Begin typing your search above and press return to search.

'ఢీ' లిమిటేషన్ ...మళ్ళీ గండమేనా ?

మొత్తం 543 సీట్లను కాకుండా అందులో 170 సీట్లను మాత్రమే తీసుకుని ఇందులో 59 సీట్లను రెండు నియోజకవర్గాలుగానూ అలాగే 111 సీట్లను మూడు సీట్లుగా విభజించాలని చూస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Satya P   |   24 Jun 2026 5:00 AM IST
ఢీ లిమిటేషన్ ...మళ్ళీ గండమేనా ?
X

డీలిమిటేషన్ చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ఈ విషయం మీద మెజారిటీని కూడగట్టే పనిలో ఉంది. 362 ఓట్లు అవసరం పడతాయి. బీజేపీ అయితే ఈ విషయంలో అనేక రకాల ఉపాయాలతో ముందుకు సాగుతోంది. తొందరలోనే లోక్ సభ ముందుకు డీలిమిటేషన్ బిల్లుని తీసుకుని రావాలని చూస్తోంది. గత ఏప్రిల్ 16న ఈ బిల్లు ప్రవేశపెట్టి రోజంతా చర్చ జరిపాక ఏప్రిల్ 17న ఓటింగ్ పెడితే వీగిపోయింది. ఇపుడు ఆ పరిస్థితి రాకూడదని కేంద్రంలోని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది.

రాజ్యాంగ సవరణకు నంబర్ :

ఇదిలా ఉంటే ఆర్టికల్ 368 కింద భారత పార్లమెంటులో ఒక అంశం మీద రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆ బిల్లుకు లోక్‌సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రత్యేక మెజారిటీ అవసరం.దీని అర్థం అంటే ప్రతి సభలో హాజరై ఓటు వేసే సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది ఈ బిల్లుకు మద్దతుగా ఉండలై. ఈ సంఖ్య ఆ నిర్దిష్ట సభ యొక్క మొత్తం సభ్యత్వంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు లోక్‌సభలో 543 మంది సభ్యులందరూ హాజరై ఓటు వేస్తే సవరణను ఆమోదించడానికి 362 ఓట్లు అవసరం. అలాగే రాజ్యసభలో 245 మంది సభ్యులందరూ హాజరై ఓటు వేసిన పక్షంలో బిల్లు నెగ్గాలంటే అనుకూలంగా 164 ఓట్లు అవసరం ఉంటుంది. ఒక విధంగా బీజేపీకి ఈ నంబర్ కూడా ఇబ్బంది కరమే అని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ని చీల్చినా శివసేనని చీల్చినా కూడా దరిదాపుల్లోకి వస్తారు కానీ ఆ మ్యాజిక్ నంబర్ అయితే పూర్తిగా రాదు అని అంటున్నారు.

డీఎంకే కీలకం :

సరిగ్గా ఇక్కడే డీఎంకే కీలకం అవుతోంది. డీఎంకే ఇండియా కూటమి నుంచి వేరుపడింది. దాంతో ఎన్డీయే వైపు తిప్పుకోవాలని గట్టి ప్రయత్నమే జరుగుతోంది. అయితే నిన్న మొన్నటివరకూ డీఎంకే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వాదించింది. ఇపుడు సడెన్ గా ఎన్డీయే వైపు వెళ్తే డీఎంకే అసలుకే ఎసరు వస్తుందని భావిస్తోంది. ఇది విధానపరమైన సమస్యగా కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు.

మార్చినా అదే విధంగానే :

ఇక డీలిమిటేషన్ బిల్లులో కొన్ని మార్పులు చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం 543 సీట్లను కాకుండా అందులో 170 సీట్లను మాత్రమే తీసుకుని ఇందులో 59 సీట్లను రెండు నియోజకవర్గాలుగానూ అలాగే 111 సీట్లను మూడు సీట్లుగా విభజించాలని చూస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చేస్తే కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. కేరళలో ప్రస్తుతం ఉన్న 20 సీట్లు 30 అవుతాయి. ఏపీలో 25 కాస్తా 38, కర్ణాటకలో 28 కాస్తా 42, తమిళనాడులో 39 కాస్తా 59 అవుతాయి. తెలంగాణలో 17 కాస్తా 26 అవుతాయి. అదే సమయంలో యూపీలో 80 కాస్తా 120 అవుతాయి. బీహార్ లో 40 కాస్తా 60 అవుతాయి. గుజరాత్ లో 26 కాస్తా 39 అవుతాయి. పశ్చిమ బెంగాల్ లో 42 కాస్తా 63 అవుతాయని అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉత్తరాది రాష్ట్రాలలఒ ఈ సీట్ల పెంపు గణనీయంగా ఉండబోతోంది. మరి దీనికి దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలు పార్టీలు అసలు అంగీకరించబోవు అని అంటున్నారు. దక్షిణాదిన ఒక్క ఏపీ తప్ప అన్నీ ఇండియా కూటమిలోనే ఉన్నాయి. దాంతో ఈ సమస్య మళ్లీ మొదటికే వస్తుందని అంటున్నారు. దీని మీద ఏమి చేస్తారు. ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు.

జనాభా ప్రాతిపదికనే :

లోక్ సభ అయినా అసెంబ్లీ అయినా మరే పంచాయతీ మెంబర్ సీటు అయినా జనాభా ప్రాతిపదికనే విభజించడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణ వల్ల దక్షిణాదిన జనాభా తగ్గిపోయింది. ఉత్తరాదిన అధికంగా ఉంది. దాంతో ఎలా చేసినా ఎన్ని రకాల మార్పు చేసిన మూల సూత్రం జనాభా ప్రాతిపదిక కాబట్టి అక్కడే అసలైన పేచీ వస్తుంది అని అంటున్నారు. మరి ఇపుడు కాకపోతే మెరెప్పుడు అని బీజేపీ అంటోంది. చూడాలి మరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది.