Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సింధూర్ 2.0...ఈసారి పగిలిపోయేలాగానే !

ఆయన మంగళవారం భూటాన్‌లోని తింపులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   11 Nov 2025 8:40 PM IST
ఆపరేషన్ సింధూర్ 2.0...ఈసారి పగిలిపోయేలాగానే !
X

పాకిస్తాన్ కి మరోసారి భారత్ చేతిలో పరాభవం ఎదురుచూస్తోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. భారత్ మీద ఉగ్ర దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తూ దాయాది పాక్ గత కొన్ని దశాబ్దాలుగా తనదైన ప్రచ్చన్న యుద్ధం చేస్తూ వస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పాక్ ఆటలు సాగడం లేదు, దెబ్బకు దెబ్బ తీస్తోంది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆరు నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీచమణచింది. దెబ్బకు రెండు రోజులు అయినా యుద్ధం చేయలేక పాక్ చేతులెత్తేసింది. ఆ విషయం అలా ఉండగానే మరోసారి భారత్ లో అందులో దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది పది మంది దాకా అమాయకులు ఈ మారణహోమంలో మరణించారు. అదే సమయంలో పాతిక నుంచి ముప్పై మంది దాకా అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది.

ఉగ్ర హస్తం ఉందంటూ :

ఇక జాతీయ దర్యాప్తు సంస్థలు చేపట్టిన ప్రాధమిక విచారణలో ఉగ్ర మూకల హస్తం ఈ భారీ పేలుడు వెనకాల ఉంది అని తేలినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు పాక్ కేంద్రంగా నడిచే జైషే మహమ్మద్ ఎర్ర కోట వద్ద పేలుడుకు కారణం అని అంటున్నారు. ఇక పహల్గాం ఉగ్ర దాడి తరువాత ఇది మరోసారి జరిగిన భారీ దాడి. ఇప్పటికే ఉగ్ర మూలాలు ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. దాంతో ఈ విషయం మీద కేంద్రం చాలా తీవ్రంగానే ఆలోచిస్తోంది. అని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కి కూడా వెనకాడేది లేదని ప్రచారం అయితే సాగుతోంది.

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోడీ :

ఇదిలా ఉంటే ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వెనుక కుట్రదారులను ఎవరు ఉన్నా అసలు వదిలిపెట్టబోమని బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆయన మంగళవారం భూటాన్‌లోని తింపులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సోమవారం రాత్రంతా ఈ ఘటనను పరిశీలించిన దర్యాప్తు ఏజెన్సీలతో తాను సంప్రదిస్తున్నానని చెప్పడం విశేషం. ఈ కుట్ర మీద అత్యంత లోతుగా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాదు బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక తాను ఈరోజు తాను చాలా బరువైన హృదయంతో భూటాన్‌కు వచ్చానని మోడీ అన్నారు. తాను గత సాయంత్రం ఢిల్లీలో జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా బాధ పడుతున్నానని అన్నారు. ఈ దారుణమైన ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇక బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానని, మొత్తం దేశం వారితో నిలుస్తుందని మోదీ చెప్పడం విశేషం.

గట్టి జవాబు తప్పదు :

ఇక కేంద్రంలోని పెద్దల వైఖరి చూసినా మోడీ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ చూసినా పాక్ కి మరోసారి గట్టి జవాబు చెప్పడం తప్పదని అంటున్నారు. ఈసారి భారత్ ఏ రూపంలో పాక్ మీద విరుచుకు పడుతుంది అన్నది చూడాల్సి ఉంది. కీలకమైన ఆధారాలు లభించిన వెంటనే ప్రపంచం ముందు పెట్టి మరీ పాక్ కి ఈసారి కోలుకోలేని దెబ్బ తీసేందుకు భారత్ చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి దేశ రాజధాని గుండెల్లో కోత కోసిన తీరు పట్ల అంతా రగిలిపోతున్నారు. దేశ జాతీయ పండుగను ఎంతో పవిత్రంగా చేసుకునే ఎర్ర కోట సమీపంలోనే ఈ ఘాతుకం జరగడంతో ఇది ప్రభుత్వం సైతం ఎంతో ప్రతిష్టగా తీసుకుందని అంటున్నారు. సో అనూహ్యమైన సంచలమైన పరిణామాలు అయితే తొందరలో జరగవచ్చు అని అంటున్నారు.