రాకపోతే అనర్హత వేటు...జగన్ ఎమ్మెల్యేలకు షాక్ !
ఏపీ అసెంబ్లీకి రాకుండా గత ఇరవై నెలలుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అధినేత జగన్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
By: Satya P | 18 Jan 2026 8:53 PM ISTఏపీ అసెంబ్లీకి రాకుండా గత ఇరవై నెలలుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అధినేత జగన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం మీద పదే పదే అధికార పక్షం వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు కూడా ఇదే విషయం మీద స్పందిస్తూ వస్తున్నారు జగన్ కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే వారిపైన అనర్హత వేటు పడుతుందని కూడా రూల్స్ ని గుర్తు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే విషయం మీద రఘురామ క్రిష్ణం రాజు రియాక్ట్ అయ్యారు.
అసెంబ్లీకి రాకపోతే :
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని విశాఖ జిల్లాలో ఆదివారం పర్యటించిన సందర్భంగా రఘురామ క్రిష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. ఏ సభ్యుడు అయినా అరవై రోజుల పాటు సాగే అసెంబ్లీ పని దినాలలో ఒక్క రోజు అయినా హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత వేటు పడుతుందని రఘురామ చెప్పారు. అయితే ఈ వేటు తప్పించుకునేందుకు అరవై రోజులలో ఒకసారి సభకు వచ్చినా సరిపోతుందని ఆయన అన్నారు.
ఎథిక్స్ కమిటీ పరిశీలనలో :
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల విషయం ఎథిక్స్ కమిటీ పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకునే సభ్యుల విషయం మీద ఆ కమిటీ పరిశీలన చేస్తోందని చెప్పారు. ఇదిలా ఉంటే శాసనమండలి శాసనసభ ఒకే తీరున నడుస్తున్నాయని రెండింటి మధ్య భిన్న వాతావరణం ఉంది అన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఈ విషయం వైసీపీ నేతలు గ్రహించాలని అన్నారు.
రాజకీయాలు మాట్లాడలేదు :
తాను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాను అని అందుకే ఎపుడూ రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదని ఆయన వివరించారు. తాను స్వీయ నియంత్రణను పాటిస్తున్నాను అని చెప్పారు, అందుకే టీడీపీ నిర్వహించే పార్టీ మీటింగులకు సైతం వెళ్ళలేదని గుర్తు చేశారు. అలాగని పాల్గొనరాదని ఎక్కడా లేదని అన్నారు. ఇక తాను రాజ్యాంగ పదవిలో ఉన్నాను కాబట్టి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి రాజీనామా చేయాలని కూడా ఎక్కడా లేదని ఆయన అన్నారు. పదవ షెడ్యూల్ ప్రకారం ఉన్న మినహాయింపులను సరిగ్గా అర్ధం చేసుకోలేకనే కొందరు ఈ విధంగా మాట్లాడుతున్నారని రఘురామ అన్నారు. తనపైన అభ్యంతరాలతో కూడిన లేఖలు రాష్ట్రపతి, గవర్నర్ లకు పంపిస్తే వాటిని పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేఖలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
