Begin typing your search above and press return to search.

ఢిల్లీలో రాపిడో కెప్టెన్ దుర్మార్గం.. భయంతో బైక్ నుంచి దూకేసింది

ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ తన ఆఫీసుకు వెళ్లటానికి ఎప్పటిలానే తన ఇంటి నుంచి ఆఫీసుకు రాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకున్నారు.

By:  Garuda Media   |   15 Aug 2026 12:34 PM IST
ఢిల్లీలో రాపిడో  కెప్టెన్ దుర్మార్గం.. భయంతో బైక్ నుంచి దూకేసింది
X

షాకింగ్ ఉదంతం ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆఫీసుకు వెళ్లటానికి బాధితురాలైన యువతి రాపిడో బుక్ చేసుకోగా.. దాని డ్రైవర్ (కెప్టెన్) ఆమెను దౌర్జన్యంగా తప్పుడు దారిలోకి తీసుకెళ్లగా.. భయంతో వణికిపోయి బైక్ నుంచి దూకేసిన ఉదంతం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. జరిగిన ఉదంతంలో రాపిడో సంస్థ వ్యవహరించిన తీరు మరింత ఆందోళనకు గురి చేసేలా ఉండటం గమనార్హం. అత్యవసర సాయం కోసం బాధితురాలు రాపిడోను సంప్రదించగా వారి నుంచి సరైన స్పందన లేకపోవటం.. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి బాధితురాలు సోషల్ మీడియాలో వీడియో పోస్టు పెట్టటం.. దీనిపై జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగటం..దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కానీ రాపిడో స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతంలో అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ తన ఆఫీసుకు వెళ్లటానికి ఎప్పటిలానే తన ఇంటి నుంచి ఆఫీసుకు రాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకున్నారు. రైడ్ సగం దూరం వెళ్లిన తర్వాత (ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ వైపు వెళ్లే మార్గంలో) డ్రైవర్ జీపీఎస్ మ్యాప్ ను కాకుండా పూర్తిగా నిర్మానుష్యంగా.. చీకటిగా ఉండే ఒక అడవి లాంటి రూట్ లోకి బైక్ మళ్లించాడు. దీంతో భయపడిన బాధితురాలు బండిని ఆపాలని కోరారు. ఇది షార్ట్ కట్ గా అబద్ధం చెప్పిన డ్రైవర్ బండి వేగాన్ని పెంచాడు. దీంతో భయపడిన ఆమె అదనపు డబ్బులు ఇస్తానని..బండి తక్షణమే ఆపాలని కోరారు. అయినప్పటికి బైక్ మాత్రం ఆపకుండా.. సదరు డ్రైవర్ మరింత వేగంగా వాహనాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో తనపై ఏదైనా ఘోరం జరుగుతుందన్న ప్రాణభయంతో ఆమె వేగంగా వెళుతున్న స్కూటర్ మీద నుంచి రోడ్డుపైకి దూకేశారు.

ఆమె కిందపడటాన్ని చూసినా కూడా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా పారిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి రక్షించారు. ఓవైపు గాయాలు.. మరోవైపు షాక్ లో ఉన్న ఆమె జరిగిన ఉదంతం గురించి తన సోదరుడికి సమాచారం అందించారు. అదే సమయంలో రాపిడో అత్యవసర సేవలకు సమాచారం అందించారు. షాకింగ్ అంశం ఏమంటే.. రాపిడో నుంచి స్పందన సరిగా లేకపోవటంతో బాధితురాలు విస్తుపోయిన పరిస్థితి. అంతలో ఆమె సోదరుడు అక్కడకు రావటం.. ఆ ప్రాంతం జనాలు అస్సలు తిరగని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించారు. అక్కడి వారు సాయం చేయటంతో ఆమె కుటుంబ సభ్యుల్ని వెంటనే చేరుకోవటంతో పెద్ద ప్రమాదంనుంచి తప్పించుకున్నట్లైంది.

వేగంగా వెళుతున్న బైక్ మీద నుంచి కిందకు దూకేయటంతో తల మీదా.. ఒంటి మీద పలుచోట్ల గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అత్యవసర సాయం కోసం రాపిడో సంస్థను సంప్రదిస్తే వారి నుంచి సానుకూల స్పందన లేదని ఆమె పేర్కొన్న వైనం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాపిడో నుంచి తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు షేర్ చేశారు.

‘‘ప్రమాదం జరిగిన వెంటనే రాపిడో కస్టమర్ సపోర్ట్ టీమ్ ను సంప్రదించారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీస సాయం అందలేదు. ఇది నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగల్ యాక్షన్ లో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిందితుడైన డ్రైవర్ వివరాలు ఇవ్వాలని కోరాను. కంపెనీ మొదట స్పందించలేదు. నేను నా ఫిర్యాదుపై రాపిడో నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో విధిలేని పరిస్థితుల్లో సోషల్ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. యాప్ లలో ఉండే భద్రతా ప్రమాణాల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో సదరు ఘటన నిరూపిస్తోందన్న ఆవేదనను బాధితురాలు వ్యక్తం చేయటం గమనార్హం. ఒంటరిగా మహిళలు ప్రయాణం చేసే ప్రతి సందర్భంలో ఎప్పుడూ లైవ్ లొకేషన్ ను కుటుంబ సభ్యులకు షేర్ చేయాలని ఆమె కోరారు.

ఈ వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో రాపిడో స్పందించింది. జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ సోషల్ మీడియా పోస్టువైరల్ తర్వాత కంపెనీ అధికారికంగా క్షమాపణలు చెబుతూ.. తాము తీసుకున్న చర్యల గురించి వెల్లడించింది. రాపిడో అధికారిక ప్రకటనలో పేర్కొన్న అంశాలేమంటే.. బాధితురాలితో ఫోన్ కాల్ లో మాట్లాడినట్లుగా.. తాము ఈ సమస్య తీవ్రతను పూర్తిగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. నిందితుడైన డ్రైవర్ ఖాతాను ఫ్లా్ ఫారమ్ నుంచి శాశ్వతంగా రద్దు చేసినట్లుగా వెల్లడించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి వీలుగా డ్రైవర్ పూర్తి వివరాలను బాధితురాలికి ఈమొయిల్ ద్వారా పంపినట్లు తెలిపింది.

బాధితురాలికి తాము అండగా ఉంటామని.. అవసరమైన వైద్య సదుపాయాలు, న్యాయపరమైన సాయం అందించేందుకు కట్టుబడి ఉంటామని చెబుతూ.. ‘ఎప్పుడు ఏ అవసరమైనా మేం అందుబాటులో ఉంటాం’ అని రాపిడో హామీ ఇచ్చింది. కాకుంటే.. ఇదంతా కూడా సోషల్ మీడియాలో సదరు సంస్థ నిర్లక్ష్యం గురించి బాధితురాలు ప్రశ్నించిన తర్వాతే కావటం గమనార్హం. ఈ ఉదంతం గురించి ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి నిందితుడి పూర్తి వివరాలు బయటకు రాలేదు. వ్యక్తిగత గోప్యతలో భాగమని చెబుతున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.