Begin typing your search above and press return to search.

ఢిల్లీకి టూరిస్టులు వస్తే ఇల్లు ఓపెన్... ప్రమాదం జరిగితే పాలసీ క్లోజ్!

ప్రస్తుతం దేశ రాజధానిలో వినిపిస్తోన్న హాట్ టాపిక్ ఇది. ఢిల్లీ ప్రభుత్వం ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా.. గొప్పగా చెప్పుకున్న ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ పాలసీ ఇప్పుడు ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరగడంతో దీనిపై పెద్ద చర్చకు, వివాదానికి దారి తీసింది.

By:  A.N.Kumar   |   5 Jun 2026 10:47 AM IST
ఢిల్లీకి టూరిస్టులు వస్తే ఇల్లు ఓపెన్... ప్రమాదం జరిగితే పాలసీ క్లోజ్!
X

ప్రస్తుతం దేశ రాజధానిలో వినిపిస్తోన్న హాట్ టాపిక్ ఇది. ఢిల్లీ ప్రభుత్వం ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా.. గొప్పగా చెప్పుకున్న ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ పాలసీ ఇప్పుడు ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరగడంతో దీనిపై పెద్ద చర్చకు, వివాదానికి దారి తీసింది. పర్యాటకులకు హోమ్లీ వసతి, స్థానిక ఇంటి యజమానులకు అదనపు ఆదాయం అనే అద్భుతమైన లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకం... ఇటీవల జరిగిన ఒక అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

కాగితాలపై రూల్స్ సూపర్... క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యం!

ఈ పాలసీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా మంచిదే. ఇంట్లో ఖాళీగా ఉన్న గదులను పర్యాటకులకు అద్దెకు ఇచ్చుకోవచ్చు. గరిష్ఠంగా ఆరు గదుల వరకే అనుమతి ఉంటుంది. ఖచ్చితమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. ప్రభుత్వ అధికారిక అనుమతులు తప్పనిసరి. ఇలా కాగితాల మీద, ప్రభుత్వ జీవోల్లో అన్నీ కరెక్టుగానే ఉన్నాయి. కానీ నేలమీద క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి.. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కమర్షియల్ లాడ్జీల్లా వీటిని నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో సెటైర్లు.. ‘టెన్షన్ టూరిజం’!

ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం సమయంలో అధికారులు తనిఖీలు చేస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రమాదం జరగగానే అధికారులు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అత్యవసర ద్వారాల కోసం వెతుకుతుంటే... కొందరు యజమానులు మాత్రం "అవన్నీ పాలసీ బుక్‌లో ఉన్నాయి సార్.. ఇక్కడ లేవు!" అన్నట్టుగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. టూరిజాన్ని పెంచుదామనుకుని తెచ్చిన పథకం.. తాజాగా ఢిల్లీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం.. విదేశీయులు 21 మంది వరకూ మరణించడంతో ఇప్పుడు "టెన్షన్ టూరిజం"గా మారిందంటూ సెటైర్లు వైరల్ అవుతున్నాయి. "ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాం అనుకున్నారు... చివరకు పాలసీనే బ్రేక్ అయిపోయింది!" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ కాస్తా ‘బెడ్ అండ్ బ్రేక్‌డౌన్’ పాలసీగా మారిందంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి?

ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ ప్రభుత్వాన్ని రక్షణలో పడేసింది. ఈ పాలసీని పూర్తిగా రద్దు చేయాలా? లేక నిబంధనలను మరింత కఠినతరం చేసి అమలు చేయాలా? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేవలం ఆదాయం, పర్యాటక రంగం వృద్ధిని మాత్రమే చూస్తే సరిపోదని, ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేనప్పుడు ఇలాంటి పాలసీలు వ్యర్థమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విమర్శకులు, నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే... ఇక్కడ "పాలసీ తప్పు కాదు... పాలసీని సరిగ్గా పాటించకపోవడం, అధికారులు పర్యవేక్షించకపోవడమే అసలు ప్రమాదం!". ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన తనిఖీలు చేపడితేనే పర్యాటకులకు రక్షణ, నగరానికి గుర్తింపు దక్కుతాయి.