నిరసనలతో ఢిల్లీ బ్రాండ్ కు గ్లోబల్ డ్యామేజ్
సెంట్రల్ ఢిల్లీ మార్కెట్లలో కమర్షియల్ అద్దెలు చాలా ఎక్కువ. ఆదాయం పూర్తిగా తగ్గి.. వ్యాపారుల ఖర్చులు మాత్రం అలానే ఉండటంతో వారు నిరసనల విషయంలో ఆగ్రహంతో ఉన్నారు.
By: Garuda Media | 17 Oct 2026 10:45 AM IST‘సర్’కు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ).. కాంగ్రెస్ మొదలుపెట్టిన నిరసనలు.. ఆందోళనలు అనూహ్య రీతిలో కొనసాగుతున్నాయి. విపక్షాలకు చెందిన విద్యార్థి విభాగాలు.. యూత్ విభాగాలతో పాటు పలు వామపక్ష భావజాలంతో నిండిన విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసనలకు సంబంధించిన ఊహించని పరిణామం ఒకటి శుక్రవారం చోటు చేసుకుంది. లెహ్రా దో తిరంగా ర్యాలీకి సీజేపీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనకారులు కన్నాట్ ప్లేస్ కు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను.. అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. కన్నాట్ ప్లేస్ తో పాటు దాని పరిసరాల్లో 2వేల మంది నిరసనకారులు చేరారు.
ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కన్నాట్ ప్లేస కు చేరుకున్న నిరసనకారులకు వ్యతిరేకంగా అక్కడకు చేరుకున్న స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేయటంతో వాతావరణం చల్లబడింది. ఈ సందర్భంగా ఢిల్లీలో అశాంతిని ప్రేరేపిస్తున్నామన్న ఆరోపణల్ని అభిజీత్ దీప్కే ఖండించినా.. వ్యాపార వర్గాలు మాత్రం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించటంతోనే వ్యాపార కార్యకలాపాలకు నష్టం కలుగుతుందని చెబుతున్నా.. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోతే.. జరగరానిది జరిగితే.. అది కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్నది మర్చిపోకూడదు.
ఇంతకూ గడిచిన ఐదారు రోజులుగా సాగుతున్న నిరసనలు.. ఆందోళనలతో ఢిల్లీలో వ్యాపారాలు దెబ్బ తిన్నాయా? వ్యాపార వర్గాలు చెబుతున్నట్లుగా ఈ నష్టం దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఈ వాదనలలో నిజమెంత? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. నిజానికి ఆందోళనలకు కేంద్ర బిందువుగా కన్నాట్ ప్లేస్.. దాని చుట్టుపక్కల ఉన్న జంతర్ మంతర్.. సెంట్రల్ పార్క్.. పార్లమెంట్ స్ట్రీట్ లాంటి ప్రాంతాలే అయినప్పటికి.. పోలీసుల ఆంక్షల కారణంగా ఖాన్ మార్కెట్, సాదర్ బజార్ లాంటివి కూడా ప్రభావితమయ్యాయి. దీంతో.. పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం వాటిల్లింది.
నిరసనకారుల్లో దూకుడుగా ఉండే విద్యార్థి సంఘాలు ఉండటంతో వారి నిరసనల్ని తాము వ్యతిరేకిస్తే తమ షాపుల మీద దాడులు జరుగుతాయేమోనని చాలామంది వ్యాపారులు భయపడ్డారు. అందుకే శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకు షాపులను మూసేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ చెప్పే మాటలకు జరుగుతున్న దానికి సంబంధమే లేదు. ఎందుకంటే.. శాంతియుతంగా తాము నిరసనలు చేపడుతున్నట్లు చెప్పినా.. కన్నాట్ ప్లేజ్ లో నిరసనకారులు మెరుపుదాడుల తరహాలో సెంట్రల్ పార్క్.. పాలికా బజార్ గేట్ల వద్దకు దూసుకువచ్చిన పరిస్థితి. దీంతో సహనం కోల్పోయిన స్థానిక వ్యాపారులు రంగంలోకి దిగి నిరసనకారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇండియాటుడేతో పాటు ఇతర ప్రముఖ మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం తాజా నిరసనల కారణంగా ఢిల్లీ వ్యాపార రంగానికి రూ.2వేల కోట్ల భారీ నష్టం వాటిల్లినట్లుగా పేర్కొనటం గమనార్హం. కన్నాట్ ప్లేస్ లో సాధారణంగా రోజుకు మూడు నుంచి ఐదు లక్షల వినియోగదారులు రద్దీకి భిన్నంగా యాభై వేలకు పడిపోయినట్లుగా చెబుతున్నారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న భయంతో పండుగ షాపింగ్ కోసం వచ్చే వారు సైతం మార్కెట్లకు రావటం మానేశారు.
భారీ బారికేడ్లు.. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు.. మెట్రో స్టేషన్ల మూసివేత కాణంగా వ్యాపార కార్యకలాపాలు 30 శాతానికి పరిమితమైనట్లుగా చెబుతున్నారు. పలు హోల్ సేల్ వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించి 95 శాతం వరకు నష్టాన్ని చవిచూసినట్లుగా చెబుతున్నారు. న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్.. ఖాన్ మార్కెట ట్రేడర్స్ అసోసియేషన్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం తాజా ఆందోళన కారణంగా ఢిల్లీ పరిధిలో రోజుకు రూ.200- రూ.300 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు నిలిచిపోతున్నట్లుగా పేర్కొన్నారు.
సెంట్రల్ ఢిల్లీ మార్కెట్లలో కమర్షియల్ అద్దెలు చాలా ఎక్కువ. ఆదాయం పూర్తిగా తగ్గి.. వ్యాపారుల ఖర్చులు మాత్రం అలానే ఉండటంతో వారు నిరసనల విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆందోళనలు పెద్ద షోరూంలతో పాటు.. దినసరి కూలీల మీద తీవ్రంగా పడటంతో వారు సైతం కోపంతో ఉన్నారు. ఢిల్లీ కిరాణా కమిటీ, డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ లాంటి పలు సంస్థలు నిరసనలపై ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీరి పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానాలు నిరసనల కారణంగా వ్యాపార వర్గాలు చట్టవిరుద్ధంగా నష్టపోతే రాజ్యాంగపరమైన పరిహార నిబంధనల కింద ఆ నష్టాన్ని నిరసనలు చేపట్టే నిర్వాహకుల నుంచే రికవరీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల 19 కల్పించినా.. అది ఇతరుల జీవనోపాధిని దెబ్బ తీయకూడదని సుప్రీం వెల్లడించింది. పండుగల సీజన్ పైనే ఆధారపడే చిన్న వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సరిగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్, లాయర్ల సంఘాలు ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశాయి. నిరసనలను జంతర్ మంతర్ లాంటినిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేస్తూ స్పష్టమైన నిబంధనావళిని తీసుకురావాలని.. వాణిజ్య కేంద్రాలు స్తంభించకుండా చూడాలని కోరాయి.
మరోవైపు ఫెడరేషన్ లాజ్ పత్ నగర్ ట్రేడర్స్ అసోసియేషన్, ఆటోమోటివ్ పార్ట్స్ మర్చంట్స్ అసోసియేషన్, సరోజినీ నగర్ మార్కెట్ షాప్ కీపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రధానమంత్రికి లేఖ రాస్తూ.. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అందులో పేర్కొంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా తాజా నిరసనలు.. ఆందోళనలు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఢిల్లీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నట్లుగా వాణిజ్య నిపుణులు.. వ్యాపార సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆందోళనలు..నిరసనలు చేయాల్సిందే. అదే సమయంలో తమ పోరాటం కోసం ఇతరులను బలి చేయటం సరైన చర్య కాదన్నది మర్చిపోకూడదు. మరి.. ఈ విషయంలో సీజేపీ.. ఇతరులు ఎలా స్పందిస్తారో చూడాలి.
