Begin typing your search above and press return to search.

విమానంలో కుదుపులు, పలువురికి గాయాలు... గాల్లో ఏం జరిగింది..!

ఈ సమయంలో తాజాగా... ఓ విమానం కుదుపులకు లోనైంది. దీంతో ఈ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

By:  Raja Ch   |   31 July 2025 1:33 PM IST
విమానంలో కుదుపులు, పలువురికి గాయాలు... గాల్లో ఏం జరిగింది..!
X

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎదురవుతున్న పలు అనుభవాలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా ఇటీవల వరుస ఘటనలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో తాజాగా... ఓ విమానం కుదుపులకు లోనైంది. దీంతో ఈ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

అవును... విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు, ల్యాండింగ్ అవుతున్నప్పుడు పలు ప్రమాదాలు జరిగిన ఘటనల గురించి తెలిసిందే! ఇదే సమయంలో విమానంలో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడం, అత్యవసరం ల్యాండింగ్ చేయడం వంటి సంఘటనలూ తెలిసిందే. అయితే... తాజా ఘటనలో విమానం గాల్లో ఉండగా కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు గాయపడ్డారు.

వివరాళ్లోకి వెళ్తే... డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం.. సాల్ట్‌ లేక్‌ సిటీ నుంచి ఆమ్‌ స్టర్‌ డామ్‌ కు బయలుదేరింది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 7:25 గంటల ప్రాంతంలో మినియా పొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులకు గాయాలవ్వడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో డెల్టా విమానంలో 275 మంది ప్రయాణికులతో పాటు 13 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డెల్టా ఎయిర్‌ లైన్స్‌ ధ్రువీకరించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.

కాగా... రెండు నెలల క్రితం సింగపూర్ ఎయిర్‌ లైన్స్ విమానం కూడా ఇలాంటి హింసాత్మక కుదుపులకు గురైంది. ఈ ఘటనలో ఒక ప్రయాణీకుడు మరణించాడు. దీంతో... దశాబ్దాల కాలంలో ఓ వాణిజ్య విమానంలో కుదుపుల కారణంగా జరిగిన మొదటి మరణం ఇదేనని నివేదించబడింది.