Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి రాజకీయ పరీక్ష.. ఉత్తరాది సీట్ల బలానికి దక్షిణాది అడ్డుకట్ట వేయగలదా?

దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ చర్చ వేడెక్కుతోంది. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశముంది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తూనే, డీలిమిటేషన్‌లో సమతుల్యత పాటించాలని దక్షిణాది నేతలు కోరుతున్నారు.

By:  A.N.Kumar   |   27 Nov 2026 4:45 PM IST
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి రాజకీయ పరీక్ష.. ఉత్తరాది సీట్ల బలానికి దక్షిణాది అడ్డుకట్ట వేయగలదా?
X

దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త సూపర్ హిట్ డ్రామాకు తెరలేచింది. అదే డీలిమిటేషన్. మహిళా రిజర్వేషన్లనే అందమైన ముసుగు వేసుకుని వస్తున్న ఈ సీట్ల పెంపు వ్యవహారం చూస్తుంటే ఎన్నికల లెక్కల కంటే రాజకీయ లెక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 543 లోక్‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచేస్తే పార్లమెంట్ భవనం సరిపోతుందో లేదో కానీ రాజకీయ నేతల ఆశలకు మాత్రం రెక్కలొచ్చేలా ఉన్నాయి.

ప్రతిపాదనల ప్రకారం సీట్లు 50 శాతం పెరిగితే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలకు లాటరీ తగిలినట్టే. ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120కి.. మహారాష్ట్ర 48 నుంచి 72కి, పశ్చిమ బెంగాల్ 42 నుంచి 63కి, బీహార్ 40 నుంచి 60కి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని సీట్లు చేతిలో ఉంటే ఢిల్లీ పీఠం ఎవరికి దక్కాలో తేల్చే కింగ్ మేకర్ పాత్ర మొత్తం వీరిదే అవుతుందేమో.. ఇంకా ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నా అప్పుడే రాజకీయ వేడి మొదలైంది.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక గత కొన్నేళ్లుగా జనాభాను నియంత్రించడంలో విద్యా.. వైద్య రంగాల్లో ముందున్నాయి. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అని మాట విన్నందుకు ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఎదురవుతోందని దక్షిణాది నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయం పన్నుల రూపంలో దేశ ఖజానాకు భారీగా సమకూరుస్తున్నా సీట్ల విషయంలో మాత్రం జనాభా లెక్కలే ప్రాతిపదిక అయితే ఎలా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి చేస్తూ మరోవైపు రాజకీయ బలం కోల్పోవాలా? అనే సెటైర్లు సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నాయి.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ దాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడమే అసలు వివాదానికి కారణమవుతోంది. సీట్లు పెంచి అందులో మూడో వంతు మహిళలకు ఇస్తే పార్లమెంట్ రూపురేఖలే మారిపోతాయి. మహిళా ప్రాతినిధ్యం పెరగడం స్వాగతించదగినదే అయినా ఆ నెపంతో రాష్ట్రాల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదనేది దక్షిణాది వాదన. రిజర్వేషన్లకు జై కొడుతూనే.. డీలిమిటేషన్ ఫార్ములాపై నో చెప్పే విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.

రాజ్యాంగ సవరణ అంటే మాటలు కాదు కదా.. సభలో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. ఎన్డీఏకు సుమారు 320 మంది సభ్యుల మద్దతు ఉన్నా ఇతర పార్టీల సహకారం లేకుండా బిల్లు గట్టెక్కడం అంత సులభం కాదు. ముఖ్యంగా దక్షిణాది పార్టీల వైఖరి ఈ విషయంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

అసలు పోరాటం సీట్ల కోసం కాదు.. రాజకీయ సమతుల్యత కోసం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా తమ గొంతు వినిపించాల్సిన సమయం ఇది. కేంద్రం ఎలాంటి ఫార్ములాతో ముందుకు వస్తుంది? అందరినీ మెప్పించేలా సమతుల్యత సాధిస్తుందా? లేక ఉత్తర, దక్షిణ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరతీస్తుందా? రాబోయే రోజుల్లో ఈ సీట్ల లెక్కల నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.