Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ ఫుల్ డిప్యూటీ సీఎంలు.. వారి సెక్యూరిటీ ప‌టిష్ఠంగా ఉందా?

రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో దేశంలో ప్ర‌స్తుతం చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాల్లో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌నిస‌రి అయింది.

By:  Tupaki Political Desk   |   29 Jan 2026 7:00 PM IST
ప‌వ‌ర్ ఫుల్ డిప్యూటీ సీఎంలు.. వారి సెక్యూరిటీ ప‌టిష్ఠంగా ఉందా?
X

రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో దేశంలో ప్ర‌స్తుతం చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాల్లో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌నిస‌రి అయింది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాదిలో డిప్యూటీ సీఎంలు కేర‌ళ త‌ప్ప ప్ర‌తి రాష్ట్రంలోనూ ఉన్నారు. త‌మిళ‌నాడులో సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్, ఏపీలో సినిమా హీరోగా సుప్ర‌సిద్ధుడైన, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తెలంగాణ‌లో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబానికి చెందిన మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, క‌ర్ణాట‌క‌లో ఆర్థికంగా, రాజ‌కీయంగా, సామాజికంగా బ‌ల‌మైన వ‌ర్గానికి చెందిన డీకే శివ‌కుమార్ లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. మ‌హారాష్ట్ర‌, యూపీ, రాజ‌స్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల‌తో పాటు ఛ‌త్తీస్ గ‌ఢ్ వంటి చోట్ల కీల‌క‌మైన నేత‌ల‌ను డిప్యూటీ సీఎంలుగా చేసింది బీజేపీ. దీన్నిబ‌ట్టే ఈ ప‌ద‌వి ప్ర‌స్తుతం ఎంతగా ముఖ్య‌మైన‌దో తెలుస్తోంది. తాజాగా విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలైన అజిత్ ప‌వార్ మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఏకంగా ఆరుసార్లు ప‌నిచేసిన నాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం. స్థానిక‌ ఎన్నిక‌లకు వెళ్తూ ఆయ‌న ఈ విధంగా ప్రాణాలు కోల్పోవ‌డం యావ‌త్ దేశాన్ని క‌ల‌చివేసింది. ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌ర్ ఫుల్ డిప్యూటీ సీఎంల‌కు అదే విధ‌మైన భ‌ద్ర‌త ఉందా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

సీఎం స్థాయిలో..?

చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రానికి స‌ర్వాధికారి. వివిధ కార‌ణాల‌తో వారికి ఉన్న ముప్పును బ‌ట్టి సెక్యూరిటీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌దిత‌రులు హై సెక్యూరిటీ కేట‌గిరీలో ఉన్నారు. ఇక స‌హ‌జంగా సీఎం స్థాయి నాయ‌కుల‌కు భ‌ద్ర‌తా ప‌రంగా అనేక అంచెలు ఉంటాయి. అదే.. డిప్యూటీ సీఎంల‌కు మాత్రం వ‌ర్తించ‌దు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ప‌ద‌మే లేదు. కేవ‌లం సీఎం, మంత్రివ‌ర్గం ప్ర‌స్తావ‌నే ఉంది.డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్ర‌మే. ఈ ప‌ద‌విలోని వారు మిగ‌తా మంత్రుల‌లాగే స‌మానం. కాక‌పోతే వారి స్థాయికి ఇచ్చిన గౌర‌వం.

అంతా హెలికాప్ట‌ర్ ప్ర‌యాణాలే..

ఈ రోజుల్లో ప్ర‌జ‌ల‌కు చెప్పిన స‌మ‌యానికి చేరేందుకు రాజ‌కీయ నేత‌లు పెద్ద ఎత్తున విమాన‌, హెలికాప్ట‌ర్ స‌ర్వీస్ ల‌ను వినియోగిస్తున్నారు. త‌ద్వారా మారుమూల ప్రాంతాల‌కూ సులువుగా చేర‌గ‌లిగి.. ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చుకుంటున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణ‌ భ‌ద్ర‌త అనే అంశం ప్ర‌ధానంగా చర్చ‌కు వ‌స్తోంది. ఇటీవ‌లి కాలంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కీల‌క నేతలు వినియోగించే హెలికాప్ట‌ర్ ల‌లో సాంకేతిక స‌మ‌స్యలు త‌లెత్తాయి. దీంతో వారు ప్ర‌యాణ విధానాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌యాణానికి ముందే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.