Begin typing your search above and press return to search.

బీజేపీ డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందా ?

రాజకీయం దేశంలో మారుతోంది. ఏపీలోనూ వైసీపీ కొత్త రాగం అందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

By:  Satya P   |   16 Oct 2026 2:00 PM IST
బీజేపీ డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందా ?
X

రాజకీయం దేశంలో మారుతోంది. ఏపీలోనూ వైసీపీ కొత్త రాగం అందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు రిజర్వేషన్లను ఆమోదించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దాని కోసం ఈ నెలాఖరులోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేక సమావేశాల ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

ఈ బిల్లులు కీలకం :

ఇక బీజేపీ వరకూ చూస్తే ఈ రెండు బిల్లులను ఆమోదించుకోవడం చాలా కీలకంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల చట్టం నారీ శక్తి వందన్ అధినియం పేరుతో 2023లోనే ఆమోదం పొందినప్పటికీ దాని అమలును జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు. అయితే ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే కొత్త నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 816 లేదా 850 వరకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కన పెరిగే దాదాపు 273 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని ప్రచారం సాగుతోంది. అందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అని తెలుస్తోంది.

అప్పట్లో షాక్ :

అయితే ఈ ఏడాది ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో ఈ బిల్లులు వీగిపోయాయి. ఆ తర్వాత జరిగిన వర్షాకాల సమావేశాలు కూడా ప్రతిపక్షాల నిరసనల కారణంగా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ఇలా బీజేపీకి విపక్షాలు భారీ షాక్ ని ఇచ్చాయి. ఈసారి అలాంటి పరిస్థితులు సంభవించకుండా బీజేపీ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ఈసారి బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసుకోవడానికి తమ వద్ద తగిన సంఖ్యాబలం ఉందని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ అనివార్యమైతే ప్రత్యేక మెజారిటీ సాధించేందుకు ఎన్డీయే ప్రభుత్వం డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు కొన్ని చిన్న ప్రతిపక్ష పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది అని అంటున్నారు.

వైసీపీ వైఖరి కీలకం :

మరి ఈ సమయంలో వైసీపీ వైఖరి ఏమిటి అన్నది కీలకంగా భావిస్తున్నారు. వైసీపీ ఈ ఏడాది ఏప్రిల్ 17న జరిగిన ఓటింగులో మద్దతు ఇచ్చింది. కానీ ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో ఇండియా కూటమి పక్షాలకు అనుగుణంగా మాట్లాడుతోంది. అంతే కాదు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలకు సంబంధించి చేసిన చట్ట సవరణను వెనక్కి తీసుకుని పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒక విధంగా వైసీపీ గొంతు మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు ఈ రెండు బిల్లులకు ఉంటాయా అన్నది చర్చగా ఉంది. అయితే అభివృద్ధికి సంబంధించిన అంశాలు దేశ ప్రయోజనాలు విస్తృతమైన విషయాలలో మద్దతు ఇస్తామని వైసీపీ ఎపుడూ చెబుతూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే వైసీపీ ఆమోదం ఉండవచ్చు అన్నది మరో చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.