లోక్ సభ 850 అయితే రాజ్యసభ 425 అవుతుందా ?
డీలిమిటేషన్‌తో లోక్‌సభ సీట్లు 543 నుంచి 815-850కి పెరిగే అవకాశం ఉండటంతో రాజ్యసభ సీట్లపైనా చర్చ మొదలైంది. ప్రస్తుతం 250గా ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్యను కూడా పెంచాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఆర్టికల్ 80, నాలుగో షెడ్యూల్ సవరణ అవసరమని చెబుతున్నారు.
By: Satya P | 29 Nov 2026 6:32 PM ISTదేశంలో లోక్ సభ రాజ్యసభ రెండింటినీ కలిపి పార్లమెంట్ అని అంటారు. ఏ బిల్లు అయినా లోక్ సభ ఆమోదం పొందాక రాజ్యసభలో కూడా ఆమోదం అందుకుంటేనే అది చట్టం అవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లోక్ సభ రాజ్యసభ సమాంతరంగా పనిచేస్తాయి. రాజ్యసభలో వచ్చిన ప్రతీ బిల్లునూ మరింత సమగ్రంగా చర్చించి ఆమోదముద్ర వేస్తారు. అలాంటి రాజ్యసభ విషయంలో ఇప్పుడు ఒక చర్చ సాగుతోంది. లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నపుడు రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉన్నారు. ఇపుడు లోక్ సభలో డీలిమిటేషన్ తరువాత మొత్తం సభ్యుల సంఖ్య ఏకంగా 850 దాకా పెరుగుతుందని చర్చ సాగుతోంది. అదే సమయంలో రాజ్యసభలో సీట్ల పెంపు గురించి ఎవరూ మాట్లాడటం లేదు, లోక్ సభలో సీట్లు పెరిగితే ఆటోమేటిక్ గా రాజ్యసభ సీట్లు కూడా పెరగాలి కదా అని అంటున్నారు రాజ్యాంగం తెలిసిన నిపుణులు.
భారీగానే తేడా :
ఒక వేళ లోక్ సభ సీట్లు 850 దాకా పెరిగితే రాజ్యసభలో 250 సీట్లుగానే ఉండిపోతే ఇది భారీ తేడాగా ఉండిపోతుందని అంటున్నారు. పైగా రెండు సభలూ కీలకమైనవి కాబట్టి రాజ్యసభలో కూడా దామషా పద్ధతిలో సీట్లు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా అని అంటున్నారు. ఇక రాజ్యసభలో సీట్ల పెంపు ఎలా జరుగుతుంది అన్నది చూస్తే దానికి కేంద్రం అర్టికల్ 80 ని సవరించాల్సి ఉంటుందని అంటున్నారు. అదంతా రాజ్యంగబద్ధంగా చేయాల్సిన ప్రక్రియగా చెబుతున్నారు. దాని కోసం కేంద్రం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 80 సవరణ.కోసం :
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250కి మించకూడదు అన్నది ఉంది. ఇందులో 238 మంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ మిగిలిన 12 మంది ఎంపీలను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఈ విధంగా ఉన్న రాజ్యసభ సీట్ల సంఖ్యను 250 కంటే ఎక్కువకు పెంచాలంటే ఈ ఆర్టికల్‌ను కచ్చితంగా సవరించాల్సి ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్ని రాజ్యసభ సీట్లు కేటాయించాలనే వివరాలు రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూల్‌లో ఉంటాయి. కొత్తగా సీట్లు పెంచితే కనుక వాటిని రాష్ట్రాల వారీగా పంచడానికి ఈ షెడ్యూల్‌ను కూడా సవరించాల్సి ఉంటుంది. ఆ మీదట పార్లమెంట్ లో ప్రత్యేక మెజారిటీతో ఈ సవరణను ఆమోదించాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ సవరణ తీర్మానాన్ని రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. అంతేకాకుండా ఇది పార్లమెంట్ లో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అంటే సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి, దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది.
రాజ్యసభ సీట్లు పెంచకపోతే :
మరి ప్రస్తుత బిల్లులో లోక్‌సభ సీట్లను 543 నుంచి సుమారు 815-850కి పెంచుతూ, రాజ్యసభను గరిష్ఠంగా 250 వద్దే ఉంచడంపై రాజ్యాంగ నిపుణులు ప్రతిపక్ష నేతలు కొన్ని అంశాలను లేవనెత్తుతున్నారు. ఏదైనా బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడి ఆర్టికల్ 108 కింద ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తే లోక్‌సభ బలం భారీగా పెరిగి రాజ్యసభ ప్రాధాన్యం తగ్గిపోతుందని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగేటపుడు ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ సభ్యుల ఓట్ల విలువతో పోలిస్తే రాజ్యసభ సభ్యుల ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గిపోతుంది. ఆ విధంగా రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పెద్దల సభ బలం స్థిరంగా ఉండి దిగువ సభ బలం మాత్రమే పెరిగితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల లోక్‌సభ సీట్లకు అనుగుణంగా రాజ్యసభ సీట్లను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.
