ప్రపంచంలోనే అత్యంత భద్రత ఉండే పుతిన్, జిన్‌పింగ్ సహా అగ్రనేతలు భారత్ లో ఎక్కడ బస చేస్తున్నారో తెలుసా?
అత్యున్నత భద్రతకు, దౌత్య విడిదులకు పేరుగాంచిన ప్రసిద్ధ ఐటీసీ మౌర్య హోటల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విడిది చేశారు.
By: A.N.Kumar | 12 Sept 2026 10:31 AM ISTప్రపంచ దౌత్య సమరానికి భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ రథసారథులంతా ఒకే చోటికి చేరుకోవడంతో ఢిల్లీ మహానగరం సర్వాంగ సుందరంగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలో రూపుదిద్దుకుంది. రష్యా, చైనా, ఇరాన్ సహా పలు దేశాల అధినేతల రాకతో రాజధానిలోని 5 స్టార్ లగ్జరీ హోటళ్లు దౌత్యపరమైన వ్యూహాలకు, అపూర్వ ఆతిథ్యానికి కేంద్ర బిందువులుగా మారాయి.
అత్యున్నత భద్రతకు, దౌత్య విడిదులకు పేరుగాంచిన ప్రసిద్ధ ఐటీసీ మౌర్య హోటల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విడిది చేశారు. ఆయన బస నిమిత్తం హోటల్ పరిసరాలను భద్రతా దళాలు పూర్తి ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ , వారి ప్రతినిధి బృందానికి తాజ్ ప్యాలెస్ రాజసమైన ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ నిరంతర నిఘా, ప్రత్యేక తనిఖీల నడుమ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు బ్రెజిల్, కజకిస్థాన్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాల ప్రతినిధి బృందాలకు ది ఒబెరాయ్ నివాసమైంది. దీంతో ఈ హోటల్ ఒక మినీ బ్రిక్స్ వేదికను తలపిస్తోంది. అలాగే యూఏఈ ఉన్నత స్థాయి ప్రతినిధులు ది లీలా ప్యాలెస్‌లో బస చేస్తున్నారు. అతిథుల వ్యక్తిగత అభిరుచులు, సంస్కృతికి తగినట్లుగా ప్రత్యేక మెనూలు, రాజసానుకూల సదుపాయాలను హోటల్ నిర్వాహకులు సిద్ధం చేశారు. వీటితో పాటు తాజ్ మహల్ హోటల్, ది లలిత్ వంటి ఇతర ప్రముఖ వేదికలలో ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, క్యూబా, బెలారస్, వియత్నాం తదితర దేశాల సీనియర్ అధికారులు, ప్రతినిధులు విడిది చేశారు.
ఈ చారిత్రాత్మక సదస్సు రాజధానిలోని పర్యాటక, హోటల్ రంగానికి మునుపెన్నడూ లేని కొత్త ఊపిరి పోసింది. దాదాపు 3,000కు పైగా అత్యున్నత స్థాయి లగ్జరీ గదులు బుక్ అవ్వడంతో ఢిల్లీ హాస్పిటాలిటీ రంగం భారీ వ్యాపార అవకాశాలను అందుకని కలకలలాడుతోంది. ప్రపంచంలోని మహాశక్తులన్నీ ఒకే వేదికపైకి చేరిన ఈ సమయంలో అగ్రనేతల భద్రత, వారి కోసం చేసిన ఆతిథ్య ఏర్పాట్లు ఈ బ్రిక్స్ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
