వాళ్లు స్టూడెంట్స్ కాదు.. ఆ పార్టీల అనుబంధ విభాగాలు
ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన విపక్షాలుగా ఉన్న రాజకీయ పార్టీలను తీసుకుంటే ఏపీలో వైసీపీ.. తెలంగాణలో బీఆర్ఎస్..బీజేపీలుగా చెప్పొచ్చు.
By: Garuda Media | 17 Oct 2026 10:45 AM ISTనిరసన చేసే వారిని నిరసనకారులుగా..ఆందోళనలు చేసే వారిని ఆందోళనకారులుగా.. ఇలా వారు చేసే పనికి తగ్గట్లు వారిని ఫలానా అని చెప్పటం ఉంటుంది. ఢిల్లీ వేదికగా సీజేపీ చేస్తున్న ఆందోళనలు.. నిరసనల్లో పాల్గొంటున్న వారిని పదే పదే విద్యార్థులుగా పేర్కొనటం మాత్రం ముమ్మాటికీ తప్పేనంటున్నారు. ఎందుకంటే.. వాస్తవంలో జరుగుతున్న దానికి.. మీడియాలో వస్తున్న కథనాల మధ్య వాస్తవాల అంతరం అంతకంతకూ పెరిగిపోవటమే దీనికి కారణం. ఒక ఉదాహరణతో విషయాన్ని మరింత సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది.
ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన విపక్షాలుగా ఉన్న రాజకీయ పార్టీలను తీసుకుంటే ఏపీలో వైసీపీ.. తెలంగాణలో బీఆర్ఎస్..బీజేపీలుగా చెప్పొచ్చు. ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకంగా నిరసన చేపడితే ఎవరు చేస్తున్నట్లు? కచ్ఛితంగా వైసీపీకి చెందిన వారని స్పష్టంగా చెప్పొచ్చు. అదే విధంగా తెలంగాణలో అయితే బీఆర్ఎస్.. బీజేపీకి చెందిన వారిగా చెప్పొచ్చు. అంతే తప్పించి వారిని ప్రజలుగా పేర్కొంటే అది తప్పే అవుతుంది. ఇప్పుడు అలాంటి తప్పే ఢిల్లీలో జరుగుతోంది.
ఎందుకంటే నిరసనల్లో పాల్గొంటున్న వారిలో సీజేపీ చెందిన వారు.వీరంతా ఎవరంటే.. వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు. వీరితో పాటు కలిసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అనుబంధ విద్యార్థి సంఘం. వీళ్లతో కాంగ్రెస్ విద్యార్థి.. యువజన విభాగంతో పాటు మమతకు చెందిన టీఎంసీ యువజన విభాగం.. సమాజ్ వాదీకి చెందిన వారు ఉన్నారు. అంటే.. దేశ రాజధానిలో జరుగుతున్న నిరసనలు.. ఆందోళనల్లో పాల్గొంటున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. వారిని విద్యార్థులుగా పేర్కొంటున్నారు. కానీ.. అందులో సగం మాత్రమే నిజమన్నది మర్చిపోకూడదు.
ఎందుకంటే వామపక్ష భావజాలానికి మద్దుతుగా నిలిచిన విద్యార్థి సంఘాలతో పాటు.. ఆమ్ ఆద్మీ.. కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే యూత్ వింగ్ లు నిరసనల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వేళ ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని విద్యార్థులుగా పేర్కొనటం వాస్తవాల్ని వక్రీకరించటమే అవుతుంది. విద్యార్థులు అనే పెద్ద చెట్టు ఉంటే.. దానికి వివిధ రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాలు.. యూత్ వింగ్ లు కొమ్ములుగా చెప్పొచ్చు. అలాంటి కొన్ని కొమ్ములు కలిసి నిరసనలు చేపడితే.. అది మొత్తం విద్యార్థులుగా.. యువతగా ఎలా చెప్పటం? అలా చెప్పటం తప్పే అవుతుంది కదా?
అంటే.. వంద మంది విద్యార్థుల్నే తీసుకుంటే.. ఒకే రకమైన భావజాలానికి చెందిన వారు పరిమితంగా ఉంటారు. అలాంటి వారిలో కొందరు చేపట్టే నిరసనల్ని చూపిస్తూ.. విద్యార్థులు చేస్తున్నారని ప్రచారం చేసుకోవటం వాస్తవాల్ని పక్కదారి పట్టించటమే తప్పించి మరొకటి కాదు. ఈ నేపథ్యంలో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ చెబుతున్నట్లు వారు ‘విద్యార్థులు’ కాదు రాజకీయ ప్రేరేపిత పార్టీలకు చెందిన యూత్ వింగ్ కు చెందిన వారు. అందరిని ఒకేగాటిన కట్టేయటం ద్వారా.. పరిమిత వర్గాల మద్దతు ఉన్న ఒక నిరసనకు మొత్తం యూత్.. మొత్తం విద్యార్థులు అండగా ఉన్నారన్న సందేశం తప్పే అవుతుంది. అందుకే.. స్పందించే విషయంలోనూ.. ఆందోళనల్ని అర్థం చేసుకునే అంశంలోనూ మరింత జాగురూకతో ఉండాల్సిన అవసరం ఉంది.
