Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది మృతి..24 మందికి గాయాలు.. ఉలిక్కిపడ్డ దేశం

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ పేలుడుకు సీఎన్‌జీ సిలిండర్ పేలుడు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

By:  A.N.Kumar   |   10 Nov 2025 8:23 PM IST
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది మృతి..24 మందికి గాయాలు.. ఉలిక్కిపడ్డ దేశం
X

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ (లాల్ ఖిలా మెట్రో స్టేషన్) గేట్ నెం. 1 సమీపంలో సోమవారం సాయంత్రం పార్క్ చేసి ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. 24 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు కారణంగా మంటలు భారీగా వ్యాపించి.. చుట్టుపక్కల ఉన్న మరికొన్ని వాహనాలకు కూడా అంటుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.

ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ అందించిన సమాచారం ప్రకారం... సాయంత్రం 6:56 గంటలకు మెట్రో స్టేషన్ దగ్గర కారు పేలినట్లుగా మొదటి సమాచారం అందింది. కారులో ఉన్న పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు మూడు నుంచి నాలుగు వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే పలు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ప్రతీ సోమవారం ఢిల్లీలో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.

సీఎన్‌జీ సిలిండర్ పేలుడుగా అనుమానం

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ పేలుడుకు సీఎన్‌జీ సిలిండర్ పేలుడు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఢిల్లీ పోలీసులు, ఫైర్ సర్వీసెస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా దిగ్బంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ "ఎర్రకోట మెట్రో గేట్ నెం. 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు గురించి మాకు సాయంత్రం 6:56 గంటలకి కాల్ వచ్చింది. పక్కనే ఉన్న కార్లు కూడా ప్రభావితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. పేలుడుకు మూలాన్ని దర్యాప్తు చేస్తున్నాం" అని తెలిపారు.

ఈ ఘటనలో పలు వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. ఎర్రకోట , లాల్ ఖిలా మెట్రో స్టేషన్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఈ పేలుడు వల్ల ప్రయాణికులు, స్థానికుల్లో కొంతసేపు ఆందోళన కలిగింది.

ప్రస్తుతం పేలుడుకు కారణమైన మరేదైనా ఏదైనా ఉగ్రవాద చర్యనా? లేక మండే పదార్థాలు లేదా యాంత్రిక లోపాలు ఉన్నాయేమోనని అధికారులు తనిఖీ చేస్తున్నారు. నేతాజీ సుభాష్ మార్గ్ , పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగినా, ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.

ఈ పేలుడుకు అసలు కారణం ఏమిటనే దానిపై ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ నుండి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.