కోట్ల రూపాయల క్లౌడ్ సీడింగ్ ఫ్లాప్: ఢిల్లీకి చుక్క వర్షం లేదు.. కానీ కొత్త పాఠం!
కృత్రిమ వర్షం కురవకపోవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.
By: A.N.Kumar | 31 Oct 2025 9:17 PM ISTఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై పోరాటంలో భాగంగా కృత్రిమ వర్షం (Cloud Seeding) కోసం ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఢిల్లీ ఆకాశం నుంచి ఒక్క చుక్క వాన కూడా కురవలేదు, దీంతో కాలుష్య నివారణ చర్యల్లో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
* భారీ ఖర్చు... శూన్య ఫలితం
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ-కాన్పూర్ సహకారంతో ఈ క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.3.21 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మూడు ట్రయల్స్‌కు గాను రూ.1.07 కోట్లు ఖర్చు చేశారు. అయితే, అక్టోబర్ 28న ప్రారంభమైన ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
కాన్పూర్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానాలు ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలపై సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. మేఘాల్లో దాదాపు 20 శాతం తేమ ఉన్నప్పటికీ, వర్షం మాత్రం కురవలేదు.
* తేమ కొరతే ప్రధాన కారణం
కృత్రిమ వర్షం కురవకపోవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మేఘాల్లో తగినంత తేమ లేకపోవడం వల్ల ఈ ప్రయోగం విఫలమైందని పేర్కొంటూ, ప్రభుత్వం ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.
* "విలువైన డేటా లభించింది": ఐఐటీ కాన్పూర్
ఈ వైఫల్యంపై ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ సానుకూలంగా స్పందించారు. "క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షం రాకపోయినా, మాకు విలువైన డేటా లభించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఇది దోహదం అవుతుంది" అని అన్నారు.
15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, ఈ ప్రయత్నం వల్ల PM 2.5 , PM 10 స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల నమోదైందని ఆయన తెలిపారు. అంటే వర్షం పడకపోయినా, గాలిలో కాలుష్య కణాల సాంద్రత కొద్దిగా తగ్గినట్లుగా తెలుస్తోంది.
* పర్యావరణవేత్తల ఆందోళన
పర్యావరణ నిపుణులు మాత్రం ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదని, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాలుష్య నియంత్రణకు వాతావరణ మార్పులపై ఆధారపడటం కన్నా, వాహనాల ఉద్గారాలు, పరిశ్రమల కాలుష్యం వంటి శాశ్వత మూలాలపై దృష్టి పెట్టి, వాటిని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం ఒక ఆరోగ్య సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కోట్ల ఖర్చుతో కూడిన క్లౌడ్ సీడింగ్ వైఫల్యం శాశ్వత పరిష్కారాల అవసరాన్ని మరింత నొక్కి చెబుతోంది.
