'లోగో' కోసం.. 50 వేల ప్రైజ్ మనీ: కేంద్రం ఆఫర్
లోగోను రూపొందించేందుకు వయసు, విద్యతో ఎలాంటి సంబంధంలేదని కేంద్రం ప్రకటించింది. కొద్దిపాటి వినూత్న ఆలోచన.. కొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోయాలన్న తపన ఉంటే చాలని తెలిపింది.
By: Garuda Media | 9 March 2026 3:43 PM ISTకొద్దిపాటి ఆలోచన..సరికొత్త ఆవిష్కరణ.. అంతే.. 50 వేల రూపాయల ప్రైజ్‌మనీ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది తీసుకువచ్చిన `జీరామ్‌జీ` పథకానికి సంబంధించిన లోగోను రూపొందించాలని దేశ యువతకు పిలుపునిచ్చింది. లోగోను రూపొందించిన వారికి 50 వేల రూపాయలను కానుకగా అందించడంతోపాటు.. ప్రధాని సంతకంతో సర్టిఫికెట్ కూడా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది.
ఈ నెల 20 వరకే..
లోగోను రూపొందించేందుకు వయసు, విద్యతో ఎలాంటి సంబంధంలేదని కేంద్రం ప్రకటించింది. కొద్దిపాటి వినూత్న ఆలోచన.. కొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోయాలన్న తపన ఉంటే చాలని తెలిపింది. లోగో చూడగానే.. సదరు పథకం తీరుతెన్నులు అందరికీ అర్ధమయ్యేలా ఉండాలన్నదే కీలక అంశమని పేర్కొంది. అదేసమయంలో ప్రధాని మోడీ ప్రవచిస్తున్న వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ఇక, గ్రామీణాభివృద్ధి, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న తీరు లోగోలో ప్రతిబింబిస్తే చాలని వివరించింది.
దరఖాస్తు చేయాలి!
జీరామ్‌జీ పథకానికి సంబంధించిన లోగోను రూపొందించాలని భావించే వారు.. ముందుగా తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియలోనే సాగనుంది. ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.mygov.in/లోకి లాగిన్ అయ్యి తమ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని కేంద్రం వివరించింది.
ఏంటీ పథకం..
2004-05 మధ్య అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులులేక వలస బాట పట్టిన వారిని ఆదుకోవడం.. ఏటా 100 రోజుల వరకు పనులు కల్పించడమే దీని లక్ష్యం. ఇది.. గత ఏడాది వరకు నిర్విఘ్నంగా సాగింది. అయితే.. పలు రాష్ట్రాల్లో అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో దీనికి మరింత పదును పెడుతూ.. అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేలా కేంద్రం .. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టాన్ని తీసుకువచ్చింది. దీనినే షార్ట్ కట్‌లో `జీరామ్‌జీ`గా పిలుస్తున్నారు. ఈపథకం కింద 100 రోజలు పనిదినాలను 125 రోజులకు పెంచారు. అదేవిధంగా రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచారు.
