Begin typing your search above and press return to search.

ఎర్రకోట పేలుడు కారును నడిపింది డాక్టరా?

సోమవారం సాయంత్రం 6.52 గంటల వేళలో జరిగిన పేలుడుకు కొద్ది నిమిషాల క్రితం కారు నడుపుతున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు.

By:  Garuda Media   |   11 Nov 2025 11:33 AM IST
ఎర్రకోట పేలుడు కారును నడిపింది డాక్టరా?
X

షాకింగ్ నిజం వెలుగు చూసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గరి మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ వద్ద భారీ పేలుడు చోటు చేసుకోవటం.. తొమ్మిది మంది మరణించగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పేలుడు జరిగిన కారును డ్రైవ్ చేస్తున్నదెవరు? అన్న విషయంపై ఆరా తీసిన అధికారులు కీలక అంశాల్ని గుర్తించారు. అంతేకాదు.. పేలుడుకు కారణమైన కారుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను సేకరించారు.

సోమవారం సాయంత్రం 6.52 గంటల వేళలో జరిగిన పేలుడుకు కొద్ది నిమిషాల క్రితం కారు నడుపుతున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ అయిన మహ్మద్ ఉమర్ గా అనుమానిస్తున్నారు. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. తాజాగా విడుదలైన సీసీ కెమేరా ఫుటేజ్ ను చూస్తే.. పేలుడు వేళ.. తీవ్రత ఎక్కువగా ఉండాలన్న ఆలోచనలో.. కారు అద్దాల్ని కిందకు దించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. డ్రైవింగ్ డోర్ అద్దాల్ని కిందకు దించిన వైనం కనిపిస్తోంది. కారులో అతడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా సమాచారం.

తాజాగా వెలుగు చూస్తున్న పరిణామాలు ఆందోళనకు గురి చేసేలా మారాయి. ఇప్పటివరకు ఉగ్రవాద లింకులు ఉన్న వారి నేపథ్యాలు వేరుగా ఉండేవి. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం విద్యావంతులుగా ఉండటం షాక్ కు గురి చేసేలా మారుతున్నాయి. వైట్ కాలర్ ఉగ్రవాదం దేశంలో వేళ్లూరుకుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్న ఘటనల్ని చూస్తే.. నిఘా సంస్థలు 8 మందిని ఉగ్రవాదుల్ని అరెస్టుచేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఉండటం షాకింగ్ గా మారింది. అంతేకాదు.. నిఘా వర్గాలు అరెస్టు చేసిన వారిలో ఒక మహిళ ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.

అరెస్టు అయిన ఎనిమిది మంది ఉగ్రవాదుల్లో ఏడుగురు జమ్ముకశ్మీర్ కు చెందిన వారు అయితే.. ఒకరు యూపీ రాజధాని లక్నోకు చెందిన వారుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒకరిని ప్రత్యేక పోలీసులు అరెస్టు చేయటం.. అతను కూడా వైద్యుడిగా గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇటీవల కాలంలో అరెస్టు చేసిన ఉగ్రవాదుల్లో పట్టుబడిన వైద్యుల సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఈ నలుగురిలో ఒకరు మహిళా డాక్టర్ ఉన్నారు.

బాగా చదువుకున్న వారు ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావటం.. అందుకు తగ్గట్లు చేస్తున్న కార్యకలాపాల్ని చూస్తే.. భారీ కుట్ర చాప కింద నీరులా చేరినట్లుగా అనిపిస్తోంది. కశ్మీర్ లో పట్టుబడిన 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న రోజునే దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు చోటు చేసుకోవటం గమనార్హం. ఏమైనా గతానికి.. వర్తమానానికి సంబంధించిన ఉగ్రవాడ జాడలు భిన్నంగా ఉండటం చూస్తే.. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విషయాల్ని స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.