ఆసియాలోనే తొలిసారి.. ఢిల్లీ వైద్యుల ఘనత అద్భుతః!
ఢిల్లీ వైద్యులు చరిత్ర సృష్టించారు. వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇందులో భాగంగా... మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు.
By: Raja Ch | 9 Nov 2025 10:00 PM ISTఢిల్లీ వైద్యులు చరిత్ర సృష్టించారు. వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇందులో భాగంగా... మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. మరణించిన ఆమె అవయువాలను దానం చేసేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఫలితంగా... ఆసియాలోనే మొదటి సారిగా ఈ ఘనత సాధించినవారయ్యారు.
అవును... ఢిల్లీ వైద్యులు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఇందులో భాగంగా... ద్వారకలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు, మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచే కాకుండా ఇకపై సహజ మరణాల తర్వాత కూడా మృతుల నుంచి అవయవాలు సేకరించడం సాధ్యమేనని నిరూపించామన్నారు.
వివరాళ్లోకి వెళ్తే... మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా మంచం పట్టి, పక్షవాతానికి గురైన గీతా చావ్లా అనే 55 ఏళ్ల మహిళను నవంబర్ 5న మణిపాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో నవంబర్ 6న రాత్రి 8:43 గంటలకు ఆమె మరణించింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు.. ఆమె అవయువదానం గురించి వైద్యులకు చెప్పారు.
దీంతో... ఆమె అవయవాలను దానం చేయాలనే కోరికను గౌరవిస్తూ.. వైద్య బృందం నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ (ఎన్.ఆర్.పీ) అనే అరుదైన, సంక్లిష్టమైన ప్రక్రియను నిర్వహించింది. ఆమె గుండె ఆగిపోయి, ఈసీజీ లైన్ ఫ్లాట్ అయిన ఐదు నిమిషాల తర్వాత ఆమె చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా ఎక్స్ ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ (ఈసీఎంఓ) ఉపయోగించారు.
ఫలితంగా.. ఆమె అవయవాలలో రక్త ప్రసరణను విజయవంతంగా పునఃప్రారంభించారు. అనంతరం అవయువాలు సేకరించారు. సరికొత్త వైద్య చరిత్రకు నాంది పలికారు.
స్పందించిన వైద్యులు!:
ఈ సందర్భంగా స్పందించిన మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్... అవయవాలను దానం చేయడానికి, భద్రపరచడానికి.. మరణానంతరం రక్త ప్రసరణను పునఃప్రారంభించడం ఆసియాలో ఇదే మొదటిసారని అన్నారు. భారతదేశంలో సాధారణంగా మెదడు మరణం తరువాత అవయవ దానం జరుగుతుందని.. ఆ సమయంలో గుండె ఇంకా కొట్టుకుంటోందని తెలిపారు.
అయితే ఆమెకు గుండె ఆగిపోయింది కాబట్టి.. సమయం చాలా కీలకంగా మారిందని.. ఎన్.ఆర్.పీ. ఉపయోగించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలను సురక్షితంగా తిరిగి పొందడం జరిగిందని.. వాటిని తగినంత కాలం సజీవంగా ఉంచగలిగామని తెలిపారు. ఆమె కార్నియా, చర్మాన్ని కూడా దానం చేశారని తెలిపారు.
ఆ అవయువాలు ఎవరెవరికి దానం అంటే...!:
జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్.ఓ.టీ.టీ.ఓ) తక్షణ మార్పిడి కోసం అవయవాలను కేటాయించింది. ఇందులో భాగంగా... చావ్లా కాలేయాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ లో ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేయగా.. ఆమె మూత్రపిండాలను సాకేత్ లోని మాక్స్ హాస్పిటల్ లో ఉన్న 58, 63 ఏళ్ల వయస్సు గల మరో ఇద్దరు గ్రహీతలకు ఇచ్చారు.
