ఏప్రిల్ లో ఆగింది.. డిసెంబర్ లో ప్లాన్ ఉంది.. ఉగ్ర నెట్ వర్క్ కేసులో షాకింగ్ అప్ డేట్స్!
అవును... ఫరీదాబాద్ ఉగ్ర నెట్ వర్క్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సుమారు గత ఏడాది కాలం నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందంట.
By: Raja Ch | 16 Nov 2025 11:45 PM ISTఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నెల 10న చోటు చేసుకున్న ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు. ఈ సమయంలో.. ఈ ఘటనకు పాల్పడిన బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఇందులో భాగంగా... తాను కాకుండా మరో వ్యక్తిని ఆత్మాహుతి బాంబర్ గా నియమించడం కోసం అతడు తీవ్రంగా అన్వేషించాడట.
అవును... ఫరీదాబాద్ ఉగ్ర నెట్ వర్క్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సుమారు గత ఏడాది కాలం నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందంట. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, ఆ సమయంలో ఆ కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ వివరాలను జాసిర్ అలియాస్ డానిష్ నుంచి తెలుసుకున్నట్లు తెలుస్తోంది!
ఉమర్ ను మసీదులో కలిసిన జాసిర్!:
జాతీయ మీడియా కథనాల ప్రకరం... ఎస్పీ డాక్టర్ సందీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీనగర్ పోలీసులు.. దక్షిణ కాశ్మీర్ లోని ఖాజీగుండ్ కు చెందిన పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ జాసిర్ అలియాస్ డానిష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా... తాను గత ఏడాది అక్టోబర్ లో కుల్గాంలోని ఓ మసీదులో ఉగ్ర నెట్ వర్క్ సభ్యులను కలిశానని.. అక్కడ నుంచి వారు తనను అల్ ఫలా యూనివర్శిటీలోని అద్దే వసతి గృహానికి తీసుకెళ్లారని అధికారులు తెలిపారు.
ఆత్మహుతి బాంబర్ గా మారమని ఒత్తిడి!:
ఇదే సమయంలో... ఉమర్ నబీ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది అని.. తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని పట్టుబట్టాడని.. ఈ క్రమంలో ఉమర్ తనను ఆత్మాహుతి బాంబర్ గా మారేలా ఒప్పించేందుకు చాలా నెలలు ప్రయత్నించాడని జాసిర్ తెలిపాడు. అయితే.. టెర్రర్ మాడ్యుల్ లోని ఇతర సభ్యులు మాత్రం.. తనను జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా ఉంచాలని కోరుకున్నారని అన్నాడు.
ఏప్రిల్ లో ఆగింది.. డిసెంబర్ లో ప్లాన్ ఉంది!:
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆ ప్రణాళిక ఉన్నప్పటీకీ.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోపాటు పలు ఇతర కారణాలతో ఉమర్ నబీ వెనక్కి తగ్గాడని జాసిర్ తెలిపాడు. ఇదే సమయంలో... బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అంతలోనే ఫరిదాబాద్ ఉగ్ర నెట్ వర్క్ వ్యవహారం భయటపడింది.
మరోవైపు... ఉమర్ నబీ హర్యానాలోని నుహ్ లో కొన్ని రోజులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఢిల్లీ పేలుడుకు ముందే అక్కడి హిదాయత్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆ ఇంట్లో అతడు ఉంటున్నట్లు చుట్టుపక్కల వారికీ తెలియదు.. జిల్లాలోని ఇంటెలిజెన్స్ వర్గాలనూ ఎటువంటి అనుమానం రాలేదు.
అయితే ఫరిదాబాద్ ఉగ్ర నెట్ వర్క్ బయటపడటంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఉమర్... ఎర్రకోట సమీపంలో ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన ఐ20 కారులో పేలుడు పదార్ధాలను తీసుకుని బయలుదేరాడు.
