Begin typing your search above and press return to search.

పవన్ ఫోకస్...హాట్ డిస్కషన్

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వ అధినేత. కూటమి సారధి.

By:  Satya P   |   23 Oct 2025 1:00 AM IST
పవన్ ఫోకస్...హాట్ డిస్కషన్
X

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వ అధినేత. కూటమి సారధి. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు తరువాత స్థానంలో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం తరువాత విశేష ప్రాధాన్యత లభిస్తోంది. అంతే కాదు ప్రభుత్వ ఆఫీసులలో సైతం ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ ఫోటోని పెడుతున్నారు. సాధారణంగా చూస్తే కనుక సర్కార్ ఆఫీసులలో రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రిల ఫోటోలు మాత్రమే ఉంటాయి. అయితే ఏపీలో పవన్ కి ఆ హోదా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇది జనసేనకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా తన శాఖల విషయంలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.

కూటమి సమావేశాల్లోనే :

కూటమి నిర్వహించే సమావేశాలలోనే పవన్ మొత్తం ప్రభుత్వం విధానాల గురించి ఎపుడైనా మాట్లాడుతూంటారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. అయితే ఆయన ఒక మంత్రివర్గ సహచరుడిగా ఇతర మంత్రిత్వ శాఖలకు ఎపుడైనా సలహా సూచనలు ఇస్తారు. అలా ఇవ్వడంలో తప్పు కూడా ఏమీ ఉండదు, అయితే ఎక్కువగా ఆయన హోం శాఖను ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనికి కూడా రీజన్ ఉంది. సాధారణ జీవితంలో ప్రజలకు ఎక్కువగా పోలీస్ రెవిన్యూ శాఖలతోనే పని ఉంటుంది. సమస్యలు ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. అలాగే ఫిర్యాదులు వీటి మీదనే వస్తూంటాయి. పైగా పవన్ జనసేన పార్టీకి ప్రత్యేకించి ఈ శాఖల మీద ఫిర్యాదులు రావడం సహజం. దాంతో ఆయన వాటి మీద ఫోకస్ పెట్టి తనదైన సలహా సూచనలు ఇస్తూ వస్తూంటారు. లేటెస్ట్ గా పేకాట జూదాల విషయంలో పవన్ మరో స్టెప్ వేసి నివేదికను కూడా కోరారు ఇదే ఇపుడు హాట్ డిస్కషన్ గా మారింది.

సంతోషం అంటూ :

పవన్ కళ్యాణ్ అన్ని శాఖలను పట్టించుకోవడం సంతోషకరమని డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆయన దీనిని పోజిటివ్ గానే చేసిన కామెంట్ గా చూడాలి. పవన్ దృష్టి పెట్టింది కూడా ఒక వ్యసనం మీద చెడు మీద యువత జీవితాలు తారు మారు చేస్తున్న జూదం మీద. దాంతో ఈ అంశం మీద ఆయన డిప్యూటీ సీఎం హోదాలో జోక్యం చేసుకున్నా తప్పు పట్టేవారు అయితే ఎవరూ లేరు, గతంలో కూడా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పినా లేక తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించారు అన్న దాని మీద మాట్లాడినా లేక తిరుపతి లడ్డు కల్తీ ఘటన మీద ఆయన తన వాయిస్ ని బలంగా వినిపించినా ప్రజా కోణం నుంచే తప్ప మరేమీ కాదని అంటున్నారు.

సౌఖ్యంగానే సాగుతోంది :

టీడీపీ కూటమిలో అయితే పవన్ తీసుకుంటున్న ఈ చొరవ మీద ఎవరూ ఏమీ ఇబ్బంది పడడం లేదు అని అంటున్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ కూడా పవన్ అన్ని శాఖలను పట్టించుకోవడం మంచిదే అన్నారు. హోం మంత్రి అనిత అయితే పవన్ తనకు ఉన్న సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులని నివేదిక కోరడంలో తప్పు ఏమీ లేదని కూడా చెప్పారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని అంతా ఒక కుటుంబం అన్నట్లుగా మాట్లాడారు, గతంలో అయితే దేవాదాయ శాఖ మంత్రి కానీ మరొకరు కానీ పవన్ తమ శాఖలో జోక్యం చేసుకున్నారని ఎక్కడా చెప్పలేదు, దాంతో కూటమి సమిష్టిగానే ముందుకు సాగుతోంది అన్నది ఒక సంకేతం సందేశం అయితే జనాలకు వెళ్తోంది అని అంటున్నారు.

సంప్రదాయంగా చూస్తే :

ఇక సంప్రదాయంగా చూస్తేనే ఎవరైనా ఏమైనా వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. కూటమిలో పవన్ కి అత్యంత ప్రాధాన్యత దక్కుతున్న దృష్ట్యా ఆయన తీసుకుంటున్న చొరవను అయితే ఎవరూ ప్రశ్నించలేరు, పైగా ప్రశంసిస్తారు. కానీ విపక్షాలు మాత్రం ఆ విధంగా భావించడం లేదు, సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నాయి. తిరుపతి ఘటనల మీద పవన్ పెద్ద ఎత్తున స్పందించినపుడు దేవాదాయ శాఖ పరిధిలోని అంశాల మీద పవన్ ఎలా మాట్లాడుతారని వామపక్షాలు ప్రశ్నించాయి. ఇపుడు హోం శాఖ పరిధిలోని అంశాల మీద కూడా పవన్ నివేదిక కోరడం మీద విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇదంతా విపక్షాల రాద్దాంతం తప్ప కూటమిలో అంతా సౌఖ్యంగానే ఉందని అంటున్నారు. దాంతో సీరియస్ మ్యాటర్ ఏమీ కాదనే అంటున్నారు. అదన్న మాట సంగతి.