Begin typing your search above and press return to search.

కారుతో ఢీకొట్టి పక్కనున్న ఆసుపత్రిని వదిలేసి 19కి.మీ. తీసుకెళ్లటమా?

దీనికి కారణం రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కేంద్ర ఆర్థిక శాఖలో కీలక అధికారి కావటం ఒకటైతే.. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు సైతం హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి కావటం గమనార్హం

By:  Garuda Media   |   16 Sept 2025 9:27 AM IST
కారుతో ఢీకొట్టి పక్కనున్న ఆసుపత్రిని వదిలేసి 19కి.మీ. తీసుకెళ్లటమా?
X

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి కారణం రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కేంద్ర ఆర్థిక శాఖలో కీలక అధికారి కావటం ఒకటైతే.. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు సైతం హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి కావటం గమనార్హం. ఆధారాల్ని ధ్వంసం చేయటంతో పాటు.. తాము చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు.. కేసు తిప్పల నుంచి బయటపడేందుకు మనిషి ప్రాణాన్ని తీసేందుకు సైతం వెనుకాడకపోవటం ఏమిటి?అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తుంటారు నవ్ జ్యోత్ సింగ్. 52 ఏళ్ల వయసున్న ఆయన తన భార్య సందీప్ కౌర్ తో కలిసి గురద్వారాకు వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టూవీలర్ ను బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఈ ఉదంతంలో నవ్ జ్యోత్ సింగ్ మరణించారు. ఆయన సతీమణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ కౌర్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సమయంలో ఆమె చెప్పిన రెండు అంశాలు ఈ మొత్తం కేసు స్వరూపాన్నే మార్చేశాయి. అందులో మొదటిది.. తమను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలోనే తమ టూవీలర్ ను బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టిందని పేర్కొన్నారు. రెండో అంశం ఏమంటే.. ప్రమాదం జరిగిన వేళ.. నిందితులు తమను ఒక వ్యాన్ లో ఆసుపత్రిలో తరలించారన్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఆసుపత్రి ఉన్నప్పటికీ.. అందులో తమను చేర్చకుండా 19కి.మీ. దూరంలో ఉన్న న్యూలైఫ్ ఆసుపత్రికి తరలించారన్నారు. తమను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడినా నిందితులు మాత్రం దూరాన ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లటం.. మార్గమధ్యంలో తన భర్త మరణించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు నిందితుల వివరాల్నిసేకరించగా.. కారును ఢీకొట్టిన ఉదంతంలో ప్రధాన నిందితుడు గగన్ ప్రీత్ తండ్రి.. బాధితుల్ని తరలించిన ఆసుపత్రి సహయజమానిగా గుర్తించారు. దీంతో కేసును కప్పిపుచ్చుకునేందుకు వీలుగా తమ సొంత ఆసుపత్రికి తీసుకొచ్చారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో జరిగిందని భావించినా.. కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లాల్సిన దానికి బదులుగా 19కి.మీ.దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లటంలో అర్థమేంటి?అని ప్రశ్నిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందకు వీలుగా.. తమకు తగ్గట్లు ఆధారాల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యాన్ని బాధితులకు అందించిన చికిత్స గురించిన వివరాల్ని ఇవ్వాలని కోరగా.. తాము ప్రోటోకాల్ పాటించామని చెప్పటం గమనార్హం. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే ఉన్న ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతంపై జాతీయ మీడియా ఎక్కువగా కవర్ చేస్తోంది.