Begin typing your search above and press return to search.

డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా.. ఉమర్‌ మహ్మద్‌ బ్రెయిన్ వాష్‌!

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశాన్ని మరోసారి కుదిపేసింది.

By:  A.N.Kumar   |   11 Nov 2025 3:47 PM IST
డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా.. ఉమర్‌ మహ్మద్‌ బ్రెయిన్ వాష్‌!
X

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశాన్ని మరోసారి కుదిపేసింది. ఈ భయంకరమైన ఘటన వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌గా పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ పేరును నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాల్సిన ఒక విద్యావంతుడు, ఉన్నత వృత్తిలో ఉన్న వ్యక్తి ఉగ్రవాద మార్గంలోకి ఎలా వెళ్లాడన్న ప్రశ్న ఇప్పుడు యావత్‌ సమాజాన్ని కలచివేస్తోంది.

* వైద్యుడి నుంచి ఉగ్రవాదిగా మారిన ప్రయాణం

డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ 1989 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన తండ్రి జీహెచ్‌ నబీ భట్‌, గృహిణి అయిన తల్లి షమీమా బానోకు ఆయన సంతానం. విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఉమర్‌, శ్రీనగర్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ (GMC)లో ఎంబీబీఎస్‌ , ఎండీ (మెడిసిన్‌) పూర్తి చేశాడు.

ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఆయన అనంత్‌నాగ్‌ GMCలో సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. అంటే ప్రజల ప్రాణాలను కాపాడే కీలకమైన వృత్తిలో ఉంటూ, గౌరవప్రదమైన స్థానాన్ని పొందాడు.

* సోషల్‌ మీడియా ప్రభావం.. బ్రెయిన్‌వాష్‌!

ఉమర్‌ మహ్మద్‌ క్రమంగా ఉగ్రవాద భావజాలంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం సోషల్‌ మీడియా ప్రభావం అని నిఘా సంస్థలు గుర్తించాయి. ఆయన తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసే పేజీలను ఫాలో అవుతూ ఆ భావజాలానికి పూర్తిగా లోనైనట్లు తెలుస్తోంది. ఈ ఆన్‌లైన్‌ బ్రెయిన్‌వాష్‌ ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఆపరేషన్ల సందర్భంగా అరెస్టయిన డా. అదిల్‌, ఉమర్‌కు సన్నిహితుడు. వీరిద్దరూ అనంత్‌నాగ్‌ GMCలో కలిసి పనిచేసినట్లు సమాచారం. అదిల్‌ అరెస్టు తర్వాత ఉమర్‌ భయాందోళనకు గురై, ఉగ్రవాద నెట్‌వర్క్‌తో మరింత సన్నిహితమయ్యాడని అధికారులు అనుమానిస్తున్నారు.

* పేలుడు ఘటన.. అనుమానాలు

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు తర్వాత, సీసీటీవీ ఆధారాలు.. సాంకేతిక విశ్లేషణల ద్వారా డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ పేరు ప్రధాన అనుమానితుడిగా బయటకు వచ్చింది. పేలుడు జరిగిన కారులో లభించిన శరీర భాగాలు ఉమర్‌వేనా అన్న కోణంలో అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కోసం అతడి కుటుంబ సభ్యుల నుంచి నమూనాలను సేకరించారు. దర్యాప్తు వేగం పుంజుకున్న నేపథ్యంలో ఉమర్‌ సోదరులు జహూర్‌, ఆషిక్‌ నబీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన రోజు ఉమర్‌ తన తల్లికి "లైబ్రరీలో చదువుకుంటున్నాను, ఫోన్‌ చేయొద్దు" అని చెప్పి ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేశాడని అధికారులు తెలిపారు.

* ఉగ్ర నెట్‌వర్క్‌లో మరో ముగ్గురు

డాక్టర్‌ ఉమర్‌తో పాటు ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదుల ప్రమేయాన్ని కూడా నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. తారిఖ్‌ అహ్మద్‌ మాలిక్‌, ఆమిర్‌ రషీద్‌, ఉమర్‌ రషీద్‌ వీరందరికీ అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

* సమాజానికి హెచ్చరిక

వైద్య రంగంలో ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఒక విద్యావంతుడు, ఇలాంటి దారుణమైన ఉగ్రవాద మార్గంలోకి వెళ్లడం సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. మతం, రాజకీయాలు లేదా భావజాలం పేరిట ఆన్‌లైన్‌లో జరిగే బ్రెయిన్‌వాష్‌ ఎంత ప్రమాదకరమో, ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ సమాజ భద్రతను ఎలా నాశనం చేస్తుందో ఈ ఉదంతం కళ్లకు కట్టినట్టు చూపించింది. యువత , విద్యావంతులు ఆన్‌లైన్‌ ప్రభావానికి లోను కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.