Begin typing your search above and press return to search.

వైసీపీకి దెబ్బ పడుతుందా... ఆ బిల్లు భయంతోనే ?

ఏపీలో వైసీపీకి 2029 ఎన్నికలు చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. వైసీపీ అంటే ఏకశిలా సదృశ్యమైన పార్టీ. అక్కడ ఒక్కరే నాయకుడు.

By:  Satya P   |   19 Aug 2026 9:27 AM IST
వైసీపీకి  దెబ్బ పడుతుందా... ఆ బిల్లు భయంతోనే ?
X

ఏపీలో వైసీపీకి 2029 ఎన్నికలు చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. వైసీపీ అంటే ఏకశిలా సదృశ్యమైన పార్టీ. అక్కడ ఒక్కరే నాయకుడు. అదే వైఎస్ జగన్. ఆయన ఇమేజ్ వైసీపీకి కొండంత అండ. జగన్ తోనె పార్టీ అంటూ సాగుతుంది. ఇపుడు ఎపుడూ నాయకులు అంతా అదే గట్టిగా నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. అయితే వారికి కొంత ఊరట ఉపశమనం తమ పార్టీ అధినాయకుడు జగన్ జనంలోకి వెళ్తే కనుక జనాలు వెల్లువలా తరలివస్తున్నారు. అలాగే 40 శాతం ఓటింగ్ షేర్ పార్టీకి ఉంది. తొలి రెండేళ్ళలో కూటమి పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంది, మరో పది శాతం ఈ మూడేళ్ళ వ్యవధిలో సమకూర్చుకుంటే అధికారం తమదే అన్న ధీమా ఉంది. అయితే ఇవన్నీ ఆశలూ ఆరాటంగానే ఉంటాయి. రాజకీయాల్లో ఎపుడూ రెండు రెండూ కచ్చితంగా నాలుగు అయితే కానే కాదు, అందుకే వైసీపీలో కంగారు కలవరం చెలరేగుతున్నాయని అంటున్నారు.

కూటమి విడిపోదు అన్నది :

ఏపీలో టీడీపీ కూటమి అయితే 2029 ఎన్నికల్లో కలసే ఉంటుంది. విడిపోయే సమస్య అయితే లేదు, జనసేనలో అసంతృప్తి ఉందని వారు వేరుగా ఉంటారు అని వైసీపీ భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. నిజానికి ఆ సంగతి ఆ పార్టీ పెద్దలకూ తెలుసు అని అంటారు. మరి కూటమిగా వస్తే ఒంటరిగా వైసీపీ పోరాటం చేస్తే ఓడించి గద్దెనెక్కడం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. మూడు పార్టీలకూ బలం ఉంటుంది. దాంతో ఎంత యాంటీ ఇంకెంబెన్సీ ఉన్నా వైసీపీ కంటే ఎక్కువగానే ఓటు షేర్ కూటమికి దక్కుతుందని విశ్లేషణలు ఉన్నాయి. పైగా చంద్రబాబు వ్యూహాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆయన బలమైన సామాజిక వర్గం కేంద్రంలో బీజేపీ అండదండలు అన్నీ కూటమికి సానుకూల వాతావరణాన్నే అందిస్తాయని అంటున్నారు. మరి కూటమిని ఓడించాలి అన్నది అసాధ్యమా అంటే కాదు కానీ అది జరగాలి అంటే వైసీపీ వైపుగా భారీ ఎత్తున ఓటు సునామీనే జరగాలి. అలాంటి పరిస్థితి ఏపీలో ప్రస్తుతం ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.

కూటిమికే అడ్వాంటేజ్ :

ఇక వైసీపీలో ఉన్న మరో భయం ఏమిటి అంటే డీలిమిటేషన్ బిల్లు అని అంటున్నారు. ఈ బిల్లుని పార్లమెంట్ లో ఎలాగైనా ఆమోదింపచేసుకుని 2029 ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మధ్యనే తెలంగాణాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకుని 2029 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దానిని బట్టి చూస్తే బీజేపీ పట్టుదల ఎంతగా ఉందో అర్ధం అవుతోంది. మరి ఆ బిల్లు కనుక చట్ట రూపం దాలిస్తే ఏపీలో కూటమి పార్టీలు నెత్తిన పాలు పోసినట్లే అని అంటున్నారు. ఇపుడున్న 175 సీట్లు కాస్తా ఏ 250 సీట్లుగానో అవుతాయి. అపుడు మిత్రులు మధ్య పొరపొచ్చాలు ఉండవు, అంతా హ్యాపీగా కలసి పోటీకి దిగుతారు అని అంటున్నారు.

చిన్న నియోజకవర్గాలుగా :

ప్రస్తుతం ఏపీలో ఉన్న అసెంబ్లీ సీట్లు మరింత చిన్నవిగా మారుతాయి. అంతే కాదు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు నాలుగు మండలాలు ఉంటే వైసీపీకి మెజారిటీ వచ్చే మండలాలను వేరు చేసి రెండుగా చీలిస్తే రెండు చోట్ల ఆ పార్టీ ఓటమికి గురి అవుతుంది అన్నది కూడా ఉంది. అంతే కాదు మహిళా రిజర్వేషన్లు 33 శాతం కొత్తగా వస్తాయి. వాటిని కూడా ఎక్కడ ఇవ్వాలో కూటమి చేతుల్లో ఉంటుంది. అలాగే మామూలు రిజర్వేషన్ నియోజకవర్గాలలో కూడా మార్చాల్సి ఉంటుంది. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వారికే అనుకూలం అవుతుందని అంటున్నారు. అలా వైసీపీ గెలిచే సీట్లు బలమైన నాయకులు ఉండే సీట్లు చెల్లా చెదురు అవుతాయన్న భయం అయితే ఆ పార్టీలో ఉందని అంటున్నారు ఇక చిన్న నియోజకవర్గాలుగా మారితే అధికార పార్టీకి గెలుపు మరింత ఈజీ అవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు.

అయినా మద్దతు :

ఇంత ఆందోళన వైసీపీ నేతలలో ఉంది అని ప్రచారంలో ఉన్నా కూడా వైసీపీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తోంది. మరి ఇది రాజకీయ అనివార్యత లేక మరేమిటి అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే కూటమికి అన్నీ మంచి శకునములే అన్నట్లుగా డీలిమిటేషన్ బిల్లు కనుక చట్ట రూపం దాలిస్తే వైసీపీకి అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుందని అంటున్నారు. అయితే ప్రజలలో వ్యతిరేకత భారీ స్థాయిలో ఉన్నపుడు ఎన్ని ముక్కలుగా నియోజకవర్గాలను కొట్టినా అన్ని చోట్లా ఉండేది అదే ప్రజలు కాబట్టి కూటమిని ఓడించి వైసీపీని గెలిపిస్తారు అన్న నమ్మకంతో కూడా ఆ పార్టీ ఉంది అని అంటున్నారు.