ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు కారా ?
ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి వంటి పదవులు ఎక్కడా లేవు.
By: Satya P | 2 Dec 2025 7:00 PM ISTఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి వంటి పదవులు ఎక్కడా లేవు. రాజకీయ అవసరాల కోసం వాటిని అలా ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో తొలి ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ ఉంటే ఆ తరువాత చాలా మంది ఆ హోదాలో ఉన్నారు. చివరిగా ఉప ప్రధానిగా ఉన్న వారు లాల్ కృష్ణ అధ్వానీ. ఇలా ఉప ప్రధానులు అయిన వారు ఎవరూ తర్వాత కాలంలో ప్రధానులుగా చేసిన చరిత్ర అయితే ఎక్కడా లేదు. అలాగే దేశంలో అనేక రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వారిలో కూడా ఎవరూ ముఖ్యమంత్రులుగా చేసిన దాఖలాలు అయితే పెద్దగా లేరు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏకంగా పదిహేను మందికి పైగా ఉప ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా చేశారు.
నీలం వారు స్పెషల్ :
అయితే వీరిలో ఒక్క నీలం సంజీవరెడ్డి తప్ప ఎవరూ ఉప ముఖ్యమంత్రి నుంచి సీఎం దాకా ఎదగలేకపోయారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత 1953 అక్టోబర్ 1 న కర్నూల్ రాజధానిగా ఏపీ ఏర్పాటు అయింది. ఆ ప్రభుత్వంలో ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండగా నీలం ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి ఆయన సీఎం అయ్యారు. ఇక వరసగా చూస్తే ఉప ముఖ్యమంత్రులుగా కొండా వెంకట రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి చేశారు. ఆయన పేరు మీద రంగా రెడ్డి జిల్లా ఏర్పాటు అయింది. ఆయన మాత్రం సీఎం కాలేకపోయారు.
వీరంతా అలాగే :
అదే వరసలో జేవీ నరసింగ రావు, బీవీ సుబ్బారెడ్డి, సి జగన్నాధరావు, కొనేరు రంగారావు, దామోదర్ రాజనరసింహ ఇలా వీరంతా కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక విభజన ఏపీలో చూస్తే 2014 నుంచి 2019 మధ్యలో నిమ్మకాయల చిన రాజప్ప, కేఈ క్రిష్ణ మూర్తి టీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వైసీపీ హయాంలో ఏకంగా రెండు టెర్ములూ కలిపి పిల్లి సుభాష్ చంద్రబోస్, అంజాద్ భాషా, కె నారాయణ స్వామి, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ళ నాని, ధర్మాన క్రిష్ణ దాస్, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొర ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అంటే తొమ్మిది మంది అన్న మాట.
కూటమి ఏలుబడిలో :
ఇక తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే కేటాయించి దానిని మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఇచ్చారు. అలా పవన్ కళ్యాణ్ ఆ పదవిలో కొనసాగుతున్నారు. మిగిలిన వారితో పోలిస్తే పవన్ బలమైన ఉప ముఖ్యమంత్రిగానే కనిపిస్తున్నారు. ఆయనకు సీఎం తో సమానంగా ప్రోటోకాల్ లభిస్తుంది. ఆయన ఎక్కడ పర్యటించినా కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలుకుతారు. అదే విధంగా ఆయన ఫోటోలను కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంచుతున్నారు. అయితే ఇవన్నీ చేసినా రాజ్యాంగం ప్రకారం మంత్రిగానే ఈ పదవి ఉంటుంది అని అంటారు. ఇక తెలంగాణాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు సైతం విశేష ప్రాధాన్యత దక్కుతోంది. మరి ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులూ సీఎం కావాల్సిన వారే అని వారి అభిమానులు అనుచరులతో పాటు విశ్లేషకులూ చెబుతారు. అయితే ఏపీలో ఒక్క నీలం సంజీవరెడ్డి మాత్రమే ఇప్పటికి ఉప ముఖ్యమంత్రి నుంచి సీఎం స్థాయి దాకా వెళ్ళారు. మరి ఈ ఇద్దరూ కూడా సీఎంలు అవుతారా అంటే కాలమే దానికి జవాబు చెప్పాలి. అయితే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వారు సీఎం లు కాకపోవడం పొలిటికల్ గా యాంటీ సెంటిమెంట్ గా ఉందని అంటారు. దానిని బ్రేక్ చేసేది ఎవరో చూడాల్సిందే.
