గాలి కొనుక్కుని అక్కడ బతకాలి...ఏమిటీ నరకం ?
నరకానికి మారు పేరు అనేక ఊళ్ళు ఉన్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీకి ఈ పరిస్థితిని ఎవరూ అసలు ఊహించలేదు.
By: Satya P | 26 Nov 2025 3:00 PM ISTభారత దేశం అంటే ప్రకృతి రమణీయతతో నాగరికతతో వర్ధిల్లుతుంది అని అంటారు. పచ్చని చెట్లు ఎత్తైన కొండలు. బ్రహ్మాండమైన వాతావరణం, ప్రాణాలను నిలబెట్టే స్వచ్చమైన గాలి అన్నది భారత్ కి ఉన్న పేరు. కానీ పారిశ్రామికీకరణ అభివృద్ధి చెంది మహా నగరాలను నల్లగా కాలుష్యం కమ్ముకుంది. దాంతో ఏ నగరం అయినా ఇపుడు భయంకరంగా మారుతోంది. కాలుష్యం అనే విషం తింటూ నగరవాసులు జీవిస్తున్నారు. మహా నగరాలలో జీవించే వారి రక్తం పరీక్ష చేస్తే అందులో ఏ లెవెల్ లో కాలుష్యం నీడలు దాగి ఉంటాయో అర్థం అవుతుంది అని చెబుతారు.
ఢిల్లీ భూతల నరకమా :
నరకానికి మారు పేరు అనేక ఊళ్ళు ఉన్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీకి ఈ పరిస్థితిని ఎవరూ అసలు ఊహించలేదు. ఢిల్లీలో సొంతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఇక ఢిల్లీకి అన్నీ హంగులే ఉన్నాయి. అభివృద్ధి కూడా ఉంది. పాలన అంతా అక్కడే ఉంది. అలాంటి ఢిల్లీ ఒక మంచి నగరంగా ఇన్నాళ్ళూ ఉంది. . కానీ ఇపుడు అక్కడ వాతావరణం కడు దారుణంగా ఉంది. దాంతో అక్కడ శీతాకాలం
వస్తే చాలు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్యంతో నిండిపోయింది. ఈ ప్రమాదంతో చిన్న పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
యమునా నది ఉన్నా :
ఒక వైపు యమునా నది ఉన్నా అది కూడా పూర్తిగా కాలుష్య భరితం అయింది అని అంటున్నారు. ఆ నది నీరు స్నానానికి పనికి రాదు అని అంటున్నారు. అలాగే అనారోగ్య సమస్యలకు ఆ నీరు కారణం అవుతుంది అని చెబుతున్నారు. అదే విధంగా ఢిల్లీ గాలి సైతం నాణ్యతా ప్రమాణాలు పడిపోయి ముప్పు తెచ్చిపెడుతోంది. ఈ గాలిని పీల్చిన వారికి ప్రాణ వాయువు దక్కడం లేదు, నేరుగా మెదడులోకి కాలుష్యం అనే విషం చేరి రోగాలని తెచ్చిపెడుతోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది గాలి నాణ్యత బాగా పతనం అయింది. ఇక ఈ నవంబర్ నెలలో గాలి నాణ్యత లెక్కలు తీస్తే ఏకంగా పీఎం 3.5 నుంచి పీఎం 10 దాకా చేరింది అంటే ఢిల్లీలో ఎలా నివసించగలరు అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.
డబ్బుంటేనే గాలి :
ఇక కాలుష్యం బారిన పడకుండా కాలుష్యాన్ని గాలి నుంచి వేరు వేసి ప్యూరిఫై మిషన్లతో గాలిని కొనుక్కునే వారు ధనవంతులు అయితే నేరుగా ముక్కు పుటాలలోకి చొచ్చుకుని వచ్చే కాలుష్యం గాలిని పీల్చితే ఇక బతికి బట్ట కట్టడం కష్టమే అని అంటూ రోదిస్తున్న వారు బక్క జీవులుగా ఉన్నారు తాజాగా చూస్తే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక బాలుడు బాధాకరమైన పరిస్థితిని చూస్తే ఢిల్లీ ఇలా అయిపోయింది ఏమిటి అనిపించకమానదు. ఢిల్లీలో బతికేందుకు ఎక్కడ నుంచో పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఒక కుటుంబంలో ఒక బాలుడు తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఢిల్లీ గాలిని పీల్చి ఆసుపత్రి పాలు అయ్యాడు. దాంతో ఆ కుటుంబం వేదన వర్ణనాతీతంగా ఉంది. చేతిలో డబ్బు ఉంటే ఢిల్లీలో బతకగలమని, ప్రభుత్వానికి మన ఆరోగ్యమేమీ ముఖ్యం కాదు అని ఆ కుటుంబం స్వయంగా బాధ వ్యక్తం చేసిందని ఒక విషయం సోషల్ మీడియాలో ఓ వీడియో తెర వైరల్ అయింది. దీనిని చూసిన వారు డబ్బుతో గాలిని కూడా కొనుక్కోవాలి అన్న మాట అంటున్నారు.
సవాల్ అయినా పరిష్కారం :
ప్రపంచంలో అనేక దేశాలలో కాలుష్యం సమస్య ఉంది. ఎందుకంటే అభివృద్ధి వెంటనే కాలుష్యం కూడా జత కడుతుంది. అలాంటి చోట రాజకీయాలను పక్కన పెట్టి అంతా ఒక్కటిగా నిలిచి కాలుష్యం పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అలాంటి ఐక్యత ఢిల్లీ కాలుష్యం విషయంలో రావాలని అంతా అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాలను రైతులు తగలబెడుతున్నారు. వారిని అదుపు చేయాలి. ఈ విషయంలో అంతా ఒక్కటిగా నిలిచి నచ్చచెప్పాలి. అంతే కాదు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం అయినా అంతా కలసి వారిని నిలువరించాలి. వాహన కాలుష్యం పట్ల నియంత్రణ చేయగలగాలి. ఇలా అంతా కలసి కేవలం ప్రజలు ఆరోగ్యం ప్రాణాలు అని ఆలోచిస్తేనే తప్ప ఢిల్లీ కాలుష్యానికి ముగింపు అన్నది దొరకదు. ఇది ఒక సవాల్. కానీ అంతా కలిస్తే జవాబూ ఉంది. లేకపోతే ఢిల్లీ చూస్తూండగానే కాలుష్యం కోరల్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇది ఇతర నగరాలకు కూడా ఇపుడు ఒక హెచ్చరికగా ఉండబోతోంది.
