునకు మొగ్గేలా పరిస్థితులు ఉంటున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ కు సంబంధించి తాజాగా వెడ్ మి గుడ్ రిపోర్టు ఒకటి వెల్లడించింది. దీని ప్రకారం గత ఏడాది ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు డిమాండ్ 25 శాతం పెరిగిందని.. రానున్న సంవత్సరాల్లోనూ ఇదే స్థాయిలో వ్రద్ధి రేటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వివాహాలను విదేశాల్లో గ్రాండ్ గా చేసుకోవాలన్న ఆసక్తి భారతీయుల్లో ఎక్కువైందన్న అభిప్రాయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది.
డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు శ్రీలంక.. ఇతర దేశాలు ఉన్నప్పటికి భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్ లాండ్ గా చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలను ఎక్కువ రోజులు చేస్తున్నపరిస్థితి. పాతకాలంలో ఏడు రోజుల పెళ్లి మాదిరి రోజులు తిరిగి వస్తున్నాయి. కరోనాకు ముందు సగటున ఒకట్రెండు రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు.. నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పెళ్లికి భారతీయులు చేసే బడ్జెట్ కూడా పెరిగింది. దీనికి తగ్గట్లే విదేశాల్లో పెళ్లి చేసుకోవటానికి అయ్యే ఖర్చును చాలామంది పెద్దగా పట్టించుకోవటం లేదు.
ఒక అంచనా ప్రకారం శ్రీలంకలో విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలంటే రూ.కోటిన్నర సరిపోతుందని చెబుతన్నారు. నిజానికి పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ఛార్జీలు పెరిగినప్పటికి.. చాలామంది సంపన్నులు మాత్రం తమ డెస్టినేషన్ మ్యారేజ్ ను మార్చుకోవాలన్న ఆలోచన చేయకపోవటం గమనార్హం. విదేశాల్లో జరిగే డెస్టినేషన్ మ్యారేజ్ కు థాయ్ లాండ్.. ఇండోనేషియాలోని బాలి.. వియత్నాం.. శ్రీలంక.. మలేషియా.. ఇటలీ.. ఫ్రాన్స్.. గ్రీస్.. స్పెయిన్.. పోర్చుగల్ దేశాలు అత్యధికుల్ని ఆకర్షిస్తున్నాయి. అదే దేశీయంగా డెస్టినేషన్ మ్యారేజ్ లకు డెహ్రాడూన్.. ముస్సోరీ.. రిషికేశ్.. సిమ్లా.. జిమ్ కార్బెట్ టాప్ 5 ఛాయిస్ గా ఉంటున్నాయి. రాయల్ కం లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఉదయ్ పూర్.. జైపూర్.. జైసల్మేర్.. జోధ్ పూర్.. గోవాలు కూడా హాట్ ఛాయిస్ గా నిలుస్తున్నట్లుగా చెప్పాలి.
