Begin typing your search above and press return to search.

జంతర్ మంతర్ మూసివేత.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలోని రాజకీయ, సామాజిక నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన జంతర్ మంతర్ ను మూసివేస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Political Desk   |   12 Oct 2026 3:17 PM IST
జంతర్ మంతర్ మూసివేత.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం
X

దేశ రాజధాని ఢిల్లీలోని రాజకీయ, సామాజిక నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన జంతర్ మంతర్ ను మూసివేస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు ధర్నా చౌక్ గా ఉన్న జంతర్ మంతర్ ను ఢీనైటిఫై చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యామ్నాయంగా రామ్ లీలా మైదాన్ తోపాటు బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండులలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం ఇండి కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ యువత తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఏంటీ జంతర్ మంతర్?

జంతర్ మంతర్ పేరు వినగానే అందరికీ ఢిల్లీ గుర్తుకు వస్తుంది. పార్లమెంటు, ఎర్రకోట వంటి చారిత్రక, రాజకీయ ప్రాధాన్యం ఉన్న ముఖ్యమైన ప్రదేశాలతోపాటుగా జంతర్ మంతర్ కు దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజానికి ఖగోళ శాస్త్రంపై అధ్యయనం కోసం 1724లో జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ 2 జంతర్ మంతర్ ను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గ్రహాల స్థితిగతులను కచ్చితంగా గణించడం కోసం జంతర్ మంతర్ పేరిట ఖగోల వేధశాల నిర్మించారని అంటున్నారు. పార్లమెంటు స్ట్రీట్ లో ఉండే ఈ చారిత్రక నిర్మాణం 1993 నుంచి నిరసనలకు కేంద్రస్థానంగా మారినట్లు పరిశీలకులు చెబుతున్నారు.

బోట్ క్లబ్ నుంచి జంతర్ మంతర్

స్వాతంత్ర్యానంతరం ఢిల్లీలో ప్రధాన నిరసనలకు ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్' వేదికగా ఉండేదని చెబుతున్నారు. 1993 వరకు బోట్ క్లబ్ లోనే నిరసనలు, ర్యాలీలకు అనుమతి ఇచ్చేవారు. అయితే ప్రముఖ రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు బోట్ క్లబ్ ను ముట్టడించి ఢిల్లీని దిగ్బంధించిన తర్వాత నిరసనల కేంద్రాన్ని బోట్ క్లబ్ నుంచి జంతర్ మంతర్ కు మార్చినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 1993 నుంచి పార్లమెంటు స్ట్రీట్ లో ఉన్న జంతర్ మంతర్ ను ధర్నాలకు అధికారిక వేదికగా గుర్తించడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలతో సెంట్రల్ ఢిల్లీలోని ప్రముఖుల భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతోపాటు సామాన్య జీవనానికి ఇబ్బందులు తలెత్తడం వల్ల జంతర్ మంతర్ లో ధర్నాలు, నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

దేశాన్ని కుదిపేసిన ఉద్యమ కేంద్రం

జంతర్ మంతర్ అంటే ఒక్క ఖగోల వేధ శాల మాత్రమే కాదు దేశాన్ని కుదిపేసిన ఎన్నో చారిత్రక ఉద్యమాలకు కేంద్రంగా గుర్తు చేసుకుంటారు. 2011 ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలోని మొదలైన లోక్‌పాల్ ఉద్యమం సహా వేలాది రైతు, కార్మిక, ప్రజా సంఘాల నిరసనలకు వేదికగా నిలిచి దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ అపారమైన ఖ్యాతి గడించిందని అంటున్నారు. ఇక గత జులైలో జెన్ జీ యువత పార్లమెంటు ముట్టడించేందుకు జంతర్ మంతర్ ను వేదికగా మలచుకోవడం, ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల వల్ల కేంద్రం తీవ్ర ఒత్తిడికి లోనైందని అంటున్నారు. దీంతో ధర్నా శిబిరాలను జంతర్ మంతర్ నుంచి దూరంగా తరలించాలని భావించారని అంటున్నారు.

జంతర్ మంతర్ సమీపంలో ముఖ్యమైన భవనాలు

జంతర్ మంతర్ ప్రాంతం అత్యంత కీలకమైన రాజకీయ, ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో ఉండటం వల్లనే ఇక్కడ నిరసనలకు ప్రాధాన్యత ఉంటోందని అంటున్నారు. ఇదే కారణంగా ముఖ్య నాయకులు, ప్రముఖుల భద్రతకు సవాళ్లు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, సెక్రటేరియట్ వంటి ముఖ్యమైన భవనాలు కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండటంతో వాటిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకారులకు తేలిక అవుతూందని అంటున్నారు. ఇక కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉండటం వల్ల సామాన్యుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.

ఆ మూడు చోట్లే ఎందుకు?

జంతర్ మంతర్ ను మూసివేయాలని నిర్ణయించిన పోలీసులు రామ్‌లీలా మైదాన్, సీబీడీ గ్రౌండ్ (తూర్పు ఢిల్లీ), బురాడీ గ్రౌండ్‌లను ప్రత్యామ్నాయాలుగా ప్రకటించడానికి కారణాలు ఏంటి అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. పక్కావ్యూహంతోనే పోలీసులు ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేశారని అంటున్నారు. పార్లమెంట్, ఇతర అత్యున్నత అధికార కేంద్రాలకు అత్యంత సమీపంలో జంతర్ మంతర్ ఉండటం వల్ల, అక్కడ జరిగే నిరసనలు తక్షణమే దేశవ్యాప్తంగా, పార్లమెంట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోందని, ముఖ్యంగా మీడియాను విపరీతంగా ఆకర్షిస్తూ పెద్ద ప్రచారం దక్కేలా చేస్తోందని అంటున్నారు.

ప్రత్యామ్నాయ వేదికలుగా ఎంపిక చేసిన బురాడీ, సీబీడీ గ్రౌండ్స్ నగర శివారు ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా జంతర్ మంతర్ విస్తీర్ణం చాలా తక్కువగా అంటే కేవలం రెండు నుంచి మూడు ఎకరాల మధ్యనే ఉండటం వల్ల పట్టుమని వెయ్యి మంది వచ్చినా పెద్దగా ఆకర్షిస్తోందని, అదే ప్రత్యామ్నాయ స్థలాలలో అయితే ఒక మూలకు కూడా సరిపడరని, దానివల్ల పెద్ద ప్రభావం చూపకపోవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు అయిన రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ, సీబీడీ గ్రౌండ్స్ లో ఖాళీ స్థలం సుమారుగా 40 ఎకరాలు ఉంటుందని, అక్కడ ఎన్ని వేల మంది వచ్చినా ఢిల్లీలో సామాన్య జీవనానికి ఇబ్బంది ఉండదని అంటున్నారు. మొత్తానికి జంతర్ మంతర్ నిరసనలతో సామాన్యులకు ఎదురవుతున్న సమస్యలకు చరమగీతం పాడటానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సాహసోపేతమైనదిగా అభివర్ణిస్తున్నారు.