Begin typing your search above and press return to search.

నేతలు నిర్బంధంలో.. జంతర్‌ మంతర్‌ వద్ద ఉత్కంఠగా సీజేపీ ఆందోళన

ఢిల్లీ వీధుల్లో ఈరోజు ఉదయం వినబడుతున్నది కేవలం పోలీసుల బూట్ల చప్పుడు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడుతోందన్న ఆగ్రహ జ్వాలల హోరు..

By:  A.N.Kumar   |   11 Oct 2026 11:02 AM IST
నేతలు నిర్బంధంలో.. జంతర్‌ మంతర్‌ వద్ద ఉత్కంఠగా సీజేపీ ఆందోళన
X

ఢిల్లీ వీధుల్లో ఈరోజు ఉదయం వినబడుతున్నది కేవలం పోలీసుల బూట్ల చప్పుడు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడుతోందన్న ఆగ్రహ జ్వాలల హోరు.. నాయకులను అర్ధరాత్రి వేళ అకారణంగా అరెస్టు చేసి ఇనుప సంకెళ్లు వేయవచ్చు గాక... కానీ ఒక ఆశయాన్ని, ప్రజా చైతన్యాన్ని ఏ సంకెళ్లైనా ఆపగలవా? తమకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు జైలు గోడల వెనుక ఉన్నప్పటికీ లొంగేది లేదంటూ గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని జంతర్‌మంతర్ వైపు అడుగులు వేస్తున్న వేలాది మంది కార్యకర్తల పోరాటం ఇప్పుడు యావత్ దేశం కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది. ఇది కేవలం ఒక రాజీనామా కోసం జరుగుతున్న నిరసన కాదు.. నాటి త్యాగాల పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సామాన్యుడు సాగిస్తున్న ఒక ఆవేదన భరితమైన ధర్మపోరాటం.. ఈ పోరాటం ఏ దిశగా వెళుతుందో చూడాలి మరీ..

దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసనల సెగ రోజురోజుకూ ఉద్రిక్తతలను సంతరించుకుంటోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ 'సిటిజెన్స్‌ ఫర్ జస్టిస్ అండ్ పీస్' (సీజేపీ) చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. ఎన్ని నిర్బంధాలు, ఆంక్షలు ఎదురైనా సరే తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. నేడు జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

నాయకులు లేకుండానే ఉద్యమం.. అసలైన సవాల్‌

ఈ ఆందోళనకు ముందుండి నడిపిస్తున్న కీలక నేతలు అభిజీత్‌ దీప్కే, అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉద్యమానికి దిశానిర్దేశం చేసే ముఖ్య నాయకులు అందుబాటులో లేని ఈ తరుణంలో.. కార్యకర్తలు, మద్దతుదారులు ఏ స్థాయిలో సమీకృతమవుతారనేది ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.

నాయకులను నిర్బంధించడం ద్వారా నిరసనలను పూర్తిగా అణచివేయగలమని భావిస్తున్న ప్రభుత్వ వ్యూహం ఫలిస్తుందా? లేక ఈ చర్యలు మరింతగా ఆందోళనకారుల్లో కసితో పాటు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా చేస్తాయా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఉదయం నుంచి జంతర్‌మంతర్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కోర్టులో నేతలు.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న తదుపరి పరిణామాలు

పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నేతలను ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు తీసుకునే నిర్ణయం.. ఆపై పోలీసుల తదుపరి చర్యలు ఈ ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో మొదలైన ఈ పోరాటం.. ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కులు.. భావప్రకటన స్వేచ్ఛ చుట్టూ తిరుగుతోంది.

జంతర్‌మంతర్‌ వద్ద ఏం జరగబోతోంది?

ఢిల్లీ పోలీసుల కఠిన ఆంక్షలు, అనుమతుల నిరాకరణ వంటి సవాళ్లను ఎదుర్కొంటూ సీజేపీ కార్యకర్తలు జంతర్‌మంతర్‌కు చేరుకుంటారా లేక ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిరసన భగ్నమవుతుందా అనేది వేచి చూడాలి. నేతలు లేకపోయినా కేడరే స్వయంగా ఈ ఆందోళనను విజయవంతం చేస్తుందా? లేక ఈ పరిణామాలు మరింత పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తాయా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాబోయే కొద్ది గంటల్లో ఢిల్లీ రాజధానిలో జరిగే పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నాయి.