స్లీపర్ సెల్స్ యాక్టివ్ మోడ్ లో ?
దేశంలో ఎప్పటికపుడు ఉగ్రకదలికల మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దేశంలో ఈ ఆదివారమే పలు చోట్ల దాడులు నిర్వహించాయి.
By: Satya P | 11 Nov 2025 9:32 AM ISTదేశంలో దారుణ మారణ కాండలు అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు అధికార యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకుంటున్నా వేయి కళ్లతో కాపలా కాస్తున్నా గజానికి ఒక గాంధారి పుత్రుడు తయారైన పరిస్థితి ఉంది. దేశంలో ఎపుడు ఏమి జరుగుతుందో తెలియని నేపథ్యం ఉంది. ఉగ్ర దాడులు సంఖ్య అయితే తగ్గింది కానీ పూర్తిగా ఆగడం లేదు. ఇక ఈ ఏడాదిలో చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్ర భూతం పంజా విసిరి ఏకంగా ఇరవై ఆరు మందిని పొట్టిన పెట్టుకుంది. ఇపుడు చూస్తే ఢిల్లీ నడిబొడ్డున ఎర్ర కోట సమీపంలో కారు బ్లాస్ట్ జరిగి మారణ హోమం సంభవించింది. దీని వెనక ఎవరు ఉన్నారు ఏమిటి అన్నది తొందరలో బయటకు వస్తుంది కానీ ఈ భయానక ఘటనకు అయితే ఆగడం లేదు అన్నది దేశంలో సగటు పౌరుడి ఆవేదనగా ఉంది.
ఉగ్ర కదలికలతో :
దేశంలో ఎప్పటికపుడు ఉగ్రకదలికల మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దేశంలో ఈ ఆదివారమే పలు చోట్ల దాడులు నిర్వహించాయి. తమకు సమాచారం ఉన్న క్రమంలో అనుమాతితులను ప్రశ్నించడమే కదు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. అలా చూస్తే ఉగ్ర మూలాలు ఉన్న వారే అరెస్టు కావడం విశేషం.
భారీ కుట్ర చేధించారు :
అంతే కాదు ఒక్క దెబ్బతో వందలాది మందిని చంపడానికి గుజరాత్ నుంచి ఒక ఉగ్ర మూక చేస్తున్న కుట్రను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది. ఈ కుట్ర ఎలాంటిది అంటే ఆముదంతోనే విషం తయారు చేసి ఎంతో మందిని హతమార్చడం అన్న మాట. ఆముదం గింజలను ప్రాసెస్ చేసి ఆ మిగిలిన వేస్ట్ తో అత్యంత ప్రమాదం అయిన రైసిస్ అనే విష పూరితమైన రసాయనాన్ని తయారు చేశారు. దానిని జనాల మీద ప్రయోగిద్దామనుకునే లోగానే కుట్ర కోణం బయటపడింది. ఈ కుట్ర వెనక హైదరాబాద్ కి చెందిన ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్, మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
రోజు గడకముందే :
అయితే అక్కడ కుట్ర చేదించారు. కానీ ఇంతలోనే కేవలం గంటల వ్యవధిలోనే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మరి దానికీ దీనిని మధ్య లింక్ ఉందా ఇంకా ఏమైనా శక్తులు ఈ కుట్ర వెనక చేరాయా అన్నది ఇపుడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూపీ తీసే పనిలో పడింది.
స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయా :
ఈ దేశంలో గజానికి ఒక దుర్మార్గుడు అని చెప్పుకున్నట్లుగా ఉగ్ర లింకులు కలిగిన వారు అంతా అండర్ గ్రౌండ్ లో స్లీపర్ సెల్స్ గా ఉంటూ సరైన సమయంలో పడగ విప్పుతున్నారు. గతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం తగ్గాయి అనుకుంటే మళ్ళీ మొదలవుతున్నాయా అన్న భయం అయితే పట్టుకుంది. దీంతో ఈ ఘోరాలు దారుణాలు ఆగవా అన్న చర్చ మొదలైంది. మూలాల్లోకి ఎంత లోతుగా వెళ్తున్నా దేశంలో ఇంకా కొన్ని ఉగ్ర శక్తులు తమ పనిని కానిస్తున్న నేపథ్యం ఉంది. దాంతో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
