Begin typing your search above and press return to search.

ఢిల్లీని వీడిపోవడమే బెటరా ?

ఢిల్లీ. దేశ రాజధాని. 140 కోట్ల మందికి పైగా ప్రజానీకాన్ని పాలించే ఒక ప్రభుత్వానికి కీలక స్థానం. ముఖ్య పట్టణం. ఢిల్లీ అన్నది రాజకీయ అధికార కేంద్రం కూడా.

By:  Satya P   |   3 Nov 2025 8:00 AM IST
ఢిల్లీని వీడిపోవడమే బెటరా  ?
X

ఢిల్లీ. దేశ రాజధాని. 140 కోట్ల మందికి పైగా ప్రజానీకాన్ని పాలించే ఒక ప్రభుత్వానికి కీలక స్థానం. ముఖ్య పట్టణం. ఢిల్లీ అన్నది రాజకీయ అధికార కేంద్రం కూడా. అక్కడ నుంచే ఎన్నో శాసనాలు అమలు అవుతాయి. అక్కడ నుంచే బలమైన ప్రభుత్వం దేశాన్ని పాలిస్తుంది. అందుకే ఢిల్లీ అంటే రాజు లాంటిదే. ఢిలీలో అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థతో పాటు అంతా ఉంటుంది. ఇక కోట్లాది మంది జనాలు ఉంటారు. ఢిల్లీకి ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. అలాంటి ఢిల్లీలో నివాసం ఉండడం అన్నది ఒకపుడు హోదా. ఒక గౌరవం. ఇపుడు చూస్తే వాటిని మించిన ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు.

కాలుష్యం కోరలలో :

ఎంత గొప్ప నగరం అయినా ఎంత ధీటైన మెగా సిటీ అయినా ఢిల్లీని వణికిస్తోంది కాలుష్యం. ఈ భూతం ప్రతీ ఏటా పంజా విసురుస్తోంది. అది ఏ ఏటికి ఆ ఏడు మరింతగా పెరుగుతోంది. దాంతో ఢిల్లీలో నివసించే వారిని ఇబ్బందులు పెడుతోంది. అనారోగ్యం సమస్యలతో పట్టి పీడించేలా చేస్తోంది. దాంతో శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గడగడ లాడుతుంది. వాయు కాలుష్యం తాలూకా నాణ్యతా ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోతాయి. దీనిని ఇంగ్లీష్ లో ఏక్యూఐ అంటారు. ఇది ఢిల్లీలో చాలా ప్రాంతాలలో ఏకంగా 400 పైదాటిపోతోంది. ఇది ప్రమాదానికి సంకేతాలుగా చెబుతున్నారు.

వీడితేనే సుఖం :

ఇక రానున్న మూడు నెలలు మరింత చలి వాతావరణం ఢిల్లీని కమ్మేస్తుంది. దానితో పాటుగా కాలుష్యం కూడా ఢిల్లీలో ఇంకా ప్రబలుతున్నది. అందుకే ఢిల్లీలో ఉన్న వారు ఈ కీలక సమయంలో వేరే చోటకు వెళ్తేనే మేలు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎయిమ్స్ మాజీ పల్మోనాలజిస్ట్ గోపీచంద్ ఖిల్నాని అయితే ఢిల్లీ వాసులకు ఒక మేలైన సూచన కూడా చేస్తున్నారు. ఎవరికి వీలైతే వారు తక్కువలో తక్కువ రెండు నెలల పాటు ఢిల్లీని దాటి ఎక్కడికైనా వెళ్ళిపోండి. దాని వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరూ బాగుంటారు అని సలహా ఇస్తున్నారు.

ఇదే ఉత్తమ మార్గం :

కాలుష్యం నుంచి తప్పించుకోవాలీ అంటే ఇంతకు మించిన ఉత్తమ మార్గం వేరేది లేదని ఆయన అంటున్నారు. అయితే అందరూ వెళ్ళలేకపోయినా పర్లేదు కానీ అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వారు ఊపిరి తిత్తుల వ్యాధులతో అవస్థలు పడుతున్న వారు ఇతరమైన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్న వారు అయితే తక్షణం ఢిల్లీని వీడిపోతేనే చాలా మంచిది అని అంటున్నారు. దీని వల్ల వారు హాయిగా ఉండగలుగుతారు అని ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సూచనలు చేశారు.

ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టం :

అంతకంతకు వాయు కాలుష్యం ప్రబలిపోతున్న ఈ దశలో ఆక్సిజన్ ని కూడా పీల్చుకోవడం చాలా కష్టంగా మారుతుందని ఆయన అంటున్నారు. గుండె జబ్బుల వారికి ఈ పరిస్థితులు ఏ మాత్రం క్షేమకరం కాదని అంటున్నారు. వీరంతా తక్కువ కాలుష్యం ఉన్న చోటకు వెళ్తే కనుక వారు బాగుంటారు అని అదే సరైన ఊరటగా వారికి ఉంటుందని అంటున్నారు.

కొంప ముంచుతున్న తీరు :

వాయు కాలుష్యం కొంప ముంచుతోంది అని అంటున్నారు. గతంలో బాగా పొగాకు లేదా ధూమపానం అలవాటు ఉన్న వారికి మాత్రమే వచ్చే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇపుడు వాయు కాలుష్యం పుణ్యమాని నూటికి యాభై మంది దాకా వస్తోంది అని ఆయన చెబుతున్నారు. పెద్ద చిన్నా తేడా లేకుండా లంగ్ క్యాన్సర్ కూడా దీని వల్ల వస్తోంది అని అంటున్నారు. అంతే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులు మెదడు మూత్ర పిండాల వ్యాధులతో పాటు పేగులు జీర్ణ వ్యవ్స్థ కూడా ఈ వాయు కాలుష్యం వల్ల దెబ్బ తింటోందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ ప్రజలకు శీతాకాలం వచ్చింది అంటే మంచి గాలి అన్నది కరవు అవుతోంది. దాంతో ఫిబ్రవరి నెల దాకా ఇదే రకమైన పరిస్థితి ఉంటోంది. దానిని అధిగమించేందుకు కొన్నాళ్ళ పాటు ఢిల్లీని వీడిపోవడమే బెటరా అంటే అదే మంచిది అన్నది ఆరోగ్య నిపుణుల సూచనగా ఉంది.