Begin typing your search above and press return to search.

దేశ రాజధానిలో అత్యంత సంపన్నులు ఎవరు?

దేశీయంగా కుబేరులు.. రాష్ట్రాల వారీగా సంపన్నుల్ని చూశాం. మరి.. దేశ రాజధాని ఢిల్లీ మాటేమిటి? దేశ రాజకీయం మొత్తానికి రాజధాని ఢిల్లీ కీలకమన్న విషయాన్ని మర్చిపోలేం.

By:  Garuda Media   |   5 Sept 2025 9:22 AM IST
దేశ రాజధానిలో అత్యంత సంపన్నులు ఎవరు?
X

దేశీయంగా కుబేరులు.. రాష్ట్రాల వారీగా సంపన్నుల్ని చూశాం. మరి.. దేశ రాజధాని ఢిల్లీ మాటేమిటి? దేశ రాజకీయం మొత్తానికి రాజధాని ఢిల్లీ కీలకమన్న విషయాన్ని మర్చిపోలేం. మరి.. అంతటి ప్రాధాన్యత మహానగరంలో తోపు సంపన్నుల మాటేమిటి? వారెవరు? అన్న విషయానికి వస్తే.. సమాధానం ఆసక్తికరంగా మారుతుంది. ఆసక్తికరంగా ఢిల్లీ మహానగరంలో అత్యంత సంపన్నులైన టాప్ 10 జాబితాలో కేవలం పారిశ్రామికవేత్తలే ఉండటం విశేషం.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాజధానిలో వారికి మించి ఆర్థికంగా బలమైన కుటుంబాలన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు చెందినోళ్లే. దేశరాజధాని ఢిల్లీలో అత్యంత సంపన్నులు.. వారి నెట్ వర్త్ చూస్తే వావ్ అనుకోవాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం చూస్తే.. ఈ ఏడాదిలో ఆగస్టు నెలలో ఢిల్లీ జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.5725 కోట్లుగా ఉండటం చూస్తే.. దేశ ఆర్థిక అంశాల్లో ఢిల్లీ ఎంత కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం అర్థమవుతుంది.

ఇక.. ఢిల్లీ మహానగరంలో టాప్ 10 సంపన్న కుటుంబాల విషయానికి వస్తే మొదటి స్థానంలో శివనాడార్ నిలుస్తారు. ఆయన కుటుంబ నెట్ వర్త్ 40.2 బిలియన్ డాలర్లుగా చెబుతారు. రెండో స్థానంలో సునీల్ మిట్టల్ ఆయన కుటుంబం నిలిచింది. ఆయన నెట్ వర్త్ 30.7 బిలియన్ డాలర్లు. మూడోస్థానంలో రవి జైపురియా (ఆర్జే కార్ప్ ఛైర్మన్) నిలుస్తారు. ఆయన్ను కోలా కింగ్ గా అభివర్ణిస్తారు. ఆయన నెట్ వర్త్ 17.3 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో బర్మన్ ఫ్యామిలీ 10.4 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఐదో స్థానంలో కపిల్ అండ్ రాహుల్ భాటియా (10.1 బిలియన్ డాలర్లు) ఫ్యామిలీ నిలుస్తుంది. వీరు.. మరెవరో కాదు దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ఇండిగో ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకులు. కపిల్ భాటియా కుమారుడే రాహుల్ భాటియా.

దేశ రాజధానిలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఆరో స్థానంలో వినోద్, అనిల్ రాయ్ గుప్తా కుటుంబంగా చెప్పాలి. ప్రముఖ ఎలక్ట్రికల్ సంస్థ హావెల్స్ ఇండియా ఛైర్మన్ మాత్రమే కాదు ఎండీ కూడా. వీరి నెట్ వర్త్ 9.5 బిలియన్ డాలర్లుగా చెబుతారు. ఏడో స్థానంలో వివేక్ చాంద్ సెహగల్ అండ్ ఫ్యామిలీ. ఆటో విడిభాగాల సంస్థను నిర్వహిస్తుంటారు. వీరి నెట్ వర్త్ 8.9 బిలియన్ డాలర్లు. ఎనిమిదో స్థానంలో విక్రమ్ లాల్ అండ్ ఫ్యామిలీ. వీరు ఐషర్ మోటార్స్ వ్యవస్థాపకులు. మోటార్ సైకిల్.. వాణిజ్య వాహనాల తయారీలో వీరి ఫ్యామిలీకి మంచి పేరుంది. వీరి సంపద 8.8 బిలియన్ డాలర్లుగా చెబుతారు. తొమ్మిదో స్థానంలో కులదీప్ సింగ్ అండ్ గుర్బచన్ సింగ్ ధింగ్రా (బెర్గర్ పెయింట్స్) నెట్ వర్త్ 7.5 బిలియన్ డాలర్లు కాగా.. పదో స్థానంలో రమేశ్, రాజీవ్ జునేజా అండ్ కుటుంబంగా చెప్పాలి.. వీరి సంపద 7 బిలియన్ డాలర్లు.