Begin typing your search above and press return to search.

మార్పు కోరుతున్న‌.. నూజివీడు ఫ‌స్ట్‌టైమ్‌.. !

నూజివీడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పార్టీ మారి టిడిపిలోకి వచ్చిన కొలుసు పార్థసారథి ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు.

By:  Garuda Media   |   13 April 2026 6:00 PM IST
మార్పు కోరుతున్న‌.. నూజివీడు ఫ‌స్ట్‌టైమ్‌.. !
X

నూజివీడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పార్టీ మారి టిడిపిలోకి వచ్చిన కొలుసు పార్థసారథి ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. అయితే ఆయన మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ రాజకీయంగా అనేక విమర్శలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాట ఎలా ఉన్నప్పటికీ టిడిపి కార్యకర్తలను కలుపుకొని పోయే విషయంలోనూ కూటమి నాయకులతో వ్యవహరించే విషయంలోనూ ఆయన వెనుకబడ్డారు అన్నది స్పష్టంగా వినిపిస్తున్న మాట.

ఈ నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ కూటమి పార్టీల మధ్య బలంగా వినిపిస్తోంది. నిజానికి ఎక్కడైనా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అభ్యర్థిని మార్చాలన్న వాదన తెర‌మీదకు వస్తుంది. నాయకులు కూడా ఆ తరహా డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రెండున్న‌రేళ్లకు ముందే నూజివీడు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిని మార్చాలి అన్న వాదన రావడం గమనార్హం.

మరి దీనికి కారణాలు ఏమిటి అనేది మంత్రిగా వ్యవహరిస్తున్న కొలుసు పార్థసారథి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి నాయకులను కలుపుకుని పోక‌పోవడం ప్రధాన మైనస్ అని ఎక్కువ మంది చెబుతున్నారు. అదే సమయంలో టిడిపి కార్యకర్తలకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందనేది కూడా స్థానికంగా వినిపిస్తున్న మాట. ఒకవైపు సీఎం చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వాలని వారు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పదే పదే చెబుతున్నారు.

అయినప్పటికీ కొలుసు పార్థసారథి మాత్రం స్థానికంగా ఉన్న నాయకులను పక్కనపెట్టి తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేకంగా గతంలో తనకోసం పనిచేసిన వైసిపి కార్యకర్తలు చేర‌దీయ‌డం వంటివి ఇప్పుడు కూటమి కార్యకర్తలకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. వాస్తవానికి నూజివీడు నియోజకవర్గం లో వైసిపికి క్యాడర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం కూటమి వెనుకబడినా కూడా వైసిపి పుంజుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే కొలుసు పార్థసారథి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరిశీలకలు భావిస్తున్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల నాటికి అసలు ఆయన సీటునే మార్చాలన్న డిమాండ్ రావడం విశేషం.