సాంప్రదాయానికే సిగ్గుచేటు.. ఢిల్లీ రెస్టారెంట్ తీరుపై నెటిజన్స్ ఫైర్!
సాధారణంగా ఇండియన్ కల్చర్ కి ఎంత పెద్ద గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Madhu Reddy | 8 Aug 2025 7:00 PM ISTసాధారణంగా ఇండియన్ కల్చర్ కి ఎంత పెద్ద గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండియన్ కల్చర్ ని విదేశీ యువతీ యువకులు ఎంతగానో ఇష్టపడతారు. ఇండియన్ కట్టు బొట్టు అంటే చాలామంది ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు. అటు విదేశీ యువతులు ఇండియాకి వచ్చి లంగా వోణీలు, చీరలు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ.. అలాగే మగవాళ్ళు కూడా పట్టు పంచెలు కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా విదేశీయులు సైతం ఇండియన్ కల్చర్ ని ఎంతగానో ఇష్టపడుతుంటే.. ఇండియన్స్ మాత్రం ఇండియన్ కల్చర్ ని పక్కన పెడుతూ విదేశీయులు వేసుకునే బట్టల్ని ధరిస్తూ ఇండియాకి ఉన్న గౌరవ మర్యాదల్ని పోగొడుతున్నారు.
ఇండియన్స్ అంటే ఒంటినిండా కట్టు, నుదుటిన బొట్టు తలలో పూలు ఇలా ఎంతో అద్భుతంగా ఊహించుకుంటారు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు మాత్రం చాలా పూర్తిగా మారిపోయారు. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ విదేశీయుల కంటే దారుణంగా తయారవుతున్నారు. విదేశీయులే మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే ఇక్కడి వాళ్ళు మాత్రం విదేశీయుల కంటే దారుణంగా తయారవుతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అక్కడక్కడ ఇండియన్ కల్చర్ ని పాటించే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అనడంలో సందేహం లేదు. కానీ అలా పాటించే వారికి కూడా ఎప్పుడూ ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ రెస్టారెంట్ కి సాంప్రదాయ వస్త్రాలు ధరించి వెళ్లిన కపుల్స్ కి అవమానం జరిగింది. గేటు దగ్గరికి వెళ్లిన ఆ జంటని అక్కడి నుండీ బయటికి పంపించేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఢిల్లీ లోని పితాంపురలో ఉండే ఓ రెస్టారెంట్ కి ఒక కపుల్ సాంప్రదాయమైన వస్త్రాధరణలో డిన్నర్ చేయడం కోసం వెళ్లారు. అయితే చూస్తుంటే చాలా సాంప్రదాయంగా కనిపించారు. కానీ ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి వీళ్ళు వేసుకున్న బట్టలు నచ్చలేదో లేక మన ఇండియన్ కల్చర్ నచ్చలేదో తెలియదు కానీ సాంప్రదాయ వస్త్రాధరణలో వెళ్లిన ఈ జంటను గేట్ లోపలికి కూడా రానివ్వకుండా గేటు దగ్గరే ఆపి అక్కడనుండి అటే బయటికి పంపించేశారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఈ వీడియో పై, రెస్టారెంట్ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ జంట కూడా సాంప్రదాయ దుస్తులు ధరిస్తే.. ఇలాంటి అవమానం జరుగుతుందా? అంటూ నిరాశ వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఇతర దేశాల వారే.. మన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటే.. ఇండియన్స్ మాత్రం వెస్ట్రన్ కల్చర్ మాత్రమే ఇక్కడ ఉండాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఇలాంటి సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడే వారిని తమ ప్రవర్తనతో బాధపెడుతున్నారు అంటూ మండి పడుతున్నారు.
అంతేకాదు రెస్టారెంట్ కి ఫుడ్ తినడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిష్టం వారిది. ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం. వాళ్ళు వేసుకునే బట్టల మీద ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి ఏం హక్కుంది. అలాంటి వస్త్రాలు ధరించకూడదని చెప్పడానికి వాళ్లెవరు? అంటూ ఈ విషయం తెల్సిన చాలామంది నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తిట్టి పోస్తున్నారు.
