Begin typing your search above and press return to search.

రాజకీయ లౌక్యం నేర్చుకో సేనానీ !

నిజానికి వేరే రంగంలో నుంచి వచ్చిన వారికి ట్రెడిషనల్ పాలిటిక్స్ అన్నవి అంత సులువుగా ఒంటబట్టవు.

By:  Satya P   |   24 Jun 2026 12:00 AM IST
రాజకీయ లౌక్యం నేర్చుకో సేనానీ !
X

పవన్ కళ్యాణ్ మాటలు విన్నపుడు ఎవరికైనా తోచేది ఏమిటి అంటే తమ మనసులో ఉన్నది ఆయన నోటి నుంచి చెబుతున్నారని. సగటు మనిషి ఏదైతే అనుకుంటాడో అది పవన్ చెబుతున్నారు. అయితే పవన్ సగటు మనిషి కాదు, ఆయన సినీ రంగంలో తిరుగులేని సూపర్ స్టార్. ఇక రాజకీయ రంగంలో చూస్తే జనసేన అధినేత, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దాంతో పవన్ అందరిలా మాట్లాడితే అసలు బాగోదు. ఆయన ఆచీ తూచీ మాత్రమే మాట్లాడాలి. అంతే కాదు ఆయన ప్రతీ మాట వెనక హోదా ఆయన ఇమేజ్ అన్నీ మిళితం అయి ఉంటాయని కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే అదే ఆయన రాజకీయ జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఉన్నది ఉన్నట్లుగా :

రాజకీయాలు అంటేనే బోలెడు ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే బహు కష్టం. ఒక మాటకు వేయి అర్థాలు పరమార్థాలు ఈ సోషల్ మీడియా యుగంలో తీస్తారు. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడలో జరిగిన మాటా మంతి కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రత్యర్థి పార్టీల సంగతి పక్కన పెడితే తటస్థులను మేధావులను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. తాను హోం మంత్రిని కాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంత అవసరమా అన్న చర్చ కూడా వస్తోంది. అంతే కాదు ఆయనకు అక్కడికి ఆ పదవి మీద మోజు ఉన్నట్లుగా ప్రొజెక్షన్ ఇచ్చే వారూ ఉన్నారు.

ఓపెన్ అయిపోతేనే :

మరో వైపు చూస్తే ప్రీతి సుగాలీ కేసుని కూడా ఆయన ఆ సమావేశంలో లేవనెత్తి వివరణ ఇవ్వడం వల్ల కూడా కొత్త ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు. ఇక విజయవాడలో జరిగిన ఒక యువకుడు అదృశ్యం కేసులో కూడా పవన్ ఎక్కువగానే మాట్లాడారు అని అంటున్న వారూ ఉన్నారు. ఒక బలమైన సామాజిక వర్గానికి పదే పదే ఇబ్బంది కలిగేలా పవన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి మేలు చేసేవి కావనే సూచనలు హితైషుల నుంచే వస్తున్నాయి అంటున్నారు.

అధికారంలో ఉంటూ :

ఇక పవన్ కళ్యాణ్ ఇపుడు అధికారంలో ఉన్నారు. ఆయన చేతిలో పవర్ ఉంది. ఆయన ఏమి చేయదలచుకున్నా అధికారులను ఆదేశించగలరు, సమీక్షలు చేయగలరు. అలాగే తాను ఏమి చెబుతున్నారో అది చాలా మౌనంగా చేసుకుని పోవచ్చు. చట్టం తన పని తాను చేస్తుంది అన్న తరహాలో పవన్ అధికార తీరు కొనసాగించవచ్చు. కానీ ఆయన ఇంకా వెనకటి ప్రతిపక్ష పాత్ర మాదిరిగానే విమర్శలు హెచ్చరికలు చేయడం మాత్రం కొంత ఇబ్బందిగానే ఉందని అంటున్నారు.

ట్రెడిషనల్ పాలిటిక్స్ :

నిజానికి వేరే రంగంలో నుంచి వచ్చిన వారికి ట్రెడిషనల్ పాలిటిక్స్ అన్నవి అంత సులువుగా ఒంటబట్టవు. రాజకీయ నాయకుడు కావడానికి మళ్లీ కొత్తగా పుట్టాలా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ పుట్టనక్కరలేదు కానీ సాధన చేయాల్సి ఉంటుంది. చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలతో ముడిపడి ఉన్న వ్యవహారం ఇది. ఎంతో ఆశగా జనాలు చూస్తూంటారు. అధికారంలో ఉన్న వారు అయితే ఆకాశం అంత ఎత్తున నిలిచి ఉంటారు. మరి వారికి జనాలు అంతా ఒక సమూహంగా కనిపించవచ్చేమో. కానీ జనాలకు మాత్రం వారు స్పష్టంగా కచ్చితంగా కనిపిస్తారు.

అక్కడ రీ సౌండ్ :

వారి మాట తీరు అంతా కూడా జనాల కళ్లలో మెదడుతో పూర్తి స్థాయిలో రికార్డు అయి ఉంటుంది. జనాలది ఏముందిలే అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో వారే ప్రభువులు. మౌనంగా వారు ఈ రోజున ఉండొచ్చు. సరైన సమయంలో తమ అధికారాలను వారు చూపిస్తారు. అందువల్ల అధికారంలో ఉన్న వారు కోటి కాంతుల వెలుగులో ఉన్నట్లు లెక్క. అందుకే వారు మరీ మరీ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తాను పారదర్శకంగా ఉన్నాను అని నాయకులు బోళాగా మాట్లాడవచ్చు. కానీ జనాలకు అది వేరే విధంగా రీ సౌండ్ చేస్తుంది. సో జనసేనాని అయితే రాజకీయ లౌక్యం ఇంకా నేర్చుకోవాల్సి ఉందని మాత్రం అంతా అంటున్నారు.