భారత సంతతికి చెందిన డెల్టా కో-పైలట్ అరెస్టు.. ఏమి చేశాడంటే..!
శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదిక ప్రకారం.. భగవాగర్, 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
By: Raja Ch | 29 July 2025 10:52 AM ISTశాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే.. జూలై 26, 2025న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెల్టా ఎయిర్ లైన్స్ కో-పైలట్ రుస్తుం భగవాగర్ ను అధికారులు అరెస్టు చేశారు. విమానం గేటు వద్దకు చేరుకున్న కొద్ది క్షణాల్లోనే ఫెడరల్ ఏజెంట్లు విమానం కాక్ పీట్ లోకి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి గల కారణం దారుణంగా ఉందని తెలుస్తోంది.
అవును... డెల్టా ఎయిర్ లైన్స్ కో-పైలట్ అయిన రుస్తుం భగవాగర్ ను జూలై 26న శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం (ఎస్.ఎఫ్.ఓ)లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతనిపై మైనర్ పై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9:30 గంటలకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ ను అధికారులు అరెస్ట్ చేశారు. దీనితో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదిక ప్రకారం.. భగవాగర్, 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అతడు శనివారం మిన్నియాపాలిస్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ - 2809 ను నడుపుతున్నాడని తెలియడంతో.. అతడిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ఎయిర్ పోర్ట్ లో వేచి ఉన్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే పని పూర్తి చేశారు.
ఇదే క్రమంలో... అతడు ప్రస్తుతం 5 మిలియన్ డాలర్ల బెయిల్ పై వెస్ట్ కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉంచబడ్డాడని చెబుతున్నారు. రికార్డుల ప్రకారం... అతను ఎత్తు 6.3 అడుగులు కాగా... బరువు 220 పౌండ్ల అని చెబుతున్నారు. అతడు గతంలో శాన్ రామన్, టెక్సాస్, ఫ్లోరిడాలో నివసించాడని రికార్డులు చూపిస్తున్నాయని స్థానిక మీడియా నివేదించింది. అయితే... ఈ విషయంపై డెల్టా ఎయిర్ లైన్స్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు!
