ఆ మాజీ సీఎం ఫ్యామిలీ..క్రిమినల్ సిండికేట్..కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
అధికారం కోల్పోయి 20 ఏళ్లు దాటినా.. మరో ఐదేళ్లు కూడా అధికారం దూరమే అయినా.. ఆ మాజీ సీఎం కుటుంబాన్ని అవినీతి కేసులు వదలడం లేదు.
By: Tupaki Political Desk | 9 Jan 2026 1:52 PM ISTఅధికారం కోల్పోయి 20 ఏళ్లు దాటినా.. మరో ఐదేళ్లు కూడా అధికారం దూరమే అయినా.. ఆ మాజీ సీఎం కుటుంబాన్ని అవినీతి కేసులు వదలడం లేదు. ఒకప్పుడు పశువుల దాణా కుంభకోణం.. తర్వాత ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం వెంటాడుతోంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవించిన వారికి కోర్టుల్లో పదేపదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ల్యాండ్ స్కాంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారి కుటుంబం ఓ క్రిమినల్ సిండికేట్ లా మారిందని మండిపడింది. ఈ స్కాంలో ఆయన కుటుంబ సభ్యులు, సహాయకులను కూడా కుట్రదారులుగా అభివర్ణించింది.
15 ఏళ్ల అధికారం.. 20 ఏళ్ల వియోగం..
సమోసాలో ఆలూ.. బిహార్ లో లాలూ.! ఇదీ ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తరచూ చెప్పే మాట. ఆ క్రమంలోనే 1990 నుంచి 2005 వరకు లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి పదిహేనేళ్లు పాలించారు. నాడు వారిపై పశువుల దాణా కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. లాలూ జైలుకు కూడా వెళ్లారు. ఇక 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడంతో లాలూ రైల్వే మంత్రి అయ్యారు. అయితే, ఆ సమయంలోనే ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో విచారణ ఢిల్లీ కోర్టులో జరిగింది.
అది ఐఆర్సీసీటీసీ స్కాం..
లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అవినీతి జరిగిందనేది ఆరోపణ. ఈ కాంట్రాక్టులను సుజాత హోటల్ కు అప్పగించారు. దీనికి బదులుగా లాలూ కుటంబం బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో మూడు ఎకరాల భూమిని పొందారని సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో పాటు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ట్రయల్ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. దీనిని సవాల్ చేస్తూ లాలూ ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగానే లాలూ కుటుంబం క్రిమినల్ సిండికేట్ లా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయ పడింది. నిర్దోషులుగా విడుదల చేయాలన్న పిటిషన్ ను తిరస్కరించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం... లాలూ కుటుంబ సభ్యులు, సహాయకులను కుట్రదారులుగా అభివర్ణించింది. లాలూ దంపతులతో పాటు కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్, కుమార్తె మీసా భారతి సహా ఆయన కుటుంబ సభ్యులపై బలమైన ఆరోపణలు ఉన్నట్లు పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది.
