Begin typing your search above and press return to search.

ఢిల్లీ నిరసనలు : అక్కడ ఇబ్బందులు... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి యువత

దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ నిరసనల నిలయంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయడం.. ప్రధాన రహదారులపై విధించిన ఆంక్షలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   23 July 2026 5:55 PM IST
ఢిల్లీ నిరసనలు : అక్కడ ఇబ్బందులు... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి యువత
X

దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ నిరసనల నిలయంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోని 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయడం.. ప్రధాన రహదారులపై విధించిన ఆంక్షలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోజువారీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కే అయినప్పటికీ ఆ క్రమంలో సామాన్య ప్రజల దైనందిన జీవితం స్తంభించిపోవడం చట్టసభలు, ఉద్యమ నేతలు పునరాలోచించాల్సిన తీవ్రమైన అంశం.

ఈ ఆందోళనల నడుమ హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఇంట్లో చెప్పకుండా ఢిల్లీకి పయనమైన తీరు, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. "భయంగా ఉన్నా మేనేజ్ చేస్తా" అన్న ఆమె వ్యాఖ్యలు యువతలోని భావోద్వేగాన్ని నిరసన పట్ల ఉన్న ఆరాటాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, దీనివెనుక ఉన్న భద్రతా లోపాలను విస్మరించలేం. పరిచయం లేని నగరంలో అదీ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతంలో ఒంటరిగా అడుగుపెట్టడం సాహసం కావచ్చు కానీ, విచక్షణ అనిపించుకోదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించిన తీరు అభినందనీయం. రాజకీయాభిప్రాయాలకు అతీతంగా, ఒక రాష్ట్ర పౌరురాలి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఢిల్లీలో వసతి, భద్రత కల్పిస్తామని ముందుకు రావడం, ముందుగా కుటుంబానికి సమాచారం ఇవ్వాలని సూచించడం బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనం.

ఉద్యమాలకు భావోద్వేగం మాత్రమే సరిపోదు..దానికి ప్రణాళిక, భద్రత, చట్టబద్ధత తోడవ్వాలి. సమాజంలో మార్పు కోసం గొంతెత్తడం అభినందనీయమే.. కానీ ఆ పేరుతో స్వయం రక్షణను, కనీస కుటుంబ బాధ్యతలను విస్మరించడం సమర్థనీయం కాదు. ఉద్యమకారులు తమ నిరసనలను చట్టబద్ధంగా, ప్రజా జీవనానికి తీవ్ర భంగం కలగకుండా నిర్వహించడం ఎంత ముఖ్యమో, యువత భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా భద్రతా ప్రమాణాలను పాటించడం అంతే ముఖ్యం. రక్షణ లేని ఆవేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా వ్యథనే మిగుల్చుతుందని గ్రహించాలి.