Begin typing your search above and press return to search.

పేలుళ్లకు ముందు శాలరీ అడ్వాన్స్ అడిగిన నిందితుడు... ఇవిగో మెసేజ్ లు!

ఈ కేసులోని కీలక నిందితుల్లో ఒకరైన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ తన జీతంలో అడ్వాన్స్ కోసం అత్యవసరంగా వేడుకున్నాడని జాతీయ మీడియా నివేదించింది.

By:  Raja Ch   |   27 Nov 2025 3:00 AM IST
పేలుళ్లకు ముందు శాలరీ అడ్వాన్స్ అడిగిన నిందితుడు... ఇవిగో మెసేజ్ లు!
X

ఢిల్లీలోని ప్రసిద్ధ ఎర్రకోట సమీపంలో ఇటీవల ఘోరమైన కారు బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే... ఈ కారు బాంబు పేలుడుకు సుమారు రెండు నెలల ముందు.. ఈ కేసులోని కీలక నిందితుల్లో ఒకరు జీతంలో అడ్వాన్స్ కోసం వేడుకున్న ఎస్సెమ్మెస్ లు తాజాగా తెరపైకి వచ్చాయి.

అవును... ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఘోరమైన కారు బాంబు దాడి జరగడానికి సుమారు రెండు నెలల ముందు.. ఈ కేసులోని కీలక నిందితుల్లో ఒకరైన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ తన జీతంలో అడ్వాన్స్ కోసం అత్యవసరంగా వేడుకున్నాడని జాతీయ మీడియా నివేదించింది. దీనికి సంబంధించిన వాట్సప్ చాట్ స్కీన్ షాట్ లను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో నాడు కోరిన శాలరీ అడ్వాన్సు డబ్బులు ఉగ్రవాది దాడికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పైగా పేలుడుకు ఉపయోగించిన రూ.26 లక్షల్లో రూ.8 లక్షల వరకూ ఆదిల్ అందించాడని అంటున్నారు. దీంతో.. అవి శాలరీ అడ్వాన్స్ డబ్బులే అయ్యి ఉండొచ్చని చెబుతున్నారు!

అనంత్ నాగ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మాజీ సీనియర్ రెసిడెంట్ అయిన అదీల్.. ఈ ఏడాది మార్చిలో యూపీలోని సహారన్ పూర్ లోని ఒక ఆస్పత్రికి మారాడు. అక్కడ గౌరవప్రదమైన జీతం సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 6న అరెస్టు కావడానికి ముందు అతని ఫోన్ నుంచి డిలీట్ చేయబడిన మెసేజ్ లలో.. ఆస్పత్రిలో ఓ ఉన్నతాధికారికి డబ్బుల గురించి ఎస్సెమ్మెస్ లు పెట్టాడు!

ఇవిగో వాట్సప్ మెసేజ్ లు!:

ఈ క్రమంలో... సెప్టెంబర్ 5న.. "గుడ్ ఆఫ్టర్ నూన్ సర్.. నేను జీతం క్రెడిట్ అడిగాను.. డబ్బు చాలా అవసరంలో ఉన్నప్పుడు మీరు చాలా సహాయం చేసినవారవుతారు" అని మెసేజ్ పంపగా.. అనంతరం... "దయచేసి నా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయండి సర్... నేను ఇంతకు ముంది ఇచ్చిన అకౌంట్ కి" అని మరో మెసేజ్ పంపించాడు.

ఇక మరుసటి రోజు (సెప్టెంబర్ 6)న... "గుడ్ మార్నింగ్ సర్.. దయచేసి అలా చేయండి.. నేను చాలా కృతజ్ఞుడిని" అని మెసేజ్ పంపాడు. మరుసటి రోజు... "గుడ్ ఆఫ్టర్ నూన్ సర్.. ఆ అత్యవసర పరిస్థితి మరింత తీవ్రమైంది.. జీవితం వీలైనంత త్వరగా కావాలి సర్.. డబ్బు చాలా అవసరం ఉంది.. దయచేసి సహాయం చేయండి" అని మెసేజ్ పంపించాడు అదీల్!

ఇక సెప్టెంబర్ 9న పంపిన చివరి సందేశంలో.. "దయచేసి రేపు పంపండి.. నాకు చాలా అవసరం ఉంది సర్" అని ఉంది. దీంతో.. అతడు అడ్వాన్స్ పొంది ఉంటాడని.. ఆ డబ్బునే ఢిల్లీలోని కారు బాంబు పేలుడుకు ఉపయోగించి ఉంటాడని అంటున్నారు.

వైట్ కాలర్ టెర్రర్ నెట్ వర్క్!:

కాగా... ఢిల్లీ పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నలుగురు కీలక నిందితులను గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్.. లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్.. అనంతనాగ్ కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్.. పోషియాన్ కు చెందిన ముఫీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే. వీరంతా "వైట్ కాలర్ టెర్రర్ నెట్ వర్క్"లో భాగమని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి!