Begin typing your search above and press return to search.

చట్టం మారింది .. తీర్పు మారింది !

తాజాగా ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరాం భంభానీ చెప్పిన అంశాలు సంచలనంగా మారాయి.

By:  Garuda Media   |   16 Oct 2026 9:32 AM IST
చట్టం మారింది .. తీర్పు మారింది !
X

ఒక మైనర్ బాలిక తల్లి తనను బెదిరించి మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసిందని 2024 జులైలో ఢిల్లీలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన ఢిల్లీ హైకోర్టు ‘ఒక మహిళ నేరుగా లైంగిక చర్యకు పాల్పడకపోయినా బాధితురాలి మీద అత్యాచారానికి సహకరిస్తే ఆమె మీద గ్యాంగ్ రేప్ కేసు పెట్టవచ్చని, గ్యాంగ్ రేప్‌లో ఒక వ్యక్తి శారీరకంగా రేప్ చేయకపోయినా, ఉమ్మడి ఉద్దేశం ఒకటే కాబట్టి కేసు నమోదు చేయొచ్చని’ వ్యాఖ్యానించింది.

తాజాగా ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరాం భంభానీ చెప్పిన అంశాలు సంచలనంగా మారాయి. ఐపీసీ సెక్షన్ 376డి, బీఎన్ఎస్ సెక్షన్ 79లో పర్సన్ అనే పదాన్ని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయడానికి ఎలాంటి కారణం లేదని వ్యాఖ్యానించారు. మహిళ ఒక్కరే సొంతంగా గ్యాంగ్ రేప్ చేయలేరని, కానీ గ్రూప్ లో ఉండి సహకరిస్తే చార్జ్ చేయవచ్చని వెల్లడించారు.

2013 సవరణ తర్వాత గ్యాంగ్ రేప్ ప్రత్యేక నేరంగా మారింది. 2006లో సుప్రీంకోర్టు మహిళపై గ్యాంగ్ రేప్ కేసు పెట్టలేమని చెప్పింది. అయితే 2013లో సవరణ జరిగిన నేపథ్యంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కొత్త వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే పాత సుప్రీంకోర్టు తీర్పులు ఇప్పుడు పాత కేసులకు వర్తించవని చెబుతున్నారు.

2006లో మధ్యప్రదేశ్ లో బాధితురాలు స్పోర్ట్స్ మీట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా సాగర్ రైల్వే స్టేషన్ లో భాను ప్రతాప్ పటేల్ అనే వ్యక్తి ఆమె తండ్రి పంపించాడని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం జరుగుతున్న సమయంలో అతని భార్య ప్రియా పటేల వచ్చింది. బాధితురాలు తనను కాపాడమని ఆమెను వేడుకున్నా ప్రియా పటేల్ ఆమెను కొట్టి తలుపు మూసి వెళ్లిపోయింది.

ఈ సంఘటనలో భాను ప్రతాప్ పటేల్ మీద ఐపీసీ 323, 376, ప్రియా పటేల్ మీద ఐపీసీ 323, మరియు 376(2)జి సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ కేసులో ప్రియా పటేల్ మీద ఛార్జ్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు సరయినదిగా ధృవీకరించింది. దీనిపై ప్రియాపటేల్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిని విచారించిన స్టిస్ అరిజిత్ పసాయత్, జస్టిస్ ఎస్.హెచ్. కపాడియా బెంచ్ ‘మహిళను గ్యాంగ్ రేప్ కింద ఛార్జ్ చేయలేమని, ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం రేప్ చేయగలిగేది పురుషుడు మాత్రమే’ అని వెల్లడించింది. 2013లో చట్టంలో సవరణల మూలంగా ఢిల్లీ హైకోర్టు తాజా నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.